free rice
-
AP: ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాన్ని ఖండించిన పౌరసరఫరాల శాఖ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై–7) కింద నవంబర్ నుంచి జనవరి వరకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ వెల్లడించారు. ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘ఉచిత బియ్యం ఊసెత్తరేం’ శీర్షికన ప్రచురితమైన కథనాన్ని ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. రేషన్ డోర్ డెలివరీ విధానం ద్వారా ఇంటి వద్దకే నాణ్యమైన (సార్టెక్స్) బియ్యం పంపిణీచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. చదవండి: చిన్న పరిశ్రమలతో లక్షలాది ఉద్యోగాలు.. ఎంఎస్ఎంఈలకు ఏపీ సర్కార్ ప్రోత్సాహం అయితే, కేంద్ర ప్రభుత్వం పీఎంజీకేఏవై కింద నాన్–సార్టెక్స్ బియ్యాన్ని మాత్రమే ఇస్తోందన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీకి నాన్ సార్టెక్స్ నిల్వలు లేనందున మూడు నెలలకు సరిపడా బియ్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ద్వారా అందించాలని, అక్టోబర్ నుంచి కాకుండా నవంబర్ నుంచి పంపిణీ చేసేలా అనుమతించాలంటూ ఈ నెల 21న కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్రం రాష్ట్రానికి 3.24 లక్షల టన్నుల బియ్యాన్ని విడుదల చేయాలని ఎఫ్‌సీఐని ఆదేశించిందన్నారు. ప్రస్తుతం ఎఫ్‌సీఐ నుంచి జిల్లాల్లోని మండల స్టాక్ పాయింట్లకు బియ్యం రవాణా జరుగుతోందన్నారు. వచ్చేనెల నుంచి జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలోకి వచ్చే కార్డుదారుల్లోని ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యం అందజేయనున్నట్లు ఆయన వివరించారు. గతంలో బియ్యం ఇవ్వని కేంద్రం.. ఇక ఆరో విడత ఉచిత బియ్యం పంపిణీని ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వరకు కేంద్ర పొడిగించగా రాష్ట్రానికి అవసరమైన బియ్యం పంపిణీని విస్మరించిందన్నారు. నాన్ సార్టెక్స్ నిల్వలు లేనందున, అందుబాటులో ఉన్న సార్టెక్స్ బియ్యం కేవలం రెగ్యులర్ పీడీఎస్‌లో పంపిణీ చేసేందుకు సరిపోతాయని, ఎఫ్‌సీఐ నుంచి బియ్యం విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినప్పటికీ పట్టించుకోలేదన్నారు. పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వమే నాన్ సార్టెక్స్ బియ్యాన్ని సొంతంగా సేకరించి ఆగస్టు, సెపె్టంబర్లో పంపిణీ చేసిందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పేదలకు ఆరు విడతల్లో 25 నెలల పాటు ఉచిత బియ్యం ఇస్తే.. రాష్ట్రం సొంతంగా 19 నెలల పాటు మానవతా దృక్పథంతో కేంద్రంతో సమానంగా స్టేట్ కార్డుదారులకు కూడా బియ్యాన్ని అందించిందన్నారు. ఇందుకోసం ఏకంగా రూ.5,700 కోట్లు ఖర్చుచేసిందని అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. ఉచిత బియ్యం పంపిణీ ఇలా.. రాష్ట్రంలో 4.23 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులు ఉంటే కేంద్రం కేవలం 2.68 కోట్ల మందికి మాత్రమే ప్రతినెలా బియ్యం అందిస్తోందని అరుణ్‌కుమార్ తెలిపారు. మిగిలిన కార్డులకు రాష్ట్రమే సొంతంగా నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తోందని పేర్కొన్నారు. ఉచిత బియ్యం పంపిణీలోనూ కేంద్రం ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులకు మాత్రమే బియ్యాన్ని కేటాయిస్తోందన్నారు. ఇందులో భాగంగా గతంలో రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం సిఫారసుల మేరకు తిరుపతి, విశాఖపట్నం కార్పొరేషన్లలో మినహా ఉత్తరాంధ్రలోని మూడు, రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోని 1.67 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచిత రేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. వీరితో పాటు మిగిలిన జిల్లాల్లోని 89.20 లక్షల ఎస్సీ, ఎస్టీలకు, 24.60 లక్షల మంది అంత్యోదయ అన్న యోజన కార్డుదారులకు, ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రాంతంగా ఉండటంతో అక్కడి లబ్ధిదారులకు ఉచిత రేషన్‌ను అందజేయనున్నట్లు అరుణ్‌కుమార్ వివరించారు. -
మరో 1.58 కోట్ల మందికి ఆహార భద్రత!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో గ్రామీణ, పట్టణ పేదల కడుపు నింపుతున్న జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి మరికొంత మందిని చేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు కోటిన్నర మందిని కొత్తగా ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇందుకు కసరత్తు ప్రారంభించింది. దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు ఆఖరు నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయని ఆహార శాఖ వర్గాలు చెబుతున్నాయి. లబ్ధిదారుల్లో కొత్త ఆశలు ప్రస్తుతం జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలో 81.35 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో అంత్యోదయ అన్న యోజన కింద 10 కోట్ల మందికి ప్రతినెలా 35 కిలోల ఉచిత బియ్యం సరఫరా చేస్తున్నారు. మరో 71 కోట్ల మందికి రేషన్ కార్డుపై కిలో రూ.3 చొప్పున 5 కిలోల బియ్యం, రూ.2కి గోధుమలు వంటి నిత్యావసరాలను అందజేస్తున్నారు. ఆహార పంపిణీ కోసం రాయితీ రూపంలో కేంద్రం రూ.4.22 లక్షల కోట్ల ఆర్థిక భారం మోస్తోంది. ఆహార భద్రతా చట్టం పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లోని 75 శాతం, పట్టణ ప్రాంతాల్లో 50 శాతం జనాభాను చేర్చారు. చాలా ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టలేదు. పైగా 2013 నుంచి 2021 వరకూ ఆధార్ సంఖ్యలతో రేషన్ కార్డులను సీడింగ్ చేయడం ద్వారా అనర్హులను తొలగించారు. వలస వెళ్లిన కుటుంబాలు, ఒకే కుటుంబంలో రెండు, అంతకంటే ఎక్కువ కార్డులు కలిగి ఉన్న వారి వివరాలు, ఒకే కుటుంబంలో తెలుపు, గులాబీ కార్డులు కలిగి ఉన్న వారి వివరాలు, నివాసంలో లేకుండా రేషన్ కార్డులున్న వారి వివరాలు, చనిపోయిన వారి వివరాలను సేకరించి దేశవ్యాప్తంగా 4.70 కోట్ల కార్డులను ఏరివేశారు. వారి స్థానంలో ప్రస్తుతం అర్హులైన 1.58 కోట్ల మందిని తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రాలపైనే ఎంపిక బాధ్యత కొత్త లబ్ధిదారుల ఎంపిక బాధ్యత రాష్ట్రాలపైనే ఉంటుందని, ఇందులో తమ పాత్ర ఉండదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కొత్త రేషన్‌కార్డుల జారీకి ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా ఉమ్మడి రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఆహార ఉత్పత్తి గణనీయంగా పెరినప్పటికీ పెద్ద సంఖ్యలో పిల్లలు, మహిళలు ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. దేశంలో 38.4 శాతం మంది పిల్లలు ఉండాల్సిన దానికంటే తక్కువ ఎత్తు ఉన్నారు. 21 శాతం మంతి తక్కువ బరువుతో ఉన్నారు. మహిళల్లో ఏకంగా 55 శాత మంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సవాళ్లకు ఆహార భద్రతా చట్టంతో చెక్ పెట్టొచ్చని కేంద్రం చెబుతోంది. -
మరో 6 నెలలు.. నిరుపేదలకు ఉచితంగా రేషన్ బియ్యం
కాకినాడ సిటీ: కరోనా కష్టకాలంలో ఉచిత రేషన్ బియ్యాన్ని అందించిన కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు ఈ పథకాన్ని పొడిగించింది. కరోనా మహమ్మారి ప్రభావంతో నిరుపేదలు దయనీయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం లాక్డౌన్ లేనప్పటికీ అర్హులైన బియ్యం కార్డుదార్లు ఒక్కక్కరికి ఐదు కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవిభక్త తూర్పు గోదావరి జిల్లాలోని 64 మండలాల్లో 6.81 లక్షల మంది రేషన్ కార్డుదార్లకు బియ్యం అందజేయడానికి కావల్సిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. ఈ నెల నుంచే కొనసాగింపు పేదలకు బియ్యాన్ని పంపిణీ చేయాలంటూ ఒక నెల ముందు నుంచే ఇండెంట్లను పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేయడంతో ఈ నెలలో ఉచితంగా 5 కిలోల బియ్యం లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఆ తర్వాత వచ్చే నెల నుంచి అక్టోబర్ వరకూ కూడా ఉచితంగా బియ్యం ఇచ్చేలా పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకు తగిన ఇండెంట్లను ముందస్తుగా స్వీకరించే పనిని అధికారులు ఇప్పటికే చేపట్టారు. 16.81 లక్షల కార్డులు అవిభక్త తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని 64 మండలాల్లో 2,659 రేషన్ షాపులు ఉన్నాయి. వీటి పరిధిలో రైస్‌కార్డు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు కలిపి మొత్తం 16.81 లక్షలు ఉన్నాయి. ఒక్కో కార్డుదారుకు ప్రభుత్వం ఐదు కిలోల బియ్యం చొప్పున కేటాయించడంతో ఈ నెల నుంచి ఉచితంగా ఇవ్వనున్నారు. సేల్స్ డిపోల డీలర్ల వద్ద గతంలో నిల్వ ఉన్న బియ్యం పోగా మిగిలినవి అందిస్తారు. జిల్లాలోని గోదాముల నుంచి ఆయా రేషన్ డిపోల వారీగా బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇందులో అంత్యోదయ కార్డుకు గతంలో 35 కిలోల బియ్యం అందించేవారు. ఇప్పుడు అదనంగా మరో 5 కిలోలు కలిపి మొత్తం 40 కిలోల బియ్యం అందిస్తారు. అలాగే అన్నపూర్ణ కార్డుదారుకు 5 కిలోల ఇచ్చేవారు. ఈ నెల నుంచి 15 కిలోలు పంపిణీ చేస్తారు. అలాగే ఒక్కో సాధారణ బియ్యం కార్డుదారుకు 5 కిలోల బియ్యం ఇస్తుండగా ఈ నెలలో గరీబ్ కల్యాణ్ అన్న యోజన (కరోనా బియ్యం) పథకం కింద 5 కిలోల చొప్పున ఉచితంగా అందించనున్నారు. మొత్తంగా అవిభక్త తూర్పు గోదావరి జిల్లాలో ప్రతి నెలా 22,219 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా అందజేయనుంది. సంతోషంగా ఉంది మరో ఆరు నెలల పాటు ఉచితంగా బియ్యం ఇవ్వడం సంతోషంగా ఉంది. దీంతో పేదల కుటుంబ పోషణకు కొంత మేర ఊరట కలుగుతుంది. కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న క్రమంలో ప్రభుత్వం ఉచిత బియ్యం ఇవ్వడం అభినందనీయం, కరోనా పూర్తి స్థాయిలో కనుమరుగయ్యే వరకూ బియ్యం ఉచితంగా ఇవ్వాలి. – దంగేటి అప్పయ్యమ్మ, కాకినాడ సక్రమంగా బియ్యం పంపిణీ చేయాలి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యాన్ని డీలర్లు సక్రమంగా పంపిణీ చేయాలి. రేషన్ ఇచ్చే సమయంలో కార్డుదారులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలి. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు ఈ బియ్యం ఎంతో ఉపయోగపడుతాయి. – ఐవీ రమణ, కాకినాడ -
