= సర్వతోముఖాభివృద్ధి చేస్తా
= రైల్వే ప్రాజెక్టుల పూర్తికి దశలవారీ నిధులు
= కోలారు వద్ద రైల్వేకోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి త్వరలో చర్యలు
= ఇచ్చిన 169 హామీల్లో 60 నెరవేర్చాం
= మిగతావి నాలుగేళ్లలో పూర్తి చేస్తాం
= చిక్కబళ్లాపురం- కోలారు రైలు ప్రారంభోత్సవ సభలో సీఎం
చిక్కబళ్లాపురం, న్యూస్‌లైన్ : బెంగళూరులో జనసంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, తద్వారా తలెత్తుతున్న ఇబ్బందుల పరిష్కారం కోసం చిక్కబళ్లాపురాన్ని శాటిలైట్ టౌన్‌గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. దీని వల్ల చిక్కబళ్లాపురంలో రోడ్లు, విద్యుత్, మంచినీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు పెరుగుతాయని భరోసా ఇచ్చారు. నగరంలోని నందిరంగ మందిరంలో నైరుతి రైల్వే మండలి ఏర్పాటు చేసిన చిక్కబళ్లాపురం - కోలారు రైల్వే బ్రాడ్‌గేజ్, నూతన రైలును ముఖ్యమంత్రి శుక్రవారం ప్రారంభించి ప్రసంగించారు.
చిక్కబళ్లాపురలో రైల్వేస్టేషన్ విస్తరణ కోసం ఇళ్లను కోల్పోయే చిక్కబళ్లాపురం, చామరాజపేట కాలనీ వాసులకు పునరావాసం కల్పించడానికి అవసరమైన ప్రణాళికలు పూర్తయ్యాయన్నారు. అందులో భాగంగా 13 ఎకరాల భూమిని ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిందన్నారు. రాష్ట్రంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అవసరమైన రూ.10 వేల కోట్లను దశలవారీగా విడుదల చేస్తామన్నారు.
ఈ ప్రాజెక్టులు పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కోలారు వద్ద రూ1,400 కోట్లతో రైల్వేకోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర వాటా కింద రూ. 700 కోట్లు ప్రభుత్వం త్వరలోనే అందిస్తుందన్నారు. ఈ నెల 13 తేదీకి రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తి చేసుకుంటుందని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 169 హామీల్లో ఇంతవరకు 60 హామీలను నెరవేర్చామని తెలిపారు. మిగిలిన వాటిని నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.
రైల్వే శాఖ మంత్రి మల్లికార్జునఖర్గే మాట్లాడుతూ రూ.440 కోట్లతో 87 కిలోమీటర్లు పొడవైన కోలారు - చిక్కబళ్లాపురం రైలు మార్గాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ నిర్మాణంతో అన్ని వర్గాల వారికీ మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీ, కేహెచ్ మునియప్ప, రాష్ట్ర ఆహార పౌరసర ఫరాల శాఖామంత్రి దినేశ్‌గుండూరావు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎన్‌హెచ్ శివశంకరరెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధాకర్, రాజణ్ణ, జేకే కృష్ణారెడ్డి, ఎస్‌ఎన్ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీలు నజీర్ అహ్మద్, వైఏ నారాయణస్వామి, జెడ్పీ అధ్యక్షుడు చిన్నప్ప, కలెక్టర్ ఆర్ విశాల్, ఎస్పీ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.