ప్రత్యేక సాయం వర్తింప చేయండి  | CM YS Jagans request to the Union Finance Minister | Sakshi
Sakshi News home page

ప్రత్యేక సాయం వర్తింప చేయండి 

Published Sat, May 27 2023 5:22 AM | Last Updated on Sat, May 27 2023 5:22 AM

CM YS Jagans request to the Union Finance Minister - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నాడు–నేడు పథకం ద్వారా విద్య, ఆరోగ్య రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (మూలధన పెట్టుబడి)గా భావించి ప్రత్యేక సాయం వర్తింప చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఈ కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం.. శుక్రవారం నిర్మలా సీతారామన్‌తో సుమారు 40 నిమిషాలు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే కేపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌పై కేంద్ర ప్రభుత్వం స్పెషల్‌ అసిస్టెన్స్‌ ఇచ్చేలా బడ్జెట్‌లో పొందుపరిచిన అంశాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాల్లో అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టిందని, స్కూళ్లలో నాడు–నేడు కింద రూ.6 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.

తొలి దశ కింద 15,717 స్కూళ్లలో పనులు పూర్తయ్యాయని, ఆరో తరగతి నుంచి ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. ఆరోగ్య రంగంలోనూ నాడు–నేడు కింద అనేక పనులు చేపట్టామని, విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటు మొదలు టీచింగ్‌ ఆస్పత్రుల వరకు పనులు చేపట్టామని,  ఇందుకు రూ.4 వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు.  ఈ  ఖర్చును క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించి స్పెషల్‌ అసిస్టెన్స్‌ వర్తింప చేయాలని కోరారు. 

జాప్యం లేకుండా నిధులు విడుదల చేయాలి 
2014–15కు సంబంధించిన వనరుల గ్యాప్‌ ఫండింగ్, 2016–2019 మధ్య పరిమితికి మించి తీసుకున్న రుణాల  కారణంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న పర్యవసానాలు, 2021–22లో రుణాల పరిమితిపై సడలింపుల  అంశాన్ని ఆర్థిక మంత్రితో చర్చించారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ డిస్కంలకు ఏపీ జెన్‌కో సరఫరా చేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.6,756.92 కోట్ల బకాయిల అంశాన్నీ ప్రస్తావించారు.

ఈ అంశం పలుసార్లు కేంద్రం దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఏపీ జెన్‌కో ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ సొమ్ములు  చాలా అవసరమని, జాప్యం లేకుండా వీలైనంత త్వరగా వచ్చేలా చూడాలని కోరారు. శనివారం నీతి ఆయోగ్‌  గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొననున్నారు.  

విమానాశ్రయంలో ఘన స్వాగతం 
ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి  వైఎస్సార్‌సీపీ ఎంపీలు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీలు మార్గాని భరత్‌రామ్, వంగా గీతా విశ్వనాథ్, చింతా అనూరాధ, ఎన్‌.రెడ్డెప్ప, ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి గన్నవరం నుంచి ముఖ్యమంత్రి వెంట వచ్చారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement