వైద్య సేవల్లో అంతరాయం
- వెనక్కుతగ్గని వైద్యులు, ప్రభుత్వం
- నేడు సామూహిక రాజీనామా చేయనున్న డాక్టర్లు
- తక్షణమే ఆ రాజీనామాలను ఆమోదిస్తామంటున్న సర్కార్
- బ్లాక్‌మెయిల్‌కు భయపడే ప్రసక్తే లేదని స్పష్టీకరణ
సాక్షి,బెంగళూరు : అటు ప్రభుత్వం... ఇటు వైద్యుల సంఘం పట్టువిడుపులు లేకుండా ప్రవర్తిస్తుండటంతో సోమవారం నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలిగే పరి స్థితి ఏర్పడింది. రాష్ట్రం లోని ప్రభుత్వ వైద్యులందరూ సామూహిక రాజీనామాలకు సిద్ధపడుతున్నా ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడే సూచనలు కనిపిస్తున్నాయి.
డిమాండ్ల సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘంలోని 4,500 మంది ప్రభుత్వ వైద్యులు నేడు సామూహిక రాజీనామాలు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మాత్రం ఇలాంటి బ్లాక్‌మెయిల్‌కు భయపడేది లేదని చెబుతోంది. అంతేకాకుం డా రాజీనామాలు చేసిన తక్షణం వాటిని ఆమోదిస్తామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి శివశైలం స్పష్టం చేస్తున్నారు.
ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు వీరభద్రయ్య మాట్లాడుతూ ‘సామూహిక రాజీనామాలకు పాల్పడినా ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని మరో నెల రోజులు విధులకు హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం మాత్రం వెంటనే మా రాజీనామాలను ఆమోదిస్తామని బెదిరింపు ధోరణితో మాట్లాడుతోంది. అదే గనుక జరిగితే మంగళవారం నుంచే విధులకు హాజరుకాము. తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు.
‘ప్రైవేట్’ సాయం తీసుకుంటాం
ప్రభుత్వ వైద్యులు రాజీనామా చేస్తే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ప్రైవేటు వైద్యుల సహాయం తీసుకుంటామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరి శివశైలం స్పష్టం చేశారు. బెంగళూరులో మీడియాతో ఆయన ఆదివారం మాట్లాడారు. వైద్యుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి తమ శాఖ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు పట్టువిడుపులు లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. వారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తాము బెదరబోమని స్పష్టం చేశారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వైద్యుల సహాయం తీసుకుంటామని శివశైలం పేర్కొన్నారు.