సాక్షి, బెంగళూరు : మహాత్ముడి విగ్రహావిష్కరణకు సంబంధించి శాసనమండలి అధ్యక్షుడు శంకరమూర్తిపై విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ‘ఆయన ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిచి తప్పుచేశాం’ అని ఘాటుగా స్పందించారు. విధానసౌధ, వికాస సౌధ మధ్య ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహవిష్కరణ గురువారం జరిగింది. ఇందుకు ఏర్పాటు చేసిన వేదికపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, స్పీకర్ కాగోడు తిమ్మప్ప, మండలి అధ్యక్షడు శంకరమూర్తితో పాటు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు చక్రవర్తి సూలిబెరె ప్రసంగించారు.
అనంతరం కేపీసీసీ కార్యాలయంలో జరిగిన గాంధీ జయంతి వేడుకకు సీఎం సిద్ధరామయ్య హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంటు సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి వీరప్పమొయిలీ మాట్లాడుతూ... గాంధీజీ ని ఆర్‌ఎస్‌ఎస్ పొట్టన బెట్టుకుందని, ఆ సంస్థకు చెందిన చక్రవర్తిసూలిబెరెను ఈ కార్యక్రమానికి ముఖ్య ఉపన్యాసకుడిగా ఆహ్వానించడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు.
గతంలో ఆయన ప్రసంగించిన చాలా ప్రాంతాల్లో మతఘర్షణలు జరిగిన విషయం ప్రభుత్వం ృష్టికి రాలేదా? అని నిలదీశారు. నరేంద్రమోడీ ప్రధాని అయినప్పటి నుంచి దేశంలో యుద్ధభయం పెరుగుతోందపి వీరప్పమొయిలీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు ఆయన అనుసరిస్తున్న విదేశాంగ విధానాలే కారణమన్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ చక్రవర్తి సూలిబెరెను కార్యక్రమానికి ఆహ్వానించి తప్పు చేశామన్నారు.
ఆయన కార్యక్రమానికి వస్తున్నట్లు తనకు ముందు తెలియదన్నారు. కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను మండలి అధ్యక్షుడు శంకరమూర్తికి అప్పగించి పొరపాటు చేశామన్నారు. అయితే కార్యక్రమం మధ్యలో ఈ విషయాలన్నింటినీ ప్రస్తావించడం మహాత్మాగాంధీని అవమానించినట్లవుతుందనే ఉద్దేశంతో మిన్నకుండిపోయానని సిద్ధరామయ్య వివరణ ఇచ్చారు. కాగా, అంతకు ముందు విగ్రహవిష్కరణ సందర్భంగా మాట్లాడిన సిద్ధరామయ్య జాతి, కుల, మత వర్గాల పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలనుృసష్టించాలని ప్రయత్నిస్తున్న వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.
అహింసను బోధించిన గాంధీ మహాత్ముని మార్గంలో పయనించినప్పుడే శాంతియుత జీవనానికి వీలవుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా విగ్రహ రూపకర్తలు రామ్ వీ. సుతార్, ఆయన కుమారుడు అనిల్ ఆర్ సుతార్‌లను మండలి అధ్యక్షుడు డీ.హెచ్ శంకరమూర్తి మైసూరు పేటా, శాలువాతో సత్కరించారు.
ఆగని విమర్శలు
Published Fri, Oct 3 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 PM
Advertisement