ప్రచారానికి తెర
- మూడు నియోజకవర్గాల్లో నేతల సుడిగాలి పర్యటనలు
- 21న పోలింగ్
- గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్
సాక్షి, బెంగళూరు : ఉప ఎన్నికల బహిరంగ ప్రచారానికి మంగళవారం సాయంత్రం తెరపడనుంది. గెలుపును బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. శికారిపుర, చిక్కొడి - సదలగా, బళ్లారి గ్రామీణ నియోజకవర్గాలకు ఈ నెల 21న ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు పార్టీలోని పలువురు నేతలకు ఈ ఉప ఎన్నికలు రాజకీయ దిశానిర్ధేశం చేయనున్నాయి. దీంతో ఎలాగైనా మూడు స్థానాలను దక్కించుకోవాలని సిద్ధరామయ్య పావులు కదుపుతున్నారు.
మంత్రులు సైతం వారం రోజులుగా అయా నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ బీజేపీ అభ్యర్థులపై, స్థానిక నేతలపై వాగ్భానాలు సంధిస్తూ వచ్చారు. శికారిపురలో విజయాన్ని కైవసం చేసుకునేందుకు రాజకీయ వైరుద్ధ్యాన్ని సైతం కాంగ్రెస్ పార్టీ పక్కనపెట్టి జేడీఎస్‌తో మద్దతు కూడగట్టుకుంది. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బీఎస్ రాఘవేంద్రపై కాంగ్రెస్ అభ్యర్థి శాంతవీరప్ప గౌడను గెలిపించడం కోసం కాంగ్రెస్ తన శక్తియుక్తులను ధారపోస్తోంది. అదేవిధంగా బళ్లారిలో ఎన్.వై.గోపాలకృష్ణ, చిక్కొడి-సదలగాలో గణేస్ హుక్కేరిని గెలిపించేందుకు వారం రోజులుగా ప్రధాన నేతలు అక్కడే తిష్టవేశారు.
ప్రభుత్వ వైఫల్యాలే ప్రచారాస్త్రాలుగా...
అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రచారాస్త్రాలుగా బీజేపీ సంధిస్తోంది. ఈ ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలో నెలకొన్న అభద్రతా భావం, మహిళలపై అత్యాచారాలు, స్థానిక సమస్యలను ఎండగడుతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తన కుమారుడు రాఘవేంద్రను గెలిపించుకోవడం ద్వారా మరోసారి తన సత్తాను చాటుకునేందుకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు యడ్యూరప్ప ప్రయత్నిస్తున్నారు.
బళ్లారిలో ఓబులేసు, చిక్కొడి-సదలగలో మహంతేష్ కపటిగిమఠ గెలిపించుకునేందుకు మాజీ సీఎం జగదీష్ శెట్టర్, పార్టీ అధ్యక్షుడు ప్రహ్లాదజోషి, ఎమ్మెల్సీ కే.ఎస్.ఈశ్వరప్ప, మాజీ డీసీఎం అశోక్ తదితర హేమాహేమిలు రంగంలో దిగారు. ఈ ఉప ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అటు ఎన్నికల కమిషన్‌తో పాటు రాష్ట్ర హోంశాఖ ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టింది.