న్యూఢిల్లీ, సాక్షి: హస్తిన పర్యటనకు వెళ్లిన ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. గంట గడవక ముందే తిరుగుపయనం అయ్యారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అని చెప్పి హడావిడి చేసి.. కేవలం 10-15 నిమిషాలపాటే ఆయనతో చర్చించారు. తీరా బయటకు వచ్చాక ‘జరిగింది మర్యాదపూర్వక భేటీ’ అని స్టేట్‌మెంట్ ఇచ్చి తుస్సుమనిపించారు.
ఏపీ కూటమి ప్రభుత్వంలో భాగమైన బీజేపీ అగ్రనేతతో, అందునా హోం మంత్రితో పవన్ కల్యాణ్ భేటీ అవుతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అందుకు.. రెండ్రోజుల కిందట పవన్ చేసిన సంచలన వ్యాఖ్యలే కారణం. ఏపీలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని, పోలీసులు పదే పదే చెప్పించుకుంటున్నారని, హోం మంత్రి అనిత కూడా బాధ్యతయుతంగా ఉండాలని.. లేనిపక్షంలో తప్పుకోవాలని హెచ్చరించారు. అలాగే.. తాను హోం మంత్రి పదవి తీసుకుంటే పరిస్థితులు మరోలా ఉంటాయని వ్యాఖ్యానించారు.
దీంతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కూటమి పార్టీల నడుమ నిజంగానే ఏదైనా జరుగుతోందా? లేదంటే డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఈ డ్రామానా? అనే అనుమానాలు తలెత్తాయి. ఈలోపే.. పవన్ ఉన్నపళంగా ఢిల్లీకి వెళ్లి హోం మంత్రి అమిత్ షాతో భేటీ అవుతుండడంపై అనేక కోణాల్లో చర్చ నడిచింది. పవన్ తాజా వ్యాఖ్యలే ప్రధానాంశంగా ఈ భేటీ ఉండొచ్చనే కోణమూ అందులో ఉంది.
కానీ, వాటన్నింటిని పటాపంచల్ చేస్తూ.. మర్యాదపూర్వక భేటీ అని చెప్పి తుస్సుమనిపించారు. దీంతో ఇది కూడా డ్రామానేనా? అనే అనుమానాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. అంతేకాదు డిప్యూటీ సీఎం హోదాలో తన తొలి ఢిల్లీ పర్యటనలోనే ప్రజాధనాన్ని పవన్ ఇలా వృథా చేశారన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment