బీజేఎల్పీ నేతగా ఎన్నిక నేడు ప్రమాణస్వీకారం
డిప్యూటీగా అజిత్ కూడా
షిండే ప్రమాణంపై సస్పెన్స్
ముంబై: మహారాష్ట్రలో పది రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ (54) పేరు ఖరారైంది. బీజేపీ శాసనసభాపక్షం బుధవారం ముంబైలో సమావేశమై ఆయన్ను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అడ్డంకులన్నీ తొలగిపోవడంతో ఆయన గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
ఆయనతో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. వారిలో ఎన్సీపీ చీఫ్ అజిత్ పేరు ఖరారైంది. ఆపద్ధర్మ సీఎం, శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే మాత్రం డిప్యూటీ సీఎం పదవి తీసుకోవడంపై ఏ విషయమూ తేల్చకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. డిప్యూటీగా ప్రభుత్వంలో చేరాల్సిందిగా ఫడ్నవీస్ ఆయన్ను కోరారు.
బీజేపీ అధిష్టానం పరిశీలకులుగా వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. సీఎంగా ఫడ్నవీస్ పేరును ఖరారు చేశారు. అనంతరం విధాన్ భవన్‌లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. శాసనసభాపక్ష నేతగా ఫడ్నవీస్ పేరును బీజేపీ సీనియర్ నాయకుడు చంద్రకాంత్ పాటిల్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. వారికి ఫడ్నవీస్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందని నిర్మల పేర్కొన్నారు.
ఫడ్నవీస్‌ను ప్రతిపాదిస్తున్నా: షిండే
అనంతరం ఫడ్నవీస్ నేతృత్వంలో షిండే, అజిత్ సహా మహాయుతి కూటమి నేతలు గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్‌తో సమావేశమయ్యారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. బీజేఎల్పీ నేతగా ఫడ్నవీస్ ఎన్నికైనట్లు లేఖ అందజేశారు. కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహా్వనించారు. గురువారం సాయంత్ర 5.30కు ఆజాద్ మైదాన్‌లో కార్యక్రమం ఉంటుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ‘‘సీఎంతో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు’’ అని తెలిపాయి.
అనంతరం షిండే, అజిత్‌లతో కలిసి ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. ‘‘మా కొత్త ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్లున్నాయి. కలిసుంటే క్షేమంగా ఉంటాం. ప్రధాని మోదీతో ఏదైనా సాధ్యమే. సీఎం పదవి కేవలం సాంకేతిక సర్దుబాటే. మహాయుతి పక్షాలన్నీ కలిసికట్టుగా పని చేస్తాయి. షిండే, అజిత్ తోడ్పాటుతో ప్రభుత్వాన్ని సజావుగా నడిపిస్తాం’’ అన్నారు. తనను సీఎంగా ఎంపిక చేసినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. రెండున్నరేళ్లపాటు సీఎంగా చేశానని, అందుకు సంతృప్తిగా ఉన్నానని షిండే పేర్కొన్నారు. ‘‘నాడు నన్ను సీఎం పదవికి ఫడ్నవీస్ ప్రతిపాదించారు. నేడు ఆయనను ఆ పదవికి నేను ప్రతిపాదిస్తున్నా. మేమంతా బృందంగా కలిసికట్టుగా పని చేస్తాం’’ అన్నారు.
పరస్పర ఛలోక్తులు
మీడియా భేటీలో మహాయుతి నేతలు పరస్పరం ఛలోక్తులు విసురుకున్నారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారా అని విలేకరులు ప్రశ్నించగా సాయంత్రం దాకా వేచి చూడండని షిండే బదులిచ్చారు. అజిత్ కల్పించుకుని తాను మాత్రం కచ్చితంగా ప్రమా ణం చేస్తానని అనడంతో గొల్లుమన్నారు. ‘‘అవునవును. ప్రమాణ స్వీకారాల్లో దాదా (అజిత్)కు చాలా అనుభవముంది. ఉదయం, సాయంత్రం ప్ర మాణం చేసిన అనుభవముంది’’ అనడంతో మరో సారి నవ్వు లు విరిశాయి. 2019లో అజిత్ తెల్లవారుజామున డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడం తెలిసిందే.
పదవి తీసుకోండి
షిండేపై సొంత ఎమ్మెల్యేల ఒత్తిడి
ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలంటూ షిండేపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఒత్తిడి తెచ్చారు. బుధవారం షిండేతో భేటీలో వారు స్పష్టం చేశారు. ఫడ్నవీస్ రాజీనామాతో ఖాళీ అయిన డిప్యూటీ సీఎం పోస్టును షిండే తీసుకుంటే పొత్తు ధర్మాన్ని గౌరవించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంలో చేరితే పార్టీనీ బలోపేతం చేసుకోవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment