ప్రతి ఇంటికీ సైన్స్ | Anna Science | Sakshi
Sakshi News home page

ప్రతి ఇంటికీ సైన్స్

Published Thu, Oct 2 2014 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

ప్రతి ఇంటికీ సైన్స్

ప్రతి ఇంటికీ సైన్స్

  • అన్ని జిల్లాల్లో విజ్ఞాన శాస్త్ర కేంద్రాలు
  •  శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకోవాలి
  •  మూఢ నమ్మకాలతో సమాజాభివృద్ధి కుంటు
  •  ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
  • సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలోని అన్ని జిల్లాల్లో ఉప ప్రాంతీయ విజ్ఞాన శాస్త్ర కేంద్రాలను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. మంగళూరులోని పిలికులలో బుధవారం ఆయన ప్రాంతీయ విజ్ఞాన శాస్త్ర కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ విజ్ఞాన శాస్త్రం ప్రతి ఇంటి ముంగిట చేరాలని, విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోవాలని ఉద్బోధించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయపడుతుందని చెప్పారు.

    మూఢ నమ్మకాలను ఇంకా ఆచరిస్తూ ఉంటే సమాజం అభివృద్ధి చెందలేదని పేర్కొన్నారు. బసవన్న లాంటి వారు కర్మ సిద్ధాంతాన్ని తిరస్కరించారని గుర్తు చేస్తూ, అనేక మంది ఇంకా జన్మ, పునర్జన్మలను విశ్వసిస్తున్నారని ఎద్దేవా చేశారు. గత జన్మ, వచ్చే జన్మ అంటూ ఉండదని, వాటి గురించి ఎవరికీ తెలియదని అన్నారు. బసవన్న వాస్తవాన్ని స్వర్గంగా, మూఢ నమ్మకాన్ని నరకంగా అభివర్ణించారని చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు మూఢ నమ్మకాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

    ప్రతి పౌరుడు శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకోవాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలోని 51 ఏహెచ్ అధికరణకు సవరణను తీసుకొచ్చారని తెలిపారు. అయినప్పటికీ మనం అడుగు ముందుకు వేయలేక పోతున్నామని, తద్వారా సమాజం వృద్ధి చెందలేక పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళయానం విజయవంతంగా పూర్తయిందని, తొలి ప్రయత్నంలోనే సఫలం కావడం ద్వారా ప్రపంచ పటంలో ఇండియా లీడర్‌గా ఆవిర్భవించిందని ఆయన పేర్కొన్నారు.

    ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీపాద్ యెస్సో నాయక్ మాట్లాడుతూ జిల్లాల్లో ఉప ప్రాంతీయ విజ్ఞాన శాస్త్ర కేంద్రాలను రాష్ర్ట ప్రభుత్వం ప్రారంభించదల్చితే, కేంద్రం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. రాష్ట్ర ఐటీ, బీటీ శాఖ మంత్రి ఎస్‌ఆర్. పాటిల్, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రమానాథ్ రై ప్రభృతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ కేంద్రాన్ని నెలకొల్పాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement