- సిద్దు, పరమేశ్వర్ నోటి దురుసు
- బెడిసికొడుతున్న విమర్శలు
- రైతులు, ఒక్కలిగల ఆందోళన
- విపక్షాల చేతికి బలమైన అస్త్రాలు
- ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం
సాక్షి, బెంగళూరు : సిద్ధరామయ్య, పరమేశ్వర్ అనాలోచితంగా చేస్తున్న విమర్శలు పార్టీకి చేటు కలిగిస్తున్నాయి. బెల్గాంలో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో చెరుకు మద్దతు ధర చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతు విఠల్ అరభావి విషం తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. ప్రత్యర్థులకు ఇదే ప్రధాన అస్త్రమైంది.
కాంగ్రెస్ పాలనలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ విమర్శలు గుప్పించాయి. వాటిని తిప్పి కొట్టే యత్నంలో భాగంగా కొడుగు జిల్లా నాపోక్లూహళ్లిలో సీఎం సిద్దు బుధవారం మాట్లాడుతూ.. ‘విషం తీసుకోవడం వల్ల విఠల్ చనిపోలేదు.. మద్యం తాగడం వల్లే మరణించాడు.. అతని మరణానికి, ప్రభుత్వానికి సంబంధం లేదు.’ అని తేల్చి చెప్పాడు.
ఈ వ్యాఖ్యల పట్ల అటు విపక్షాల్లోనే కాకుండా స్వపక్షంలోనూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సిద్ధరామయ్య అనాలోచితంగా మాట్లాడుతున్నారంటూ మాజీ ముఖ్యమంత్రులు యడ్యూరప్ప, కుమారస్వామి ధ్వజమెత్తారు. ఆ వ్యాఖ్యలు వెంటనే వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విఠల్ మద్యం తాగి మరణిస్తే ప్రభుత్వం ఎందుకు రూ. పది లక్షలు పరిహారంగా చెల్లించిందంటూ కుమారస్వామి ప్రశ్నించారు. మరోవైపు రైతు సంఘాలు కూడా ముఖ్యమంత్రి తీరుపై మండిపడుతున్నాయి.
సీఎం సిద్ధు వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఈ నెల 10న రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరికలు జారీ చేశాయి. కాగా, విఠల్ భార్య సిద్దవ్వ కంకణవాడి గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నా భర్త మరణానికి సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వమే కారణం. చనిపోయిన వారి విషయంలో అవహేళనగా మాట్లాడటం సరికాదు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి.’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో తప్పు తెలుసుకున్న సిద్ధు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ నేనెప్పుడు రైతులను అవమానపరిచేలా మాట్లాడలేదు. నా మాటలను మీడియా వక్రీకరించింది’ అంటూ చెప్పుకొచ్చారు.
పరమేశ్వరపై ఒక్కలిగల ఆగ్రహం..
మాజీ ప్రధాన మంత్రి హెడీ దేవెగౌడపై కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘దేవెగౌడ ఎప్పుడు విషం తాగుతారా అని ఎదురుచూస్తున్నా’ అని పరమేశ్వర్ అనడంపై రాష్ర్టంలోని ఒక్కలిగలు మండిపడ్డారు.
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రాష్ట్ర ఒక్కలిగ సంఘం సభ్యులు, పదాధికారులు పరమేశ్వర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మలు దహనం చేశారు. మాజీ ప్రధాని అనే గౌరవం కూడా లేకుండా.. సీనియర్ రాజకీయ నేత అయిన దేవెగౌడ పట్ల అవహేళనగా మాట్లాడిన పరమేశ్వర్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కుతీసుకోవాలని రాష్ట్ర ఒక్కలిగ సంఘం అధ్యక్షుడు అప్పాజిగౌడ, క్షమాపణ చెప్పడంతో పాటు కేపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని సంఘం ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ నాగరాజు డిమాండ్ చేశారు.