న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి ఘనవిజయం సాధించిన దరిమిలా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేదానిపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ పేరు సీఎం రేసులో ముందంజలో ఉంది. కాగా దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం సాయంత్రం ఢిల్లీకి వచ్చారు. ఈ నేపధ్యంలో ఫడ్నవీస్ ఢిల్లీ పర్యటనపై పలు చర్చలు జరుగుతున్నాయి.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు మాత్రమే ఢిల్లీకి వచ్చానని, తన ఢిల్లీ పర్యటనకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అయితే దేవేంద్ర ఫడ్నవిస్ ఢిల్లీలో బీజేపీ అగ్ర నాయకత్వాన్ని కలవవచ్చంటూ గతంలో వార్తలు వినిపించాయి. అయితే తనకు ప్రస్తుతం పార్టీ అగ్రనేతలను కలిసే ఆలోచన లేదని ఫడ్నవిస్ స్వయంగా తెలిపారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గాను మహాయుతి 234 స్థానాల్లో విజయం సాధించింది. వీటిలో బీజేపీ 132 సీట్లు, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 57 సీట్లు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకున్నాయి. మిగతా మిత్రపక్షాలు నాలుగు స్థానాల్లో విజయం సాధించాయి. కాగా మీడియా కథనాల ప్రకారం దేవేంద్ర ఫడ్నవిస్ పేరు సీఎం పదవికి ఆమోదం పొందిందని, అతనితోపాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారని తెలుస్తోంది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ కూడా దేవేంద్ర ఫడ్నవిస్‌ను సీఎం చేయడానికి అనుకూలంగా ఉందని సమాచారం.
ఇది కూడా చదవండి: రాజకుటుంబంలో విభేదాలు.. ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఉద్రిక్తతలు..
Comments
Please login to add a commentAdd a comment