= నూతన సంక్షేమ పథకాలకు బ్రేక్
= రాష్ట్రానికి రాబడి లేకపోవడమే కారణం
= లక్ష్యాలను చేరుకోలేనిప్రధాన ఆదాయ శాఖలు
= మరో వైపు పెరిగిపోతున్న సబ్సిడీ భారం
= నూతన పథకాలతో లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేలా కాంగ్రెస్ వ్యూహం
= నిధుల్లేక ఫ్లాప్ అయిన ప్రణాళికలు
= కేంద్ర పథకాలకూ వాటా నిధులు ఇవ్వలేని స్థితిలో ‘రాష్ర్టం’
సాక్షి, బెంగళూరు : రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇక నూతన సంక్షేమ పథకాలకు తాత్కాలిక బ్రేక్ పడినట్లే. గడిచిన ఆరు నెలల్లో అనుకున్నంత రాబడి రాకపోవడమే ఇందుకు కారణం. చాలా సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. పథకాల అమలు అనేది ఆయా రాష్ట్ర ఆదాయ వనరులను బట్టి ఉంటుంది. అయితే ముఖ్యమంత్రి పదవిని పొందిన సిద్ధరామయ్య అత్యుత్సాహంతో మొదటి రోజే దాదాపు రూ.4,500 కోట్ల విలువజేసే సంక్షేమ పథకాలను ప్రకటించారు.
ఎన్నికల మేనిఫేస్టోను, వివిధ రాబడి వనరులను దృష్టిలో ఉంచుకుని సిద్ధరామయ్య ప్రభుత్వం 2013-14 ఏడాదికి గాను దాదాపు రూ.1.21 లక్షల కోట్ల విలువైన బడ్జెట్‌ను రూపొందించింది. బడ్జెట్‌ను అనుసరించి ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ విభాగాల నుంచి రూ.97,986 కోట్లు ఆదాయం రావాల్సి ఉంది. సాధారణంగా మొత్తం లక్ష్యంలో ఆరు నెలల్లో సగం పూర్తికావాల్సి ఉంటుంది. అయితే ఈ ఆరు నెలల్లో రూ.38,940 కోట్లు (39.7 శాతం) మాత్రమే వసూలైనట్లు ఆర్థిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
రాష్ట్ర ఖజానాకు ముఖ్య ఆదాయాన్ని తెచ్చిపెట్టే కమర్షియల్ టాక్స్, ఎక్సైజ్ (అబ్కారి), స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, మోటార్ వెహికల్ టాక్సెస్ విభాగాల రాబడి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. ఇదిలా ఉండగా ప్రభుత్వంపై సబ్సిడీ భారం అధికమైంది. అన్నభాగ్య, క్షీరభాగ్య, రుణమాఫీ తదితర పథకాల సబ్సిడీ మొత్తం రూ.14,500 కోట్లకు చేరింది. అటు రాబడి తగ్గడం.. ఇటు సబ్సిడీ మొత్తం పెరడగంతో ప్రభుత్వం ఆర్థిక ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో నూతన పథకాల రూపకల్పన, అమలు నిలిపివేయాల్సిందిగా ఆర్థిక శాఖ నుంచి ప్రభుత్వానికి సూచన అందినట్లు సమాచారం.
అధిష్టానానికి నిరాశే!..
దక్షిణ భారత దేశంలో కాంగ్రెస్ తన ప్రాభవాన్ని రోజురోజుకూ కోల్పోతోంది. ఈ క్రమంలో ఆ పార్టీ ఆశలన్నీ కర్ణాటకపైనే పెట్టుకుంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని అధిష్టానం గంపెడాశ పెట్టుకుంది. ఆ ఎన్నికలకు ముందు ప్రజాకర్షక పథకాలను అమలు చేసి ఓట్లు రాబట్టాని అనేక వ్యూహాలు పన్నింది. అయితే రాష్ట్రానికి అనుకున్నంత రాబడి రాకపోవడంతో కాంగ్రెస్ అధిషానికి నిరాశే మిగిలింది. నూతన పథకాల రూపకల్పనకు రాష్ర్ట ఆర్థిక శాఖ అభ్యంతరాలు చెబుతుండటంతో కాంగ్రెస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడిన టై్లంది.
కనీసం కేంద్రం నుంచైనా భారీగా నిధులు విడుదల చేద్దామనుకుంటే.. తన వాటాను కూడా వెచ్చించలేని స్థితిలో రాష్ర్ట ప్రభుత్వం ఉంది. ఈ విషయమై రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘కొన్ని కేంద్ర పథకాల అమలుకు రాష్ట్ర వాటాగా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత రాబడి దృష్ట్యా అది సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల కొన్ని కేంద్ర ప్రభుత్వం పథకాల అమలు కూడా అనుమానంగా ఉంది.’ అని పేర్కొన్నారు.