మేఘ విలయం | Waterfalls in Bangalore | Sakshi
Sakshi News home page

మేఘ విలయం

Published Tue, Sep 26 2017 1:28 AM | Last Updated on Tue, Sep 26 2017 1:28 AM

Waterfalls in Bangalore

అల్లాడిన దావణగెరె
దావణగెరెలో కురిసిన భారీవర్షంతో నగరప్రజానీకం అస్తవ్యస్తమైంది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఎడతెర పి లేకుండా కురిసిన భారీ వర్షంతో పెనునష్టం సంభవించింది. రోడ్లు చెరువులను తలపించాయి. దావణగెరె పాత నగరం జలమయం కావడంతో  రాత్రంత నగరవాసులు జాగరణ చేశారు. భాషానగర, ఆజాద్‌నగర, గాంధీనగర, ఎస్‌ఎంఎస్‌.నగరతో పాటు అనేక ప్రాంతాలు, రోడ్లు నీటమునిగాయి. భారీ వర్షానికి 160 ఇళ్లు కూలిపోయాయి. రెండుకార్లు, 16 బైకులు నీటిలో కొట్టుకుపోయాయి.

జయనగర: రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రైతులు వేసిన వరిపైర్లు దెబ్బతినగా కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు, భారీ వృక్షాలు నేలమట్టం ఆస్తినష్టం సంభవించింది. బెంగళూరుతో పాటు బాగల్‌కోటే, కోలారు, చామరాజనగర, బళ్లారి, దావణగెరె జిల్లాల్లో భారీ వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. వందలాది ఇళ్లలోకి వర్షం నీరు చేరి ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బెంళూరులో ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమై సోమవారం ఉదయం 10 గంటల వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. ప్రజలు బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. నాగప్పలేఔట్‌లోని ఒక అపార్టుమెంటు సెల్లార్‌లోకి వాననీరు చొరబడడంతో పార్కు చేసిన పదులకొద్దీ కార్లు, బైక్‌లు నీటమునిగాయి. బెంగళూరు నాగరబావి, విజయనగర, నాయండహళ్లి, బనశంకరి, జయనగర, మైసూరురోడ్డు, కెంగేరి, శాంతినగర, మెజస్టిక్, గాంధీనగర, బొమ్మనహళ్లి, ఎలక్ట్రానిక్‌సిటి, మారతహళ్లి, యలహంక, య«శవంతపుర. ఉత్తరహళ్లి,  తదితర ప్రాంతాల్లో కుండపోత నమోదైంది. శివానందసర్కిల్‌ వద్ద గల అండర్‌పాస్‌లో నీరు నిలిచిపోవడంతో వాహనచోదకులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఓకళిపురంలో జరుగుతున్న మెట్రోపనుల వద్ద నీరు నిలిచి ట్రాఫిక్‌ స్తంభించింది. విద్యార్థులు, ఉద్యోగులు వర్షంతో అవస్థలు పడ్డారు.

అణ్ణమ్మదేవి గర్భగుడిలోకి వాననీరు
బెంగళూరు గాంధీనగరలోని మెజస్టిక్‌ సమీపంలో ఉన్న చారిత్రక అణ్ణమ్మదేవి దేవాలయ గర్భగుడిలోకి వర్షంనీరు చొరబడింది. అర్చకులు, సిబ్బంది వర్షం నీటిని బయటికి తీయడానికి తీవ్రంగా శ్రమించారు. నవరాత్రి ఉత్సవాల పూజల కోసం సోమవారం వేకువజామునే వర్షంలో ఆలయానికి చేరుకున్న అర్చకులు గర్భగుడివరకు నీరు చొరబడటాన్ని గమనించి ఆందోళనకు గురయ్యారు. ఆలయ సిబ్బంది బీబీఎంపీ సహాయంతో ఉదయం 9 గంటలకు తీవ్రంగా శ్రమించి వర్షంనీటిని తొలగించారు. మంచి నీటితో ఆలయాన్ని అర్చకులు శుభ్రం చేసి అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఉధృతంగా కృష్ణానది
మహారాష్ట్ర, జిల్లాలో కురుస్తున్న భారీ వర్షంతో మలప్రభా, కృష్ణానదికి భారీగా నీరుచేరుతోంది. జిల్లాలోని గోవనకుప్పె వంతెన పూర్తిగా మునిగిపోయింది. నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలకు వరద భయం నెలకొంది. ఆదివారం రాత్రి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి కృష్ణా, మలప్రభా నదుల్లో నీటిమట్టం పెరిగింది. వందలాది ఎకరాల పొలాలు నీటి మునిగిపోయాయి. జమఖండి తాలూకాలో హిప్పరిగి ఆనకట్టకు 1.15 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిచేరింది. దీంతో తాలూకాలోని కంకణవాడి, ముత్తూరు, మైగూరుతో పాటు సుమారు 11 గ్రామాలు ముంపు ముప్పు వాకిట్లో ఉన్నాయి. ఇప్పటికే 16 గ్రామాలు జలమయం కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. హిప్పరగి జలాశయం, చిక్కపడసలగి బ్యారేజీకి పెద్దఎత్తున వరద నీరు చేరడంతో ఆల్మట్టి డ్యామ్‌లోకి లక్షకు పైగా క్యూసెక్కుల నీరు చేరింది.

కృష్ణానది లో ఎవరు దిగరాదని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. చామరాజనగర జిల్లాలో గత 15 రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. బళ్లారి జిల్లాలో హగరి బొమ్మనహళ్లి తాలూకాతో పాటు హడగలి తాలూకా ఇటిగి హొబళి చుట్టుపక్కగ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన భారీవర్షంతో తాలూకాలోని మాల్వి జలాశయానికి 10 అడుగుల మేర నీరుచే రింది. బళ్లారి నగరంతో పాటు తాలూకా వ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement