ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడి రాజకీయాలపై దేశవ్యాప్తంగా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా నటి, ఎంపీ కంగనా రనౌత్ శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేపై పలు విమర్శలు గుప్పించారు.
మహిళలను అవమానించిన కారణంగానే ‘రాక్షసుడు’ ఈ పరిస్థితిని అనుభవించాల్సి వచ్చిందని కంగనా వ్యాఖ్యానించారు. ఉద్ధవ్ ఠాక్రే ఓటమిని తాను ముందే ఊహించినట్లు ఆమె తెలిపారు. స్త్రీలను గౌరవిస్తున్నారా? వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నారా? అనే దానిని అనుసరించే ఎవరు రాక్షసుడో.. ఎవరు మంచివారో గుర్తించగలమన్నారు. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి విజయం సాధించిన దరిమిలా కంగనా ఈ విధమైన వ్యాఖ్యానాలు చేశారు.
వారు తన ఇంటిని పడగొట్టారని, నానా దుర్భాషలాడారని అటువంటి చర్యలకు పరిణామాలు ఉంటాయని నమ్మానని కంగనా పేర్కొన్నారు. ఉద్ధవ్ ఠాక్రే శిక్షకు అర్హుడని, ఈ ఓటమిని తాను ముందే ఊహించానన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కొనియాడిన కంగనా ఆయనను అజేయునిగా అభివర్ణించారు. ప్రధాని మోదీ దేశ రక్షణకు నియమితుడైన నేత అని పేర్కొన్నారు.
దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసేవారికి ఈ ఎన్నికల ఫలితాలు గుణపాఠమని కంగనా పేర్కొన్నారు. అభివృద్ధి, సుస్థిరత కోసం మహారాష్ట్ర ప్రజలు ఓట్లు వేశారని కంగనా రనౌత్ పేర్కొన్నారు. కాగా కంగనా ఇంటిని అక్రమ నిర్మాణంగా ఆరోపిస్తూ, 2020, సెప్టెంబర్‌లో బీఎంసీ ఆమె ఇంటిలో కొంత భాగాన్ని కూల్చివేసింది. తరువాత బాంబే హైకోర్టు బీఎంసీ ఆదేశాలను రద్దు చేసింది. కంగనా నష్టపరిహారానికి అర్హురాలిగా ప్రకటించింది.
ఇది కూడా చదవండి: డబ్బు కోసం కాదు, మోక్షం కోసం : నృత్యం బాధ నుంచి పుడుతుంది!
Comments
Please login to add a commentAdd a comment