గూడు కోల్పోయిన వారికి అధిక నష్ట పరిహారం
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల ఇళ్లను కోల్పోయిన వారికి ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం ఇస్తున్న నష్ట పరిహారం చాలా తక్కువ కనుక, ఈ మొత్తాన్ని పెంచాలని యోచిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. విధాన సౌధలో శుక్రవారం ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం పక్కా ఇంటికి రూ.70 వేలు, ఇతరత్రా ఇళ్లకు రూ.20 వేలు చొప్పున నష్ట పరిహారం చెల్లిస్తున్నట్లు వెల్లడించారు.
గత ఆగస్టు 18 నుంచి 30 వరకు కురిసిన భారీ వర్షాల వల్ల 11 వేల ఇళ్లకు నష్టం వాటిల్లిందని తెలిపారు. వరదల వల్ల రూ.426 కోట్ల నష్టం వాటిల్లిందని, రూ.266 కోట్ల సాయం కోరుతూ కేంద్రానికి లేఖ రాశామని చెప్పారు. ఈ నెల 24న రాష్ర్ట పర్యటనకు వస్తున్న ప్రధానిని స్వయంగా కలుసుకుని ఈ విషయాన్ని ప్రస్తావిస్తానని చెప్పారు.
యూనికోడ్ మొబైల్
అంతకు ముందు సీఎం యూనికోడ్ ఆధారిత మొబైల్ ఆప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విధాన సౌధలోని కమిటీ రూంలో కన్నడ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ త్వరలోనే అన్ని ఇంటర్‌నెట్ సైట్లను కన్నడంలోకి తర్జుమా చేయనున్నట్లు తెలిపారు. కాగా నగరంలో కేసీ. రెడ్డి, నిజలింగప్ప, దేవరాజ్ అర్స్ లేఔట్ల నిర్మాణంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.