పాస్‌లతో కాసుల వర్షం
సాక్షి, ముంబై: లోకల్ రైలు చార్జీలు కూడా పెంచనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో నగరవాసులు ముందుగానే సీజన్ పాస్‌లు కొనుగోలు చేశారు. దీంతో సెంట్రల్, వెస్టర్న్ రైల్వే పంట పండింది. సీజన్ పాస్‌ల ధరలు రెట్టింపు కానున్నాయని టీవీల్లో, వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలతో బెంబేలెత్తిపోయిన నగరవాసులు అప్పుచేసి మరీ సీజన్ టికెట్లను కొనుక్కున్నారు. కొందరు వార్షిక, మరికొందరు అర్ధవార్షిక పాస్‌లు కొనుగోలు చేశారు. దీంతో సెంట్రల్, వెస్టర్న్ రైల్వేకు రోజుకు 7.5 కోట్ల రూపాయలు కేవలం సీజన్ టికెట్ల అమ్మకం ద్వారా సమకూరినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
సెంట్రల్ రైల్వేలో..
21 నుంచి 23వ తేదీ వరకు సెంట్రల్ రైల్వే సీజన్ పాస్‌లను విక్రయించడం ద్వారా రూ.11.60 కోట్లు మూటగట్టుకుంది. దీంతో రోజుకు రూ.4 కోట్లు ఈ రైల్వేకు అదనంగా సమకూరాయి. రైల్వే టికెట్ల ద్వారా పండుగలు, ఉత్సవాల సందర్భాలను మినహాయించి సాధారణ రోజుల్లో రోజుకు రూ.85 లక్షల ఆదాయం మాత్రమే సమకూరేది.
ప్రభుత్వం రైల్వే చార్జీలను పెంచనున్నట్లు ప్రకటించడంతో సీజన్ టికెట్ల కోసం జనం బారులు తీరడంతో గణనీయమైన ఆదాయం సమకూరింది. 21వ తేదీ నుంచి గత మంగళవారం వరకు రోజుకు లక్షకు పైగా సీజన్ పాస్‌లను విక్రయించింది. సాధారణంగా అయితే రోజుకు 40 వేల పాస్‌లను మాత్రమే విక్రయించేది. చార్జీలు పెరుగుతాయన్న ప్రకటన పుణ్యమా అని రైల్వేకు అదనపు ఆదాయం వచ్చిపడింది.
వెస్టర్న్ రైల్వేలో..
వెస్టర్న్ రైల్వే కూడా ఆదాయాన్ని భారీగా ఆర్జించింది. వెస్టర్న్ రైల్వే సీనియర్ అధికారి ఒకరు ఈ విషయమై మాట్లాడుతూ.. రోజుకు సగటున 40 వేల సీజన్ పాస్‌లు విక్రయించామని చెప్పారు. దీంతో దాదాపు కోటి రూపాయల ఆదాయం అదనంగా సమకూరిందన్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి సోమవారం సాయంత్రం నాలుగు గంటల వరకు వెస్టర్న్ రైల్వే రూ.2.57 లక్షల సీజన్ పాస్‌లను విక్రయించి రూ.16 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. రోజుకు 64 వేల మంది ప్రయాణికులు సీజన్ పాస్‌లను కొనుగోలు చేయగా, రూ.4 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.
పోగొట్టుకున్నవారికి డూప్లికేట్ సీజన్ టికెట్ ఇవ్వాలి
వ్యయప్రయాసలకోర్చి వార్షిక, అర్ధవార్షిక, త్రైమాసిక సీజన్ టికెట్లను కొనుగోలు చేసినవారు ఒకవేళ టికెట్ పోగొట్టుకుంటే డూప్లికేట్ టికెట్‌ను జారీ చేయాలని ప్రయాణికుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయమై కర్జత్-కసారా రైల్వే ప్రయాణికుల సంఘం సలహాదారుడు రాజేష్ ధన్‌గావ్ మాట్లాడుతూ.. ‘రైల్వే చార్జీలు నూటికి నూరు శాతం పెరగనున్నాయన్న భయంతో వేలాది మంది సీజన్ టికెట్లు కొనుగోలు చేశారు. జూన్ నెల చివరి వారం కావడంతో అనేక మంది తమవద్ద డబ్బులు లేకపోయినా అప్పులు చేసి మరీ సీజన్ టికెట్లు కొనుక్కున్నారు. వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఈ టికెట్లను దీర్ఘకాలంపాటు భద్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వీటిని పోగొట్టుకుంటే మళ్లీ వేల రూపాయలు ఖర్చుచేసి కొత్త పాస్‌లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. పోగొట్టుకున్న పాస్ నంబర్‌పై డూప్లికేట్ పాస్ ఇచ్చే సదుపాయం లేకపోవడంతో ప్రయాణికులపై భారం పడుతోంది. డూప్లికేట్ పాస్‌లు కూడా ఇస్తే పోగొట్టుకున్నా ఎటువంటి నష్టం ఉండద’న్నారు.
విక్రయమైన సీజన్ పాస్‌ల వివరాలు...
సెంట్రల్ రైల్వే..
తేదీ నెలసరి {తైమాసిక అర్ధవార్షిక వార్షిక
జూన్ 21 37,333 7,369 880 555
జూన్ 22 20,605 9,698 2,346 1,381
జూన్ 23 51,008 28,809 11,278 9,369
జూన్ 24 46,940 56,917 30,275 23.513
వెస్టర్న్ రైల్వే...
తేదీ నెలసరి త్రైమాసిక అర్ధవార్షిక వార్షిక
జూన్ 21 29,819 9,527 1,636 1,434
జూన్ 22 17,923 10,342 2,964 3,032
జూన్ 23 34,173 28,863 14,923 18,957
జూన్ 24 18,923 25,341 17,388 21,806