రాష్ట్రంలో డీఎస్‌పీ, సీఐల బదిలీల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎట్టకేలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఒత్తిడికి తలొగ్గారు. బదిలీలపై ఇదివరకే జారీ అయిన ఉత్తర్వుల్లో భారీ మార్పులు చేస్తూ తాజా ఆదేశాలను జారీ చేశారు.
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో డీఎస్‌పీ, సీఐల బదిలీల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎట్టకేలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఒత్తిడికి తలొగ్గారు. బదిలీలపై ఇదివరకే జారీ అయిన ఉత్తర్వుల్లో భారీ మార్పులు చేస్తూ తాజా ఆదేశాలను జారీ చేశారు. డీజీపీ నేత ృత్వంలోని పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు చేపట్టిన బదిలీల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని ఆయన చెప్పినప్పటికీ, ఎమ్మెల్యేల ఉడుం పట్టు వల్ల దిగి రాక తప్పలేదు. 14 మంది డీఎస్‌పీలు, 62 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీల్లో మార్పులు చేశారు.
ఈ మార్పులు కొందరిలో మోదం, మరి కొందరిలో ఖేదం మిగిల్చాయి. మూడు నెలలుగా బదిలీలకు కసరత్తు జరిగినా, సెప్టెంబరు 25న ప్రభుత్వం 135 మంది డీఎస్‌పీలు, 498 మంది సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందించారు. తమ మాటకు విలువ ఇవ్వలేదని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వరకు ఫిర్యాదు చేశారు. కొందరు నేరుగా ముఖ్యమంత్రి వద్దే పంచాయితీ పెట్టారు. ఎమ్మెల్యేల ఆగ్రహాన్ని గమనించిన సీఎం వెంటనే హోం మంత్రి కేజే. జార్జ్‌ని పిలిపించి మంతనాలు జరిపారు.
ఎమ్మెల్యేల అసంతృప్తి అసమ్మతికి దారి తీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వారి సూచనల మేరకు బదిలీల్లో మార్పులు చేయాలని డీజీపీ, నగర పోలీసు కమిషనర్‌లను ఆదేశించారు. ముఖ్యంగా బెంగళూరు, మైసూరు, హుబ్లీ, బెల్గాం ఎమ్మెల్యేలు తమ మాటకు విలువ ఇవ్వలేదని అలిగి కూర్చున్నారు. ఈ జిల్లాల్లోనే భారీ మార్పులు జరిగాయి. కాగా పోలీసుల బదిలీల్లో రాజకీయ ప్రమేయం ఉండరాదనే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేశారు. డీజీపీ సహా సీనియర్ పోలీసు అధికారులు ఇందులో సభ్యులు. అయినప్పటికీ రాజకీయ జోక్యం తప్పడం లేదు. ఏటా ఈ బదిలీల్లో గందరగోళం నెలకొంటూనే ఉంది.