పోతే.. పోండి!
- పార్టీ నుంచి వెళ్లేవాళ్లను ఆపను
- జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ
సాక్షి, బెంగళూరు : స్వార్థంతో పార్టీని వీడేవారిని ఎలాంటి పరిస్థితుల్లోనూ తాను ఆపబోనని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ అన్నారు. పార్టీ నుంచి ఎందరు నాయకులు బయటకు వెళ్లినా తాను భయపడనని స్పష్టం చేశారు. తన చివరి శ్వాస వరకూ పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. జేడీఎస్ నేతలు జమీర్ ఖాన్, చెలువరాయస్వామితో పాటు మరికొందరు శనివారం రహస్యంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను బేటీ అయ్యారు.
ఈ నేపథ్యంలో బెంగళూరులోని జేడీఎస్ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశంలో దేవెగౌడ మాట్లాడుతూ... ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు లేదని తాము చెబుతున్నా కొందరు రహస్యంగా సీఎంతో భేటీ కావడం వెనుక మర్మం అర్థం కావడం లేదని అన్నారు. ఇతర పార్టీలో చేరితే రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతామని భావిస్తే జేడీఎస్‌ను వీడి వెళ్లవచ్చునని చెప్పారు.
పార్టీని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా రానున్న శనివారం నుంచి తన నివాసాన్ని హాసనకు మారుస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ విధివిధానాలపై చర్చించేందుకు వీలుగా బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో సోమవారం బృహత్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు కార్యకర్తలను తరలించేందుకు ప్రత్యేక బస్సులను కేటాయిస్తున్నామన్నారు.