విశ్వ విఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలు శనివారం ప్రారంభం కానున్నాయి. రాజ ప్రాసాదంలో రాజ వంశీకుడు శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్ కంకణధారియై తొమ్మిది రోజుల పూజలకు సిద్ధమవుతారు.
మైసూరు, న్యూస్‌లైన్ : విశ్వ విఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలు శనివారం ప్రారంభం కానున్నాయి. రాజ ప్రాసాదంలో రాజ వంశీకుడు శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్ కంకణధారియై తొమ్మిది రోజుల పూజలకు సిద్ధమవుతారు. చాముండి కొండపై ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత చంద్రశేఖర కంబార, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు ఉదయం 10.44 గంటలకు దసరా ఉత్సవాలను ప్రారంభిస్తారు.
సాయంత్రం ఆరు గంటలకు రాజప్రాసాదంలో రంగ స్థల నటుడు డాక్టర్ ఏణిగి బాలప్ప దసరా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభిస్తారు. పది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను తిలకించడానికి దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తారు. దీంతో నగరాన్ని శోభాయమానంగా అలంకరించారు. శుక్రవారం రాత్రి వరకు ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు.
ఉత్సవాల్లో భాగంగా 30కి పైగా ప్రాంతాల్లో సుమారు 500 కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఉత్సవ ఏర్పాట్లో వందల మంది అధికారులు, సిబ్బంది, 23 సబ్ కమిటీలు, వేల మంది కార్మికులు చెమటోడ్చారు. ఉత్సవాల్లో జరిగే పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో బాలీవుడ్ తార హేమమాలిని సహా అనేక మంది కళా రంగ దిగ్గజాలు పాల్గొంటారు.