Government Womens Polytechnic College
-
ప్రారంభమైన ఎడ్‌సెట్ కౌన్సెలింగ్
మెదక్ మున్సిపాలిటీ: మెదక్ పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం బీఈడీలో ప్రవేశానికి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన, ర్యాంకు కార్డుల ఆధారంగా కళాశాలల ఎంపిక, వెబ్ ఆప్షన్ల నిర్వహించినట్లు కౌన్సెలింగ్ పరిశీలకులు వెంకట్రాంరెడ్డి తెలిపారు. మొదటి రోజు సోమవారం గణితం సబ్జెక్టుకు సంబంధించి నిర్వహించిన కౌన్సెలింగ్‌కు మొత్తం 167 మంది హాజరయ్యారు. రెండో రోజైన మంగళవారం ఫిజికల్ సైన్సు సబ్జెక్టుకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ర్యాంకు హోల్డర్లు సంబంధిత ర్యాంకు కార్డులతో పాటు సర్టిఫికెట్స్‌తో హాజరుకావాలని సూచించారు. నంగునూరులో మండల పరిధిలోని రాజగోపాల్‌పేటలోని పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం నిర్వహించిన బీఈడీ కౌన్సెలింగ్‌కు పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంబం కాగా తొలి రోజు 182 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి సర్టిఫికెట్లను పరిశీలించారు. మధ్యాహ్నం బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ పనిచేయకపోవడంతో కౌన్సెలింగ్ రెండు గంటల పాటు నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి నెట్ పనిచేయడంతో అధికారులు తిరిగి కౌన్సెలింగ్ నిర్వహించారు. మంగళవారం నుంచి ఈ నెల 30 వరకు కళాశాలలో వెబ్ఆప్షన్లు పెట్టుకునేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. -
నేటి నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
మెదక్ మున్సిపాలిటీ: పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్, కౌన్సెలింగ్ కన్వీనర్ సుబ్బారాయుడు తెలిపారు. ఈ నెల 17 నుంచి 21 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. అదే విధంగా ఈ నెల 20 నుంచి 24 వరకు ఆప్షన్ల ఎంపిక ప్రక్రి య కొనసాగుతుందని పేర్కొన్నారు. డిగ్రీలో 50శాతం మార్కులు కలిగిన ఓసీలు, 45శాతం మార్కులు గల ఎస్సీ, ఎస్టీ, బీసీలు మాత్రమే అర్హులని తెలిపారు. ఓసీ, బీసీలకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.600, ఎస్సీ, ఎస్టీలకు రూ.300 ఉంటుందన్నారు. ఈ కౌన్సెలింగ్‌లో ఎంబీఏ, ఎంసీఏ విభాగాలకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. మొదటి రోజు 1నుంచి 25వేల ర్యాంకు వరకు కౌన్సిలింగ్ ఉంటుందన్నారు. విద్యార్థులు 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, విద్యార్హతకు సంబంధించిన అన్ని పత్రాలకు చెందిన 2 సెట్ల జిరాక్స్ కాపీలతో పాటు ఒరిజినల్స్ కూడా వెంట తీసుకురావాలన్నారు. కాగా జిల్లాలో ఒక్కటే కౌన్సెలింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు 387 మంది హాజరు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): దర్గామిట్ట ప్రభుత్వ మహిళాపాలిటెక్నిక్ కళాశాల, వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర కళాశాలలో జరుగుతున్న ఎంసెట్- 2014 కౌన్సెలింగ్ పక్రియలో ఆదివారం 387 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 159 మంది అభ్యర్థులు, బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో 228 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించారు. సోమవారం జరిగే కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో 1,20,001 నుంచి 1,27,000 ర్యాంక్ వరకు, ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో 1,27,001 నుంచి 1,35,000 ర్యాంక్ వరకు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామని ప్రిన్సిపల్స్ నారాయణ, రామ్మోహన్రావు తెలిపారు. అభ్యర్థులకు గందరగోళ పరిస్థితి వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. బ్రాంచ్, కళాశాల ఎంపికలో అభ్యర్థులకు గందరగోళ పరిస్థితి ఎదురైంది. మంచి కళాశాల, ఇష్టమైన బ్రాంచ్ని ఎన్నుకోవాలని హెల్ప్‌లైన్ సెంటర్లకు వచ్చిన విద్యార్థులను మధ్యవర్తులు పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు. తమవద్ద ఉన్న ల్యాప్‌టాప్‌లలో వెబ్ ఆప్షన్ చేస్తామని విద్యార్థులను ఒత్తిడికి గురిచేశారు. ప్రక్రియపై పూర్తిగా అవగాహన లేని విద్యార్థులను ప్రలోభ పెట్టేందుకు గురిచేశారు. ప్రైవేటు కళాశాల ప్రతినిధులు తమ కళాశాలలో చేరితే అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తామని మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. మరికొన్ని ప్రైవేటు కళాశాలలు మరి కొంత ముందుకెళ్లి ప్రక్రియకు ముందే విద్యార్థుల వద్ద నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకున్నారు. ఈ ప్రక్రియలో కళాశాలను మార్పించుకోవాలంటే ఆ విద్యార్థులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. కళాశాల పనితీరు, ఫ్యాకల్టీ వివరాలు తెలుసుకునేలోపే వారి అడ్మిషన్లు అయిపోవడంతో చేసేదేమీలేక చాలా మంది విద్యార్థులు ముందుకెళ్లి పోయారు. రూల్స్‌కు విరుద్ధంగా ప్రైవేటు కళాశాలలు చేసే ఆగడాలను మౌనంగా భరించాల్సి వచ్చిందని పలువురు అభిప్రాయపడ్డారు. దర్గామిట్ట బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో 60 మంది, వెంకటేశ్వరపురం పాలిటెక్నిక్‌లో 100 మంది ఆప్షన్ల ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు. ఆప్షన్ల ఎంపిక ప్రక్రియపై అవగాహన లేని అభ్యర్థులకు సహాయ పడతామని ప్రిన్సిపల్స్ పేర్కొన్నారు. ప్రైవేటు అభ్యర్థుల వద్దకు వెళ్లాల్సిన పని లేదని, నేరుగా తనను సంప్రదించాలని వారు కోరారు. -
ప్రారంభమైన ఎంసెట్ కౌన్సెలింగ్
175 మంది సర్టిఫికెట్ల పరిశీలన మెదక్ మున్సిపాలిటీ: ఎంసెట్ 2014 కౌన్సెలింగ్ గురువారం పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమైంది. మొదటి రోజు ఎంసెట్ ఎంట్రెన్స్‌లో 1వ ర్యాంకు 25 వేల ర్యాంకు సాధించిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అర్హత సర్టిఫికెట్లను పరిశీలించారు. జిల్లాలో మెదక్ తో పాటు ఈ సారి సిద్దిపేటలో కూడా కౌన్సెలింగ్ నిర్వహించడంతో విద్యార్థులు పెద్దగా హాజరు కాలేదు. మెదటి రోజు మొత్తం 86 మంది విద్యార్థులు హాజరైనట్లు ఎంసెట్ కౌన్సెలింగ్ కన్వీనర్ వెంకటరాంరెడ్డి తెలిపారు. ఈ నెల 16న 25 వేల 1వ ర్యాంకు నుండి 50 వేల ర్యాంకు వరకు సాధించిన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో పా టు రెండు జతల జిరాక్స్ పత్రాలు తీసుకుని కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని కోరారు. సిబ్బంది భవాని, కాశీనాథ్, సత్యనారాయణ, రమాదేవి, మహ్మాద్ భాన్, హమ్మద్ హుస్సేన్, టి. జయరాజ్, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నంగునూరు: నంగునూరు మండలం రాజగోపాల్‌పేటలోని పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 89 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌లో పాల్గొనగా అధికారులు సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, ఎంసెట్ కౌన్సెలింగ్ కోఆర్డినేటర్ సీహెచ్. నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. తమ కళాశాలలో మొట్టమొదటి సారిగా విద్యార్థులు వెబ్ ఆప్షన్లు పెట్టుకొనేందుకు ఏర్పాటు చేశామన్నారు. మొదటి రోజు కౌన్సెలింగ్ నిర్వహించి సర్టిఫికెట్లను పరిశీలించామన్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో విద్యార్థులు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చని, 20 నుంచి 25 వరకు వరుసగా ఆరు రోజుల పాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఈ నెల 26న ఒకటో ర్యాంక్ నుంచి లక్ష వరకు, 27న లక్షా ఒకటి నుంచి ర్యాంక్ ముగిసే వరకు విద్యార్థులు వెబ్ ద్వారా ఆప్షన్లు మార్చుకోవచ్చన్నారు. ఏ కళాశాలలో సీటు అలాట్మెంట్ అయిందో ఈ నెల 30న విద్యార్థులకు సెల్‌ఫోన్ ద్వారా తెలియజేస్తామన్నారు. కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులు తమ సెల్ఫోన్లను అందుబాటులో ఉంచుకోవాలని ఆయన సూచించారు. -
ప్రభుత్వ కళాశాలల్లో రాయితీ ధర కు.. మధ్యాహ్న భోజనం
= యోచనలో సర్కార్ : సీఎం వెల్లడి = విద్యార్థులతో పాటు బోధన, బోధనేతర సిబ్బందికీ = పౌష్టికాహార లోపం నివారణే లక్ష్యం = అమలుపై సాధక బాధకాలను పరిశీలిస్తున్నాం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులతో పాటు బోధన, బోధనేతర సిబ్బందికి అతి తక్కువ ధరకు మధ్యాహ్న భోజనాన్ని (బిసియూటె) అందించాలని ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. పౌష్టికాహార లోపంతో ఎవరూ బాధ పడరాదని, సమాజంలో అందరూ ఆరోగ్యవంతంగా బతికే వ్యవస్థను నిర్మించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రతిభావంతులవుతారని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వ కళాశాలల్లో బిసియూటెను అందించే విషయమై సాధక బాధకాలను పరిశీలిస్తున్నామని వివరించారు. ఇక్కడి శేషాద్రి రోడ్డులోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల స్వర్ణోత్సవాలను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతోనే ‘అన్న భాగ్య’ పథకాన్ని ప్రవేశ పెట్టామని తెలిపారు. అంతకు ముందు మాట్లాడిన స్థానిక శాసన సభ్యుడు రోషన్ బేగ్ విద్యార్థులకు రూ.5, బోధనేతర సిబ్బందికి రూ.15, బోధనా సిబ్బందికి రూ.20 ధరపై వేడి భోజనం అందించాలని ముఖ్యమంత్రిని కోరారు.