యూపీ ప్రజలకు సీఎం యోగి భారీ ఆఫర్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీల్లో భారీ విజయాన్ని అందుకున్న అధికార బీజేపీ పార్టీ శుక్రవారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా రెండోసారి యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే 52 మందిలో కేబినెట్‌ను విస్తరించారు ఇదిలా ఉండగా శనివారం మంత్రి మండలి మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం యోగి కీలక నిర్ణయం తీసుకున్నారు. యూపీలో ఉచిత రేషన్ పథకాన్ని మరో మూడు నెలలపాటు పొడిగిస్తున్నట్టు తెలిపారు. కాగా, యూపీలో రెండోసారి బీజేపీ అధికారంలోకి రావడానికి ఈ పథకమే కీలక పాత్ర పోషించింది. ఇక, సీఎం యోగి నిర్ణయంతో యూపీలో ఉన్న దాదాపు 15 కోట్ల పేదలకు ఈ పథకం ద్వారా ఉచిత రేషన్ అందనుంది. అయితే, కరోనా సమయంలో పేద ప్రజలకు ఉచిత రేషన్ పథకాన్ని కొనసాగించిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం బ్రిజేశ్ పాఠక్ మాట్లాడుతూ.. పేదలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రజలకు అందాలన్నది తమ ఉద్దేశమని వెల్లడించారు. సీఎం యోగి నిర్ణయంతో యూపీలో ఉన్న దాదాపు 15 కోట్ల పేదలకు ఈ పథకం ద్వారా ఉచిత రేషన్ అందనుంది. మూడు నెలల ఉచిత రేషన్ అందిస్తున్నందుకు గాను ప్రభుత్వం రూ. 3,270 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్కొన్నారు. -
RATION SHOP: సాధారణ నెలవారీ కోటాలో కోత..
సాక్షి, సిటీబ్యూరో: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే సబ్సిడీ బియ్యం ఈ నెల కూడా ఉచితంగా అందనున్నాయి. సాధారణ నెలవారీ కోటాలో మాత్రం ఉచితం కారణంగా యూనిట్‌కు ఒక కిలో చొప్పున కోత పడింది. కరోనా నేపథ్యంలో ఆహార భద్రత కార్డులోని యూనిట్‌కు 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సోమవారం నుంచి ఉచిత బియ్యం కోటా పంపిణీ ప్రారంభం కానుంది. వాస్తవంగా ఆహార భధ్రత (రేషన్) కార్డుదారులకు కిలో ఒక్కింటికి రూ.1 లెక్కన.. యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ వస్తోంది. కరోనా కష్టకాలం నేపథ్యంలో జాతీయ ఆహార చట్టం పరిధిలోని కార్డుదారుల కు కేంద్రం 5 కిలోల ఉచిత బియ్యం ప్రకటింంది. కేంద్ర పరిధితో పాటు రాష్ట్ర పరిధిలోని కార్డులు కూడా ఉండటంతో అందరికి ఒకే రకంగా ఉతం బియ్యం కోటాను పంపిణీ చేసేందుకు 5 కిలోలకు పరిమితం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆహార భద్రత కార్డుదారులందరికి యూనిట్‌కు 5 కిలోల చొప్పున పంపిణీ జరగనుంది. ఈ నెల 27 వరకు ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా బియ్యం కోటాను డ్రా చేసుకునేలా పౌరసరఫరాల శాఖ వెసులుబాటు కల్పించింది. -
రేషన్‌కార్డుదారులకు శుభవార్త.. నవంబర్ వరకు కొనసాగింపు
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కరోనా నుంచి పేదలు పూర్తిగా కోలుకోని దృష్ట్యా ప్రస్తుతం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీని కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార చట్టం పరిధిలోకి వచ్చే లబ్ధిదారులకు అందించనున్న 5 కిలోల బియ్యానికి అదనంగా మరో 5 కిలోలు కలిపి మొత్తంగా 10 కిలోల ఉచిత బియ్యాన్ని నవంబర్ వరకు అందించనుంది. జూలై ఒకటి నుంచి 10కిలోల ఉచిత బియ్యం పంపిణీకి సంబంధించి ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులకు పౌర సరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై కనీసంగా రూ.700 కోట్ల మేర భారం పడే అవకాశం ఉంది. చదవండి: కోటి 30 లక్షల కుటుంబాలకు ఉచిత బియ్యం -
గరీబ్ కల్యాణ్ అన్నయోజన... ఐదు నెలలపాటు పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఆహార భద్రతాచట్టం పరిధిలోని 81.35 కోట్ల మంది పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున అదనంగా ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ చేసేలా ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన(పీఎంజీకేఏవై)ను మరో ఐదు నెలల పాటు వర్తింపజేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈనెల ఏడో తేదీన ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ 18 ఏళ్ల పైబడిన వారందరికీ కేంద్రమే ఉచిత టీకాలిస్తుందని, నవంబరు వరకు ఉచిత రేషన్‌ను అందజేస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఉచిత రేషన్‌కు ఆమోదం తెలిపింది.ఈ పథకాన్ని కోవిడ్–19 లాక్డౌన్ నేపథ్యంలో తొలుత 2020 మార్చిలో ప్రధాని ప్రకటించారు. ఇప్పటివరకు మూడో విడతలుగా ఈ పథకం అమలైంది. నాలుగో విడతలో భాగంగా జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలోని 81.35 కోట్ల మందికి మరో 5 నెలల పాటు అంటే 2021 జులై మొదలుకొని 2021 నవంబరు వరకు ప్రతి ఒక్క వ్యక్తికి 5 కిలోల వంతున ఉచితంగా అదనపు ఆహారధాన్యాలను పంపిణీ చేస్తారు. ఇందుకు రూ. 64,031 కోట్ల మేర ఆహార సబ్సిడీపై వెచ్చించాల్సి వస్తుందని అంచనా. రైల్‌సైడ్ వేర్‌హౌజ్ కంపెనీ విలీనం సెంట్రల్ రైల్ సైడ్ వేర్‌హౌస్ కంపెనీ లిమిటెడ్ (సీఆర్‌డబ్ల్యూసీ)ను దాని మాతృసంస్థ అయిన సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ)లో విలీనం చేయడానికి ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. -
మరో 3 నెలలు ఉచిత బియ్యం?
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో జీవనోపాధి కోల్పోయిన పేద, దిగువ మధ్య తరగతి వర్గాలకు మరో మూడు నెలలపాటు ఉచిత బియ్యం పంపిణీ చేయాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పంపిణీ చేసినట్టే మరో మూడు నెలలు ఉచిత బియ్యం, ఇతర ఆహార ధాన్యాలు సరఫరా చేయాలని వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. రాష్ట్రాల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాయగా, తుది నిర్ణయం వెల్లడి కావాల్సి ఉంది. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన పేద, మధ్య తరగతి రేషన్‌కార్డుదారులకు ఊరటనిచ్చేలా కేంద్రం ఏప్రిల్ నుంచి మూడు నెలల పాటు 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు చొప్పున ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉచిత బియ్యం పంపిణీ జూన్‌తో ముగియనుంది. జూలై నుంచి పంపిణీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలే దు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసినా, పేదలకు సరైన ఉపాధి, ఆదాయ మార్గాలు లేవు. కరోనా కేసులు పెరుగుతుండటంతో మరింత ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అస్సోం, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, రాజస్తాన్, పంజాబ్, మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు.. ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీని మరో మూడు నెలలు పొడిగించాలని ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశాయి. ‘రాష్ట్రాల వినతిపై ప్రధానికి లేఖ రాశా. మరో మూడు నెలలు పంపిణీ చేయాలంటే కేంద్రంపై రూ.46 వేల కోట్ల భారం పడుతుంది. తుది నిర్ణయం రావాల్సి ఉంది’అని కేంద్ర మంత్రి పాశ్వాన్ ఆదివారం ఢిల్లీలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సీఎంతో చర్చించాక నిర్ణయం.. ఉచిత బియ్యం విషయమై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఎలాంటి వినతీ చేయలేదు. రాష్ట్రంలో 2.80 కోట్ల మంది లబ్ధిదారులకుగానూ కేంద్రం 1.91 కోట్ల మందికి మాత్రమే బియ్యం ఇస్తుండటంతో మిగతా భారం రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి, ఆయన సూచన మేరకే కేంద్రానికి లేఖ రాయాలా, వద్దా? అనేది నిర్ణయిస్తామని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
నో టాయిలెట్..నో రైస్!: కిరణ్‌బేడి
పుదుచ్చేరి: బహిరంగ మల విసర్జన రహిత, పరిశుభ్రమైన గ్రామాలకే ఉచిత బియ్యం అందించాలని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి శనివారం జారీచేసిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి. ఆమె కొన్ని గ్రామాలు సందర్శించి అక్కడి పారిశుధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలానా గ్రామం చెత్త రహిత, బహిరంగ మల విసర్జన రహితమని మే 31 లోగా స్థానిక ప్రజాప్రతినిధితోపాటు పంచాయతీ అధికారి నుంచి పౌర సరఫరాల కమిషనర్‌కు లేఖ వస్తేనే అక్కడ ఉచిత బియ్యం పథకం అమలు చేయాలని పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయం నిరంకుంశంగా ఉందని అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో కిరణ్ బేడి తన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. జూన్ చివరి నాటికి పుదుచ్చేరిలోని అన్ని గ్రామాలు బహిరంగ మల విసర్జన రహితంగా మారుతాయని ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో తన నిర్ణయాన్ని నిలుపుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
అందరికీ ఉచిత బియ్యం
ఆర్డీఓ సూర్యారావు నర్సీపట్నం టౌన్ : తుఫాన్ బాధితులు అందరికీ ఉచిత బియ్యం అందజేస్తామని ఆర్డీఓ కె.సూర్యారావు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుపు, గులాబీ కార్డుల లబ్ధిదారులు అందరికీ బియ్యాన్ని అందించాలని డీలర్లను ఆదేశించామన్నారు. 10 కిలోల బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, కారం, నూనె పలు రకాల నిత్యావసర సరకులను పంపిణీ చేస్తామని చెప్పారు. గులాబీ కార్డులకు నిత్యావసర సరకులు అపమని చెప్పలేదన్నారు. డీలర్ల నుంచి గులాబి కార్డుల లబ్ధిదారుల జాబితా రావడంలో జాప్యం జరిగిందన్నారు. ప్రత్యక్ష నష్టం చవిచూడనప్పటికీ పది రోజులుగా విద్యుత్, మంచినీటి సరఫరా కాక అందరినీ బాధితులుగానే ప్రభుత్వం గుర్తించదని తెలిపారు. ప్రతి గ్రామానికి ప్రస్తుతం తమ తగ్గర ఉన్న తెల్లకార్డుల జాబితా ప్రకారం సరకులు నేరుగా పంపామన్నారు. మండలంలోని గోడౌన్లు వద్ద దించకుండా నేరుగా తహశీల్దార్ల కార్యాలయాలకు చేరవేశామన్నారు. డీలర్లు ఇచ్చిన ఇండెంట్ మేరకు చౌకధరల దుకాణాల వద్దకు పంపామని చెప్పారు. సరకులు తక్కువగా ఇచ్చినా అన్ని రకాలు ఇవ్వకపోయినా లబ్ధిదారులు తమ హక్కుగా భావించి అడిగి తీసుకోవాలన్నారు. మంగళవారంతో పంచదార కూడా అందుబాటులోకి రావడంతో అన్ని సరకులు ఇవ్వాలని ధికారులను ఆదేశించినట్టు ఆర్డీఓ తెలిపారు. -
పరిశీలనలో ఉచిత రేషన్ బియ్యం : ఈటెల
సాక్షి, హైదరాబాద్: అర్హులైన పేదలకు కిలో బియ్యం రూపాయికి ఇవ్వాలా..? రూ. రెండుకు ఇవ్వాలా లేక ఉచితం గానా..? అనే అంశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉప సంఘం సమీక్షిస్తోందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఒక్కో కుటుంబానికి ఇస్తున్న బియ్యం పరిమితిని 20 కేజీల నుంచి 35 కేజీలకు పెంచే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఈటెల చెప్పారు. ఈ అంశంపై మంత్రి వర్గ ఉప సంఘం సమీక్షల అనంతరం నివేదకను రూపొందించి సీఎంకు అందజేస్తామని... సీఎం సూచనల మేరకు మెరుగైన పద్ధతులను అవలంబిస్తామని ఈటెల తెలిపారు. -
జోరుగా తమిళ బియ్యం దందా
తమిళ బియ్యూనికి పాలిష్ వేసి అమ్మకాలు రైళ్లలో దర్జాగా సాగుతున్న దిగుమతి కూలికి పనిచేస్తున్న పేదలు కోట్లకు పడగలెత్తుతున్న పెద్దలు చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్: తమిళనాడు పేద ప్రజలకు అక్కడి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం చిత్తూరు మార్కెట్లో విరివిగా దొరుకుతున్నారుు. ఈ బియ్యాన్ని చిత్తూరులోని కొందరు బడా వ్యాపారులు పాలిష్ చేసి మరీ బహిరంగ మార్కెట్లో కిలో రూ.45 వరకు విక్రయిస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. ఈ వ్యవహారానికి చిత్తూరు రైల్వే స్టేషన్ కేంద్రంగా మారింది. ఈ వ్యాపారానికి కూలీనాలీ చేసి బతుకుతున్న పేదల్ని పావులుగా వాడుకుంటున్నారు. వేలూరు నుంచి దిగుమతి తమిళనాడులోని వేలూరు, చిత్తూరు మధ్య రోజూ పలు రైళ్లు నడుస్తున్నాయి. తమిళనాడులోని కొందరు దళారులు పేదల నుంచి ఉచిత బియ్యాన్ని కిలో ఒక్క రూపాయికి కొనుగోలు చేస్తున్నారు. దాన్ని చిత్తూరులోని వ్యాపారులకు కిలో రూ.5 లెక్కన విక్రయిస్తున్నారు. ఈ బియ్యాన్ని పాలిష్ చేసి ఎవరికీ అనుమానం రాకుండా చిత్తూరుతోపాటు మన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. అది కూడా కిలో రూ.45 వరకు విక్రయిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో చిత్తూరు, తమిళనాడుకు చెందిన పలువురు పేద ప్రజల్ని బియ్యం వ్యాపారులు పావులుగా వాడుకుంటున్నారు. ఒక రోజుకు 15 కిలోల బియ్యాన్ని వేలూరు, కాట్పాడి ప్రాంతాల నుంచి భద్రంగా చిత్తూరు రైల్వే స్టేషన్‌కు తీసుకొచ్చి అందజేస్తే ఒక్కో మహిళకు కూలీ రూ.200 వరకు ఇస్తున్నారు. దీంతో ఎక్కువ మంది మహిళలు ఈ పనిపై ఆసక్తి చూపిస్తున్నారు. వెసులుబాటే అవకాశం రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ఒకసారికి 20 కిలోల వరకు ధాన్యాన్ని తీసుకెళ్లే వెసులుబాటు ఉంది. దీనిని ఆసరాగా చేసుకున్న చిత్తూరు నగరానికి చెందిన కొందరు బియ్యం వ్యాపారులు రేషన్ బియ్యం రాకెట్ నడుపుతున్నారు. చౌకగా వచ్చే ప్రభుత్వ బియ్యానికి పాలిష్ వేసి మెరుగైన ధాన్యంగా ప్రజలకు విక్రయిస్తూ మోసం చేస్తున్నారు. దీనిని పట్టించుకుని అక్రమ రవాణాను ఆపాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. ప్రధానంగా కొందరు అధికారులు, సిబ్బందికి అక్రమ వ్యాపారం చేస్తున్న వారి నుంచి నెలసరి మామూళ్లు వెళుతున్నాయని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. రోగాల బారిన ప్రజలు పాలిష్ వేసిన తమిళనాడు బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. బియ్యం పాలిష్ చేయడం ద్వారా దానిపై ఉన్న తృణపొరలు తరిగిపోతాయని, వాటిని వండుకుని తినడం ద్వారా శరీరానికి పోషక పదార్థాలు అందకుండా వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.