- అఖండ కర్ణాటక విడిపోదు
- వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
- హై-క విమోచన దినోత్సవంలో సీఎం సిద్ధరామయ్య
రాయచూరు రూరల్ : ఎలాంటి పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వబోమని, అఖండ కర్ణాటక ఎప్పటికీ విడిపోదని రాష్ర్ట ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. గుల్బర్గాలో బుధవారం నిర్వహించిన హై-క విమోచన దినోత్సవంలో ఆయన ప్రసంగించారు.
అంతకు ముందు పటేల్ రోడ్డులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఉత్తర కర్నాటకను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న మాజీ మంత్రి ఉమేష్ కత్తి.. తాను అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయంపై ఎం దుకు నోరు విప్పలేదని సీఎం ప్రశ్నిం చారు.
అన్నదమ్ముల్లా మెలుగుతున్న కన్నడిగుల మధ్య ఉమేష్ కత్తి చిచ్చు రాజేస్తున్నారని మండిపడ్డారు. రెచ్చగొట్టే మాటలతో అలజడి సృష్టించవద్దని హితవు పలికారు. హై-క అభివృద్ధికి బోర్డు ఏర్పాటు చేసి రూ.600 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం రూ.150 కోట్లు నిధులు విడుదల చేసినట్లు చెప్పారు.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. రాయచూరులో ఐఐటీ, ఎయిమ్స్ సంస్థల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. నవంబర్‌లో మంత్రి వర్గ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. అతివృష్టి, అనావృష్టి పీడిత ప్రాంతాల్లో నష్టంపై అంచనాలను వారం రోజుల్లో సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.