సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైల్వే ప్రాజెక్టులకు సంతృప్తికరంగా నిధులు కేటాయించారని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు. తాజా బడ్జెట్‌లో రైల్వేలకు రూ.2.52 లక్షల కోట్లు కేటాయించగా.. అందులో దక్షిణ మధ్య రైల్వేకి రూ.14,232.84 కోట్లు కేటాయించారన్నారు. ఇందులో తెలంగాణ ప్రాంత వాటా రూ.5,071 కోట్లని, గత బడ్జెట్ కంటే 14.7 శాతం నిధులు అధికంగా కేటాయించారని వివరించారు. శుక్రవారం ఆయన రైల్‌నిలయంలో మీడియాతో మాట్లాడుతూ, రైలు ప్రయాణికుల భద్రత, సౌకర్యార్థం 40 వేల సాధారణ బోగీలను వందే భారత్ ప్రమాణాలకు తగ్గట్టుగా మార్చనున్నట్లు వివరించారు.
ఈసారి పీఎం గతిశక్తి కింద పలు ప్రాజెక్టులను గుర్తించినట్లు తెలిపారు. కవచ్ వ్యవస్థ అభివృద్ధి కోసం ఈ సారి రూ.41.94 కోట్లు కేటాయించారన్నారు. తాజా బడ్జెట్లో నిధులు తగ్గినట్లు కనిపించినప్పటికీ ఇది మధ్యతరం మాత్రమేనని, పూర్తిస్థాయి బడ్జెట్‌లో నిధులు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. భద్రాచలం రోడ్ – డోర్నకల్ డబ్లింగ్ ప్రాజెక్టు కింద రూ. 770.12 కోట్లతో 54.65 కిలోమీటర్లు అభివృద్ధిచేయనున్నట్లు వివరించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ సారి రెండు బైపాస్ లైన్ల నిర్మాణానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించారని, ఇందులో కాజీపేట్ బైపాస్ లైన్ 10.65 కిలోమీటర్లు, వికారాబాద్ మార్గంలో 2.8 కిలోమీటర్లు నిర్మించనున్నట్లు వివరించారు. ఈ పదేళ్లలో రాష్ట్రానికి కేటాయింపులు దాదాపు 20 రెట్లు పెరిగాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment