ఆదుకోండి...
- అతివృష్టిపై కేంద్ర సాయం కోరిన సీఎం
- వరద నష్టం సుమారు రూ.400 కోట్లు
- 53 వేల హెక్టార్లలో పంట నష్టం
- నివేదికల తయారీలో అధికారులు నిమగ్నం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఉత్తర కర్ణాటకలోని ఎనిమిది జిల్లాల్లో గత నెలలో కురిసిన భారీ వర్షాల వల్ల అపార ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. వరద తాకిడికి గురైన గుల్బర్గ, రాయచూరు నగరాల్లో ఆయన శనివారం పర్యటించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైమానిక సర్వే నిర్వహించిన అనంతరం ఆయన గుల్బర్గలో హెలిప్యాడ్ వద్ద విలేకరులతో మాట్లాడారు.
వరద నష్టంపై వారంలోగా కేంద్రానికి నివేదిక సమర్పించి, పెద్ద మొత్తంలో నష్ట పరిహారం ఇవ్వాల్సిందిగా కోరుతామని చెప్పారు. ఉత్తర కర్ణాటకలో అతివృష్ట వల్ల ఎనిమిది జిల్లాల్లో రూ 400 కోట్లు పంట నష్టం జరిగిందని, 22 మంది చనిపోయారని తెలిపారు. సుమారు 53 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందన్నారు. ఈ నష్టాలపై నివేదికలను తయారు చేయడంలో అధికారులు నిమగ్నమై ఉన్నారని చెప్పారు. కాగా అక్టోబరు ఆఖరు వారం లేదా నవంబరు తొలి వారంలో గుల్బర్గలో మంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు.
గుల్బర్గ హైకోర్టు బెంచ్ పరిధిలోకి బళ్లారి, కొప్పళ జిల్లాలను చేర్చే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ బెంచ్ ఏర్పాటు విషయాన్ని కూడా ఇదే సమయంలో పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి వెంట రెవెన్యూ శాఖ మంత్రి వీ శ్రీనివాస ప్రసాద్, వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణ బైరేగౌడ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఖమరుల్ ఇస్లాం, యాదగిరి జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాబూరావు చించనసూరు తదితరులు ఉన్నారు.