ముంబయి: మహారాష్ట్ర కొత్త సీఎంగా పదవి చేపట్టనున్న దేవేంద్ర ఫడ్నవీస్(54) రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మహారాష్ట్ర సీఎం స్థాయికి వచ్చారు. ఫడ్నవీస్ 1970 జులై 22న నాగ్‌పూర్‌లో జన్మించారు. ఫడ్నవీస్ తండ్రిపేరు గంగాధర్ ఫడ్నవీస్. జనసంఘ్‌లో, ఆ తర్వాత ఏర్పడిన బీజేపీలో గంగాధర్ ఫడ్నవీస్ పనిచేశారు.
కార్పొరేటర్ టు మూడుసార్లు సీఎం
విధేయతకు ఫడ్నవీస్ మారుపేరు. వినమ్రతకు నిలువెత్తు ఉదాహరణ. ఫడ్నవీస్ దగ్గర పార్టీ ధిక్కార స్వరమనేది ఉండదు. రాజకీయాల్లో పలు రికార్డులు ఆయన సొంతం. నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగి ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన ఫడ్నవీస్ ముచ్చటగా మూడోసారి గురువారం (డిసెంబర్ 5)న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
దేవేంద్ర ఫడ్నవీస్ 1989లో బీజేపీ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో చేరారు.న్యాయశాస్త్రంలో డిగ్రీ, బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పీజీ చేశారు. విద్యార్థి నేతగా చురుగ్గా వ్యవహరిస్తూ తన 22వ ఏట నాగ్‌పుర్ నగరపాలక సంస్థ కార్పొరేటర్‌గా ఎన్నియ్యారు.1997లో నాగ్‌పూర్ అక్కడి మేయర్ పదవిని చేపట్టేప్పుడు ఆయన వయసు 27 ఏళ్లంటే ఆశ్చర్యం కలగక మానదు. అతిచిన్న వయసులో మేయర్ పదవి చేపట్టారు ఫడ్నవీస్. దేశంలో చిన్న వయసులో మేయర్ అయిన రెండోవ్యక్తి ఆయన.
మోదీ,అమిత్‌షాలకు వీర విధేయుడు
తొలిసారి 1999లో నాగ్‌పుర్ నైరుతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. తాజాగా జరిగిన 2024 ఎన్నికలతో కలిపి ఇప్పటికి నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు.
2014లో ఫడ్నవీస్ తొలిసారి సీఎం అయ్యారు. అయిదేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. శరద్‌పవార్ తర్వాత అతి చిన్న వయసులో (44ఏళ్లకే) మహారాష్ట్ర సీఎం అయిన రికార్డు ఫడ్నవీస్ సొంతం. 2019లో రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ మిత్రపక్ష పార్టీగా ఉన్న శివసేన(ఉద్ధవ్) పార్టీ హ్యాండివ్వడంతో మూడు రోజులకే ఆ పదవి వదులుకోవాల్సి వచ్చింది.
2024 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతిని తన వ్యూహాలతో ఘన విజయం సాధించేలా చేసి మూడోసారి గురువారం సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇదీ చదవండి: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్
Comments
Please login to add a commentAdd a comment