- బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్
- ముఖ్యమంత్రి సిద్ధుకు షాక్
సాక్షి, బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. మొన్నటి వరకూ ఆయన వెంట తిరిగిన గుల్బర్గా జిల్లా అళింద నియోజకవర్గ శాసనసభ్యుడు బీఆర్ పాటిల్ తాను బీజేపీలో చేరుతున్నట్లు మీడియాకు సోమవారం వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకే సరైన విలువ దక్కడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఇంకా ఆయన వెంటే ఉండడం సరికాదని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన చర్యను సమర్థించుకున్నారు.
అధికారికంగా త్వరలో బీజేపీలో చేరనున్నట్లు స్పష్టం చేశారు. త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కానున్న నేపథ్యంలో బీఆర్ పాటిల్ సిద్ధరామయ్యను కాదని బీజేపీలో చేరుతుండడం గమనార్హం. ఇదిలా ఉండగా గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ పాటిల్ కర్ణాటక జనతా పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. పేరుకు ఆయన కేజేపీ శాసనసభ్యుడే అయినా అప్పటి నుంచి కాంగ్రెస్ కార్యక్రమాల్లో తరుచుగా కనిపించేవారు.
యడ్యూరప్ప కేజేపీను వదిలి తిరిగి మాతృ పక్షమైన బీజేపీలో చేరిన సమయంలో కూడా బీఆర్ పాటిల్ తటస్థంగా ఉండిపోయారు. తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. అంతేకాక అప్పటి నుంచి కాంగ్రెస్ కార్యక్రమాల్లో ముఖ్యంగా సీఎం సిద్ధరామయ్య వెంట ఎక్కువగా కనిపించేవాడు. అయితే తాజాగా సిద్ధు రాజకీయ స్నేహాన్ని వద్దనుకుని బీఆర్ పాటిల్ బీజేపీ గూటిని చేరనున్నారు.