శాసన మండలిలో బడ్జెట్‌పై చర్చలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ సభ్యులు
హామీల అమలు సున్నా చందంగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయన్న ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్
కనీసం ఎప్పుడు అమలు చేస్తారో అన్న ప్రణాళిక కూడా లేదన్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచీ గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం మినహా ఎన్నికల ముందు సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారన్న ప్రణాళికను కూడా కనీసం బడ్జెట్ ప్రస్తావించలేకపోయిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తప్పు పట్టారు. మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు అధ్యక్షతన శాసనమండలిలో 2024–25 బడ్జెట్‌పై బుధవారం చర్చ మొదలైంది.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ చర్చను ప్రారంభిస్తూ.. హామీలు మెండు–చేసేది సున్నా అన్నట్టుగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చే హామీలను నిలబెట్టుకునే అలవాటు టీడీపీ లేదని.. ఈసారి ఎన్నికల్లో జనసేన, బీజేపీ ఉండటంతో గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత ఆ పార్టీలు తీసుకుంటాయని ప్రజలు భావించారన్నారు. కానీ.. మొత్తంగా కూటమి పార్టీలు హామీలతో ప్రజలను నమ్మించి ద్రోహం చేశాయన్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రజలకిచ్చిన హామీలకు ఏటా సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి అమలు చేసిందని.. కూటమి ప్రభుత్వం ఏ నెలలో ఏ హామీ అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల కోసం ఒక్క రూపాయి బడ్జెట్‌లో కేటాయించలేదన్నారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఎప్పటిలోగా పోలవరం పూర్తి ఏస్తారో బడ్జెట్‌లో చెప్పలేదన్నారు.
ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పలేదు
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పకుండా బడ్జెట్‌ను దాటవేసిందన్నారు. కనీసం ఏ పథకం ఎప్పుడు ఇస్తారో అనే ప్రణాళిక కూడా బడ్జెట్‌లో చెప్పలేదన్నారు. గత ప్రభుత్వ దుర్మార్గమైన పాలన అంటూ బడ్జెట్‌లో మొదటిలోనే మొదలుపెట్టారని, ప్రజలకిచ్చిన హామీలను అప్పటి ప్రభుత్వం చేసిందని, హామీలు అమలు చేయడం దుష్పరిపాలన అవుతుందా అని ప్రశ్నించారు.
పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇస్తామన్న రూ.15 వేల కోట్లు అప్పుగానా లేకా గ్రాంటా అన్నది బడ్టెట్ పేర్కొనలేదన్నారు. దీనికి మంత్రి నాదెండ్ల మనోహర్ బదులిస్తూ.. కేంద్రం రుణంగా తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్‌గా అందజేస్తుందన్నారు. బడ్జెట్ ప్రతిపాదనలపై టీడీపీ ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, పంచుమర్తి అను«రాధ మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment