సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై–7) కింద నవంబర్ నుంచి జనవరి వరకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ వెల్లడించారు. ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘ఉచిత బియ్యం ఊసెత్తరేం’ శీర్షికన ప్రచురితమైన కథనాన్ని ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. రేషన్ డోర్ డెలివరీ విధానం ద్వారా ఇంటి వద్దకే నాణ్యమైన (సార్టెక్స్) బియ్యం పంపిణీచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
చదవండి: చిన్న పరిశ్రమలతో లక్షలాది ఉద్యోగాలు.. ఎంఎస్‌ఎంఈలకు ఏపీ సర్కార్ ప్రోత్సాహం
అయితే, కేంద్ర ప్రభుత్వం పీఎంజీకేఏవై కింద నాన్–సార్టెక్స్ బియ్యాన్ని మాత్రమే ఇస్తోందన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీకి నాన్ సార్టెక్స్ నిల్వలు లేనందున మూడు నెలలకు సరిపడా బియ్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ద్వారా అందించాలని, అక్టోబర్ నుంచి కాకుండా నవంబర్ నుంచి పంపిణీ చేసేలా అనుమతించాలంటూ ఈ నెల 21న కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు.
దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్రం రాష్ట్రానికి 3.24 లక్షల టన్నుల బియ్యాన్ని విడుదల చేయాలని ఎఫ్‌సీఐని ఆదేశించిందన్నారు. ప్రస్తుతం ఎఫ్‌సీఐ నుంచి జిల్లాల్లోని మండల స్టాక్ పాయింట్లకు బియ్యం రవాణా జరుగుతోందన్నారు. వచ్చేనెల నుంచి జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలోకి వచ్చే కార్డుదారుల్లోని ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యం అందజేయనున్నట్లు ఆయన వివరించారు.
గతంలో బియ్యం ఇవ్వని కేంద్రం..
ఇక ఆరో విడత ఉచిత బియ్యం పంపిణీని ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వరకు కేంద్ర పొడిగించగా రాష్ట్రానికి అవసరమైన బియ్యం పంపిణీని విస్మరించిందన్నారు. నాన్ సార్టెక్స్ నిల్వలు లేనందున, అందుబాటులో ఉన్న సార్టెక్స్ బియ్యం కేవలం రెగ్యులర్ పీడీఎస్‌లో పంపిణీ చేసేందుకు సరిపోతాయని, ఎఫ్‌సీఐ నుంచి బియ్యం విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినప్పటికీ పట్టించుకోలేదన్నారు. పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వమే నాన్ సార్టెక్స్ బియ్యాన్ని సొంతంగా సేకరించి ఆగస్టు, సెపె్టంబర్‌లో పంపిణీ చేసిందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పేదలకు ఆరు విడతల్లో 25 నెలల పాటు ఉచిత బియ్యం ఇస్తే.. రాష్ట్రం సొంతంగా 19 నెలల పాటు మానవతా దృక్పథంతో కేంద్రంతో సమానంగా స్టేట్ కార్డుదారులకు కూడా బియ్యాన్ని అందించిందన్నారు. ఇందుకోసం ఏకంగా రూ.5,700 కోట్లు ఖర్చుచేసిందని అరుణ్‌కుమార్ పేర్కొన్నారు.
ఉచిత బియ్యం పంపిణీ ఇలా..
రాష్ట్రంలో 4.23 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులు ఉంటే కేంద్రం కేవలం 2.68 కోట్ల మందికి మాత్రమే ప్రతినెలా బియ్యం అందిస్తోందని అరుణ్‌కుమార్ తెలిపారు. మిగిలిన కార్డులకు రాష్ట్రమే సొంతంగా నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తోందని పేర్కొన్నారు. ఉచిత బియ్యం పంపిణీలోనూ కేంద్రం ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డులకు మాత్రమే బియ్యాన్ని కేటాయిస్తోందన్నారు.
ఇందులో భాగంగా గతంలో రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం సిఫారసుల మేరకు తిరుపతి, విశాఖపట్నం కార్పొరేషన్లలో మినహా ఉత్తరాంధ్రలోని మూడు, రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోని 1.67 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచిత రేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. వీరితో పాటు మిగిలిన జిల్లాల్లోని 89.20 లక్షల ఎస్సీ, ఎస్టీలకు, 24.60 లక్షల మంది అంత్యోదయ అన్న యోజన కార్డుదారులకు, ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రాంతంగా ఉండటంతో అక్కడి లబ్ధిదారులకు ఉచిత రేషన్‌ను అందజేయనున్నట్లు అరుణ్‌కుమార్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment