గుజరాత్‌కు ‘పశ్చిమ రైల్వే’ తరలింపు! | 'Western Railway' move to Gujarat | Sakshi
Sakshi News home page

గుజరాత్‌కు ‘పశ్చిమ రైల్వే’ తరలింపు!

Published Sun, Nov 30 2014 10:31 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

'Western Railway' move to Gujarat

సాక్షి, ముంబై: నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన పశ్చిమ రైల్వే ప్రధాన కార్యాలయాన్ని గుజరాత్‌కు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైల్వే పరిపాలన విభాగం చేస్తున్న ఈ ప్రయత్నాలను మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్)తోపాటు శివసేన కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాల్ఘర్‌లోని సముద్ర తీర ప్రాంత భద్రత ప్రధాన కార్యాలయం, రిజర్వు బ్యాంక్‌లోని కొన్ని కీలక శాఖలను ఇదివరకే గుజరాత్‌కు తరలించారు. నారిమన్ పాయింట్‌లో ఉన్న ఎయిర్ ఇండియా ప్రధాన కార్యాలయాన్ని కూడా త్వరలో మార్చివేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

వీటితోపాటు డైమండ్ మార్కెట్‌ను, మరికొన్ని కీలక వ్యాపార, వాణిజ్య సంస్థలను గుజరాత్‌కు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా, మహారాష్ట్రను బలహీనపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని శివసేన ఎంపీ సంజయ్ రావుత్ ఆరోపించారు. దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబైనుంచి పలు ప్రధాన కార్యాలయాలను వేరే ప్రాంతాలకు తరలించడంపై సమాధానం చెప్పాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్‌చేశారు. అలాగే  ముంబై నుంచి పలు కార్యాలయాల తరలింపును వెంటనే నిలిపివేయాలని కేంద్రానికి లేఖ రాయాలని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఒక పక్క రాష్ట్రంలో ఉన్న మైనారిటీ బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు శివసేనతో పొత్తు అనివార్యమైన పరిస్థితిలో, కేంద్రంలో మోదీ సర్కార్ పనితీరుపై శివసేన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

ముంబైలోని పశ్చిమ రైల్వే ప్రధాన కార్యాలయాన్ని గుజరాత్‌కు తరలించాలని పార్లమెంట్‌లో రెండు రోజుల కిందట బీజేపీకి చెందిన అహ్మదాబాద్ (పశ్చిమ) ఎంపీ కిరీట్ సోలంకి డిమాండ్ చేశారు. అహ్మదాబాద్ నగరం పశ్చిమ రైల్వే పరిధిలో నడి బొడ్డున ఉంది. దీంతో ముంబైలో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని గుజరాత్‌కు తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. సోలంకి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం లేపాయి. ప్రయాణికుల సంఘటన్‌లు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే అనేక కీలక కార్యాలయాలు గుజరాత్‌కు తరలించారని, దీనిపై తన వైఖరి ఏంటో స్పష్టం చేయాలని ఫడ్నవిస్‌ను రావుత్  నిలదీశారు.

ఇదిలాఉండగా గత అనేక సంవత్సరాల నుంచి పశ్చిమ రైల్వే ప్రధాన కార్యాలయం ముంబైలోనే ఉంది. అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండగా గుజరాత్‌కు తరలించడంలో ఆంతర్యమేమిటని కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్ ప్రశ్నించారు. ఒకవేళ కార్యాలయాన్ని ముంబై నుంచి గుజరాత్‌కు తరలిస్తే ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement