సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కొరత రానివ్వబోమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ప్రస్తుత రైల్వే ప్రాజెక్టులకు రాష్ర్ట వాటాగా ఇవ్వాల్సిన రూ.550 కోట్లను విడుదల చేయాలని గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో నిర్ణయించినట్లు వెల్లడించారు. సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇందులో రూ.200 కోట్లు 2013-14 బడ్జెట్ కేటాయింపులకు అదనమన్నారు. మొత్తం నిధుల్లో రూ.150 కోట్లను ఈ నెలాఖరులోగా, మిగిలిన నిధులను సాధ్యమైనంత త్వరగా విడుదల చేస్తామని తెలిపారు.
ప్రాథమిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి సంతోష్ లాడ్ మాట్లాడుతూ... రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన భూమిని ప్రభుత్వమే సమకూర్చడమే కాకుండా అవసరమైన నిధుల్లో 50 శాతాన్ని భరిస్తోందన్నారు. పదేళ్లలో రాష్ట్రానికి 14 రైల్వే ప్రాజెక్టులు కేటాయించగా మూడు పూర్తయ్యాయన్నారు. మల్లిఖార్జున ఖర్గే రైల్వే శాఖను చేపట్టాక రాష్ట్రానికి ఎనిమిది కొత్త ప్రాజెక్టులను కేటాయించారని చెప్పారు. రైల్వే పనులకు అవసరమైన భూ స్వాధీన ప్రక్రియ బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించామన్నారు.
రాష్ట్రంలో 2,193 కిలో మీటర్ల మేర రైల్వే లైన్ల నిర్మాణం అవసరం కాగా, 463 కిలో మీటర్లు మాత్రమే పనులు పూర్తయ్యాయన్నారు. ఏడాదికి 100 కిలో మీటర్ల రైల్వే పనులను పూర్తి చేయడానికి మాత్రమే అవసరమైన మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం రైల్వే శాఖ వద్ద ఉందన్నారు. ఖర్గే రైల్వే శాఖ మంత్రి అయిన తర్వాత ఏడాదికి 180 నుంచి 200 కిలో మీటర్ల మేర నిర్మాణం జరగాలని లక్ష్య నిర్దేశం చేశారని చెప్పారు. బెంగళూరు-మైసూరు మధ్య డబ్లింగ్ పనులు వచ్చే ఏడాది డిసెంబర్‌కు పూర్తి కావచ్చునని ఆయన ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. కాగా బెంగళూరులో రైల్వే పనుల కోసం బీబీఎంపీ రూ.20 కోట్లను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు చెక్కురూపంలో అందించింది.
నిధుల కొరత రానివ్వం
Published Fri, Oct 4 2013 3:07 AM | Last Updated on Fri, Sep 1 2017 11:18 PM
Advertisement
Advertisement