సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో గ్రామీణ, పట్టణ పేదల కడుపు నింపుతున్న జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి మరికొంత మందిని చేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు కోటిన్నర మందిని కొత్తగా ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇందుకు కసరత్తు ప్రారంభించింది. దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు ఆఖరు నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయని ఆహార శాఖ వర్గాలు చెబుతున్నాయి.
లబ్ధిదారుల్లో కొత్త ఆశలు
ప్రస్తుతం జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలో 81.35 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో అంత్యోదయ అన్న యోజన కింద 10 కోట్ల మందికి ప్రతినెలా 35 కిలోల ఉచిత బియ్యం సరఫరా చేస్తున్నారు. మరో 71 కోట్ల మందికి రేషన్ కార్డుపై కిలో రూ.3 చొప్పున 5 కిలోల బియ్యం, రూ.2కి గోధుమలు వంటి నిత్యావసరాలను అందజేస్తున్నారు. ఆహార పంపిణీ కోసం రాయితీ రూపంలో కేంద్రం రూ.4.22 లక్షల కోట్ల ఆర్థిక భారం మోస్తోంది. ఆహార భద్రతా చట్టం పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లోని 75 శాతం, పట్టణ ప్రాంతాల్లో 50 శాతం జనాభాను చేర్చారు.
చాలా ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టలేదు. పైగా 2013 నుంచి 2021 వరకూ ఆధార్ సంఖ్యలతో రేషన్ కార్డులను సీడింగ్ చేయడం ద్వారా అనర్హులను తొలగించారు. వలస వెళ్లిన కుటుంబాలు, ఒకే కుటుంబంలో రెండు, అంతకంటే ఎక్కువ కార్డులు కలిగి ఉన్న వారి వివరాలు, ఒకే కుటుంబంలో తెలుపు, గులాబీ కార్డులు కలిగి ఉన్న వారి వివరాలు, నివాసంలో లేకుండా రేషన్ కార్డులున్న వారి వివరాలు, చనిపోయిన వారి వివరాలను సేకరించి దేశవ్యాప్తంగా 4.70 కోట్ల కార్డులను ఏరివేశారు. వారి స్థానంలో ప్రస్తుతం అర్హులైన 1.58 కోట్ల మందిని తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రాలపైనే ఎంపిక బాధ్యత
కొత్త లబ్ధిదారుల ఎంపిక బాధ్యత రాష్ట్రాలపైనే ఉంటుందని, ఇందులో తమ పాత్ర ఉండదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కొత్త రేషన్‌కార్డుల జారీకి ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా ఉమ్మడి రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఆహార ఉత్పత్తి గణనీయంగా పెరినప్పటికీ పెద్ద సంఖ్యలో పిల్లలు, మహిళలు ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. దేశంలో 38.4 శాతం మంది పిల్లలు ఉండాల్సిన దానికంటే తక్కువ ఎత్తు ఉన్నారు. 21 శాతం మంతి తక్కువ బరువుతో ఉన్నారు. మహిళల్లో ఏకంగా 55 శాత మంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సవాళ్లకు ఆహార భద్రతా చట్టంతో చెక్ పెట్టొచ్చని కేంద్రం చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment