
మృగాళ్లను ఉపేక్షించం
- అత్యాచార కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడి
- ప్రస్తుత చట్టాలు కఠినతరం చేస్తామని ప్రకటన
- బాలికలు ఇంటికి చేరుకునే వరకూ పాఠశాల యాజమాన్యాలదే బాధ్యతని సూచన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఇటీవల మహిళలు, బాలికలపై జరిగిన అత్యాచార సంఘటనలు తనను కలచి వేశాయంటూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడడంతో పాటు నిందితుల పట్ల ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హెచ్చరించారు. ఇక్కడి మానెక్ షా పెరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం ఆయన 68వ స్వాతంత్య్ర దినోత్సవ సభలో ప్రసంగించారు. అత్యాచారాలను సమర్థంగా అరికట్టడానికి ప్రస్తుత చట్టాలను మరింత కఠినతరం చేస్తామని వెల్లడించారు.
ఇందులో భాగంగా గూండా చట్టానికి సవరణలు తెచ్చామని, అత్యాచారం కేసులను వేగవంతంగా పరిష్కరించడానికి పది ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలను వేధించడంతో పాటు అత్యాచారాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించామని చెప్పారు. పాఠశాలలు, కళాశాలల్లో బాలికలపై వేధింపులను నిరోధించడానికి ప్రభుత్వం కఠిన చర్యలను చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలలు తమ సంస్థల్లో చదివే బాలికల
సంరక్షణా బాధ్యతలను చేపట్టాలని ఆదేశించామన్నారు.
‘ఉదయం స్కూలులోకి ప్రవేశించింది మొదలు, సాయంత్రం ఇంటికి పోయే దాకా బాలికల సంరక్షణ బాధ్యత ఆయా పాఠశాలలదే’ అని హెచ్చరిక స్వరంతో చెప్పారు. ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు పునరావృతం కాకుండా బాలికల సంరక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని పాఠశాలలను ఆదేశించామని తెలిపారు. బోధన, బోధనేతర సిబ్బందిని నియమించుకునే ముందు వారి నేపథ్యాన్ని సునిశితంగా పరిశీలించాలని కూడా సూచించామని వెల్లడించారు.
కాగా వేధింపులు, అత్యాచారాలకు గురైన మహిళలకు అవసరమైన చికిత్సలను అందించడానికి మొత్తం 30 జిల్లా ఆస్పత్రుల్లో ప్రత్యేక మహిళా విభాగాలను ప్రారంభిస్తామని వెల్లడించారు. బెంగళూరులోని అయిదు ఆస్పత్రుల్లో కూడా ఈ విభాగాలుంటాయన్నారు. వీటిల్లో న్యాయ, ఆర్థిక సాయం లభిస్తుందని చెప్పారు. అత్యాచారాలకు గురైన బాలికలకు అత్యవసర సాయాన్ని అందించడానికి రూ.25 లక్షలతో పిల్లల నిధిని కూడా ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.