ఎవరికీ పట్టని ప్రాణాలు | Sakshi Editorial On Laborers Workers | Sakshi
Sakshi News home page

ఎవరికీ పట్టని ప్రాణాలు

Published Wed, Nov 29 2023 4:46 AM | Last Updated on Wed, Nov 29 2023 4:46 AM

Sakshi Editorial On Laborers Workers

జానెడు పొట్ట కోసం ఉన్న ఊరునూ, అయినవారినీ వదిలి దూరతీరాలకు పోయి కాయకష్టం చేసే వారు బతుకుపోరాటంలో ఎప్పుడూ ఓడిపోతూనే వుంటారు. మహానగరాల్లో రాళ్లెత్తే కూలీలుగా, క్వారీల్లో గనుల్లో చెమటోడ్చే కార్మికులుగా, భారీ భవంతులకు కాపలాదార్లుగా, స్థానికులు చేయసాహసించని అనేక ప్రమాదకరమైన పనులను తప్పనిసరిగా తలకెత్తుకుని ప్రాణాలు పణంగా పెట్టే బడుగుజీవులుగా వీరు అందరికీ సుపరిచితులే. కానీ భద్రత, ఆరోగ్యం వంటివి వీరికెప్పుడూ ఆమడదూరమే. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా అర్ధాకలితో కాలం గడిపే అలాంటి అభాగ్యులపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) విడుదల చేసిన నివేదిక దిగ్భ్రాంతికరమైన నిజాలు వెల్లడించింది.

పనికి సంబంధించిన ప్రమాదాల్లో చిక్కుకుని, వ్యాధుల బారినపడి ప్రపంచవ్యాప్తంగా సగటున ఏటా 30 లక్షలమంది కన్నుమూస్తున్నారని ఆ నివేదిక అంచనా. కార్మికుల ఉసురుతీస్తున్న పది రకాల కారణాలను ఆ నివేదిక గుర్తించింది. సుదీర్ఘమైన పనిగంటలు (వారానికి 55 గంటలు లేదా అంతకన్నా ఎక్కువ) కార్మికుల మరణాలకు ప్రధాన కారణమవుతున్నాయని, ఆ కేటగిరీలో ఏటా మరణిస్తున్నవారు 7,44,924 మంది అని తేల్చింది. ఆ తర్వాత స్థానం సూక్ష్మ ధూళి కణాలు, పొగలు, వాయువులది. వాటి బారినపడి మర ణించేవారు ఏటా 4,50,381 మంది అని లెక్కేసింది.

ఇవిగాక నికెల్, ఆర్సెనిక్, డీజిల్‌ కాలుష్యం, సిలికా, ఆస్బెస్టాస్‌ తదితరాల వల్ల మరో 15 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. వీటిల్లో 63 శాతం ఆసియా–పసిఫిక్‌ ప్రాంత దేశాల్లోనే వుంటున్నాయని వివరించింది. వ్యవసాయం, రవాణా, మైనింగ్, నిర్మాణరంగం వగైరాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి నివారణకు అనుసరించాల్సిన విధానాల రూపకల్పనకు సోమవారం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ప్రారంభ మైన నాలుగురోజుల సదస్సు సందర్భంగా ఐఎల్‌ఓ ఈ నివేదిక వెలువరించింది.

మనవరకూ తీసుకుంటే జనాభాలో మూడోవంతు మంది వలసబాట పడుతున్నారు. వీరంతా పల్లెటూళ్లను వదిలి పట్టణాలకూ, నగరాలకూ వలసపోయేవారే. ఇలాంటివారు ఎలాంటి గుర్తింపూ లేకుండా బతుకులీడుస్తున్నారు. వారికి ఓటు హక్కుండదు. రేషన్‌ కార్డు వుండదు గనుక చవగ్గా సరుకులు లభించవు. స్థానికతకు అవకాశం లేదు గనుక వారి హక్కుల కోసం, పని పరిస్థితుల మెరుగు కోసం పోరాడే సంస్థలుండవు. అసంఘటిత రంగ కార్మికులుగా కనీసం చట్టప్రకారం దక్కాల్సినవి వారికి ఎప్పుడూ దూరమే. జ్వరమో, మరే వ్యాధో ముంచుకొచ్చినా చూసే దిక్కుండదు. ఇలాంటి అభాగ్యులకు కుటుంబాలుంటే ఈ కష్టాలన్నీ మరిన్ని రెట్లు ఎక్కువ.

ఈ కార్మికుల కాంట్రాక్టర్లు సర్వసాధారణంగా ఏదో ఒక పార్టీ ఛత్రఛాయలో వుంటారు గనుక అధికారులు వారి జోలికి పోవటానికి, కార్మికుల ప్రయోజనాలు కాపాడటానికి సాహసించరు. మెరుగైన సాంకేతికత లున్న యంత్ర సామగ్రి లభ్యమవుతున్నా వాటిపై పెట్టుబడులు పెట్టడం దండగన్న భావనతో ఈ కార్మికులతోనే అన్నీ చేయిస్తుంటారు. ఈ క్రమంలో ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోవటం లేదా అంగవికలురు కావటం రివాజు. ప్రపంచవ్యాప్తంగా గాయాలపాలై ఏటా 3,63,283 మంది కార్మికులు మరణిస్తున్నారని ఐఎల్‌ఓ నివేదిక చెబుతోంది.

మన దేశంలో 2017–2020 మధ్య సగటున రోజూ ముగ్గురు కార్మికులు ప్రమాదాల బారినపడి చనిపోతున్నారని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ డేటా తెలిపింది. ఇవన్నీ రిజిస్టరయిన ఫ్యాక్టరీలకు సంబంధించినవి. అసంఘటిత రంగంలో సంభవించే మరణాలకు అరకొర డేటాయే వుంటుంది. సాధారణంగా ఆ రంగంలో సంభ వించే చాలా మరణాలు సహజ మరణాల ఖాతాలోకి పోతుంటాయి. వైద్యులు కూడా వారికి సహకరిస్తుంటారు. అసంఘటిత రంగ కార్మికులు చేసే వెట్టిచాకిరీ అపారమైన సంపద సృష్టిస్తోంది. కానీ ఆ సంపద సృష్టికర్తలు అనామకులుగా మిగిలిపోతున్నారు. ముగిసిపోతున్నారు.

అంతర్జాతీయంగా నిబంధనలు లేవని కాదు. పని పరిస్థితుల్లో భద్రత, ఆరోగ్యం వంటి అంశా లపై ఐఎల్‌ఓ రూపొందించిన అంతర్జాతీయ ఒడంబడికను 187 సభ్య దేశాల్లో కేవలం 79 దేశాలు ఆమోదించాయి. కనీసం అందుకు సంబంధించిన నియమ నిబంధనలకైనా సభ్య దేశాలన్నీ ఆమోదం తెలపలేదు. అందుకు కేవలం 62 దేశాలు మాత్రమే సమ్మతించాయి. ఈ రెండు ఒడంబడి కలకూ మన దేశం ఆమడ దూరంలో వుంది. వృత్తిపరంగా ఎదురయ్యే ఇబ్బందులేమిటో, అందులో పొంచివుండే ప్రమాదాలేమిటో బయటివారికన్నా కార్మికులకే ఎక్కువ తెలుస్తుంది.

కనీసం అవి బయటివారు తెలుసుకోవటానికైనా కార్మికులకు సంఘాలుండాలి. వారి తరఫున గట్టిగా ప్రశ్నించే నేతలుండాలి. కానీ మన దేశం వరకూ చూస్తే కార్మిక సంస్కరణల పేరిట తీసుకొచ్చిన కొత్త చట్టాలు అలాంటి అవకాశాలను మరింత నీరుగార్చాయి. ఫలితంగా బాల కార్మిక వ్యవస్థ, వెట్టిచాకిరీ, వివక్ష, అధిక పనిగంటలు వంటివన్నీ అసంఘటిత రంగ కార్మికులకు శాపాలవుతున్నాయి. రిజిస్టరైన ఫ్యాక్టరీల్లోనే తప్పుడు లెక్కలు చూపించి కార్మికుల భద్రతకు సంబంధించిన కమిటీల ఏర్పాటు,లైంగిక వివక్ష నిర్మూలన తదితరాలను ఎగ్గొడుతున్నారు.

ఇక ఎవరికీ పట్టని అసంఘటితరంగ కార్మికుల గురించి చెప్పేదేముంది? సిడ్నీలో సాగుతున్న సదస్సులో 127 దేశాలకు చెందిన మూడు వేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారు. 30 గోష్ఠులు, ఆరు సాంకేతిక సదస్సులు కూడా వుంటాయంటున్నారు. కనీసం ఈ సదస్సు తర్వాతనైనా కార్మికుల భద్రతకు ముప్పుగా పరిణమించిన సమస్యలను నివారించటానికి పకడ్బందీ విధానాలు రూపొందించటం తమ బాధ్యతగా ప్రభు త్వాలు గుర్తించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement