తలైవా వచ్చేస్తున్నారు!
చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను తమ వైపునకు తిప్పుకోవడానికి జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ సహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు శక్తి వంచన లేకుండా తమకు తెలిసిన మార్గాల్లో గాలం వేస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ శూన్యతే ఇందుకు ప్రధాన కారణం కావచ్చు. అయితే రజనీకాంత్ అభిమానులు మాత్రం ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని, సొంతంగా పార్టీని నెలకొల్పి, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఏలాలని చాలా బలంగా కోరుకుంటున్నారు.
దీంతో తాజాగా ‘సమయం ఆసన్నమైంది తలైవా. రాజకీయాలా? సినిమాలా? సరైన నిర్ణయం తీసుకునే తరుణం ఇదే. తమిళప్రజలకు మంచి జరగాలంటే మీరు పాలించాలి. ఇది అభిమానులుగా మా ఆకాంక్ష, అభిమతం’ అంటూ వాల్‌పోస్టర్లు, ఇతరత్రా తరహాల్లో తమ గొంతు వినిపిస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు. అయితే ఈ తరహా ఒత్తిడి రజనీకాంత్‌కు తన అభిమానుల నుంచి చాలా కాలంగా వస్తున్నా ఇటీవల అది తీవ్రస్థాయికి చేరుకుంది.
తాజాగా మరోసారి నేరుగానే ముక్తకంఠంతో తన అభిమాన నటుడిని నాయకుడిగా చూడాలని ఒత్తిడి చేసే అవకాశం వారికి లభించనుంది. దాదాపు ఎనిమిదేళ్ల అనంతరం రజనీ...అభిమానులతో భేటీ కాబోతున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ తన అభిమానులను కలవనున్నారు. ఇందుకు చెన్నై కోడంబాక్కంలోని శ్రీ రాఘవేంద్ర కల్యాణ మండపం వేదిక కానుంది. నిజానికి ఈ అభిమానుల భేటీ గత నెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ జరగాల్సింది. అయితే ఒక్కో అభిమాని రజనీకాంత్‌తో ఫొటో దిగాలన్న ఆకాంక్షను తీర్చడానికి ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. 15వ తేదీ నుంచి 19 తేదీ వరకూ రోజుకు మూడు జిల్లాల చొప్పున ఐదు రోజుల్లో 15 జిల్లాలకు చెందిన అభిమానులను రజనికాంత్ కలసుకుని వారితో విడి విడిగా ఫొటోలు దిగి, మంచి విందును ఇవ్వనున్నారు.
మీరు రండి..అంతా మేము చూసుకుంటాం
ఈ సందర్భంగా కరూర్ జిలా రజనీకాంత్ అభిమాన సంఘ నిర్వాహకుడు కేఎస్.రాజా మాట్లాడుతూ తమ చిరకాల వాంఛ నెరవేరబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు.ఇప్పుడు మాస్ నటుడు, మాస్ లీడర్ తమ తలైవానేనని గంటాపథంగా చెప్పాడు. ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశీలించి నిర్ణయాన్ని తీసుకునే తమ అభిమాన నటుడు రజనీకాంత్ అని పేర్కొన్నారు. ప్రతి విషయాన్ని పలు కోణాల్లో ఆలోచించే రజనీకాంత్ రాజకీయాల గురించి అంతే విపులంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారని అన్నాడు. అందుకే ఆయన్ని తాము బలవంతం చేయడం లేదని, అయితే తమ కోరిక ఆయన రాజకీయాల్లోకి రావాలన్నదేనని తెలిపాడు.
మీరు రండి అన్ని విషయాలు మేము చూసుకుంటామని తాము పలుసార్లు తలైవాకు వివరంగా చెప్పామని అన్నాడు. అయినప్పటికీ రజనీకాంత్ ఆలోచిస్తున్నారని, తమకు సంబంధించినంత వరకూ ఆయన బాగుండాలని, తమిళనాడు బాగుండాలని అన్నాడు. మొత్తం మీద అభిమానులతో ఐదు రోజుల రజనీకాంత్ భేటీ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనన్న ఆందోళన రాజకీయవర్గాల్లో ఇప్పటి నుంచే మొదలైంది. రజనీ అభిమానుల ఒత్తిడికి తలొగ్గుతారా? రాజకీయాలకు సై అంటారా, లేక ఎప్పటిలానే మౌనం పాఠిస్తారా? అన్న ప్రశ్నలు రాయకీయ నాయకుల్లో సుడులు తిరుగుతున్నాయి.