= యోచనలో సర్కార్ : సీఎం వెల్లడి
= విద్యార్థులతో పాటు బోధన, బోధనేతర సిబ్బందికీ
= పౌష్టికాహార లోపం నివారణే లక్ష్యం
= అమలుపై సాధక బాధకాలను పరిశీలిస్తున్నాం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులతో పాటు బోధన, బోధనేతర సిబ్బందికి అతి తక్కువ ధరకు మధ్యాహ్న భోజనాన్ని (బిసియూటె) అందించాలని ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. పౌష్టికాహార లోపంతో ఎవరూ బాధ పడరాదని, సమాజంలో అందరూ ఆరోగ్యవంతంగా బతికే వ్యవస్థను నిర్మించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రతిభావంతులవుతారని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వ కళాశాలల్లో బిసియూటెను అందించే విషయమై సాధక బాధకాలను పరిశీలిస్తున్నామని వివరించారు.
ఇక్కడి శేషాద్రి రోడ్డులోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల స్వర్ణోత్సవాలను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతోనే ‘అన్న భాగ్య’ పథకాన్ని ప్రవేశ పెట్టామని తెలిపారు. అంతకు ముందు మాట్లాడిన స్థానిక శాసన సభ్యుడు రోషన్ బేగ్ విద్యార్థులకు రూ.5, బోధనేతర సిబ్బందికి రూ.15, బోధనా సిబ్బందికి రూ.20 ధరపై వేడి భోజనం అందించాలని ముఖ్యమంత్రిని కోరారు.