.. ఆ అధికారం ప్రభుత్వానికి లేదు
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
బెంగళూరు : అక్రమాస్తుల కేసులో ఇక్కడి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో కారాగార వాసాన్ని అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను ఆ రాష్ట్ర జైలుకు తరలించే విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోజాలదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. క్యాంప్ కార్యాలయం కృష్ణాలో మంగళవారం ఆయన జనతా దర్శన్‌లో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని జయను తమిళనాడు జైలుకు తరలించాలని మాజీ ప్రధాని దేవెగౌడ చేసిన ప్రకటనపై స్పందిస్తూ, దీనిపై సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే బెంగళూరులో జయ కేసు విచారణ జరిగిందే తప్ప, రాష్ట్రం పాత్ర ఏమీ లేదని స్పష్టం చేశారు.
జయను జైలు నుంచి విడుదల చేయకపోతే కన్నడిగులను ముట్టడిస్తామని తమిళనాడులో కొందరు హెచ్చరించడం సరికాదని హితవు పలికారు. మనమంతా సమైక్య వ్యవస్థలో నివసిస్తున్నందున రాష్ట్రంలోని తమిళులకు, తమిళనాడులోని కన్నడిగులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉందని అన్నారు. కాగా విజయ దశమి సందర్భంగా చాముండి దేవికి పూలమాల వేసే సందర్భంలో తాను బూట్లు ధరించానని కొన్ని ఛానెళ్లు ప్రచారం చేయడంపై మండిపడ్డారు. తాను సాక్స్ మాత్రమే ధరించానని, దీనిపై ఆ ఛానెళ్లకు నోటీసులిస్తానని వెల్లడించారు.