blue storm
-
రెండేళ్లైనా.. అందని పండే
అమలాపురం : ప్రకృతికి తొలి అలుసు.. మట్టిని నమ్ముకునే రైతే. ప్రభుత్వాల అలసత్వానికి తొలి బాధితుడు కూడా రైతే. ప్రకృతి కబళించిన పంటకు కంటితుడుపుగా ఇచ్చే పరిహారం రైతు కన్నీరింకిన ఎన్నాళ్లకు, ఎన్నేళ్లకు ఇస్తారో తెలియని దుస్థితే అందుకు నిదర్శనం. నీలం తుపాను వచ్చి రెండేళ్లు దాటినా ఇప్పటికీ రైతులకు పూర్తిస్థాయిలో పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) అందకపోవడమే అందుకు ప్రబల సాక్ష్యం. నీలం తుపాను వచ్చి ఈ నవంబరు మూడుకు రెండేళ్లు పూర్తయింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం రూపంలో పెట్టుబడి రాయితీని అందిస్తుంది. 2012 అక్టోబరు చివరిలో కురిసిన ఈశాన్య రుతుపవనాలకు తోడు నీలం తుపాను రావడంతో రైతులు భారీగా పంటనష్టపోయారు. జిల్లాలో 3.50 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బ తిందని అంచనా. 2.76 లక్షల మంది రైతులను బాధితులుగా గుర్తించిన ప్రభుత్వం పెట్టుబడి రాయితీ రూపంలో రూ.145.57 కోట్లు మంజూరు చేసింది. గత ఏడాది అక్టోబరు, నవంబరు నెలల్లో వీటిని రైతుల ఖాతాకు జమ చేయాల్సి ఉంది. అయితే 2.50 లక్షల మంది రైతులకు రూ.138 కోట్లను మాత్రమే జమ చేశారు. నిధులను ప్రభుత్వం విడతల వారీగా మంజూరు చేసింది. చివరిగా రాష్ట్ర విభజన ముందు అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న రూ.ఏడు కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను ట్రెజరీ ద్వారా ఆయా జిల్లాలకు, అక్కడ నుంచి రైతుల ఖాతాకు జమ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి లేదని ట్రెజరీ నిధుల విడుదలకు అంగీకరించలేదు. ఇంతలో రాష్ట్ర విభజనతో నిధులు వెనక్కు మళ్లిపోయాయి. దీనితో రైతులకు పెట్టుబడి రాయితీ అందకుండా పోయింది. అలాగే గతంలో పంపిణీ చేసిన రూ.138 కోట్లలో ఆన్లైన్ బ్యాంకు ఖాతాలు ఇవ్వని రైతులకు, సాంకేతిక ఇబ్బందుల కారణంగా మరో రూ.3. 57 కోట్లు మరికొందరు రైతులకు అందలేదు. మొత్తం మీద సుమారు 26 వేల మంది రైతులకు రూ.10.57 కోట్లు అందకుండా పోయాయి. త్వరలోనే అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో నీలం పరిహారం అందించకపోవడంపై ఏడాదిగా రైతులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా పర్యటనకు వచ్చిన వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, వ్యవసాయ శాఖ కమిషనర్ మధుసూదనరావుల వద్ద రైతులు పరిహారంపై గోడు వెళ్లబోసుకున్నా స్పందన లేదు. ‘హెలెన్’ పరిహారం ఊసే లేదు.. నీలం పరిహారాన్ని ఇప్పటికీ పూర్తిస్థాయిలో అందించని ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో సంభవించిన హెలెన్ తుపాను పరిహారంపై ఇప్పటి వరకు నోరు మెదపలేదు. గత ఏడాది నవంబరులో వచ్చిన భారీ వర్షాలకు సుమారు 1.46 లక్షల ఎకరాల్లో, హెలెన్ వల్ల 1.76 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. మొత్తమ్మీద 3.22 లక్షల ఎకరాల్లో పంటనష్టపోయిన 1.30 లక్షల మంది రైతులకు రూ.130 కోట్లు ఇన్పుట్ సబ్సిడీగా ప్రభుత్వం అందించాల్సి ఉంది. అయితే వ్యవసాయ శాఖ అధికారులు పంపిన నివేదికలపై ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడంపై హెలెన్ పరిహారం వస్తుందనే నమ్మకం రైతుల్లో కొరవడింది. నష్టపోయిన రైతుకు హెక్టారుకు రూ.25 వేలు పరిహారం అందించాలని, పెట్టుబడి రాయితీని తక్షణం అందజేయాలని గతంలో ఆమరణ నిరాహారదీక్ష చేసిన చంద్రబాబు నాయుడే ఎన్నికల్లో విజయం సాధించి ఇప్పుడుముఖ్యమంత్రి అయ్యారు. రుణమాఫీ విషయంలో మాట తప్పినట్టే.. హెక్టారుకు రూ.25 వేల పరిహారం విషయంలోనూ రైతులకు మొండిచేయి చూపారు. ఇందుకు ఉదాహరణ ఇటీవల హుద్‌హుద్ తుపానుకు ఉత్తరాంధ్రలో పంట కోల్పోయిన రైతుకు పెట్టుబడి రాయితీని హెక్టారుకు కేవలం రూ.15 వేలే ప్రకటించారు. ప్రకృతి చేసిన గాయంపై పాలకుల నిర్లక్ష్యం కారంలా బాధిస్తోందని రైతులు వాపోతున్నారు. -
ఏళ్లు గడిచినా.. కన్నీళ్లు తుడవరా?
కాకినాడ : ‘న్యాయం జరగడం ఆలస్యమైతే.. అన్యాయం జరిగినట్టే’ అన్నది నానుడి. ఈ లెక్కన.. న్యాయం జరగాల్సినవారికి అసలు న్యాయమే జరగకపోతే.. దురన్యాయమే జరిగినట్టు. దీని ప్రకారం 2012 సంవత్సరాంతంలో విరుచుకుపడ్డ నీలం తుపానుతో పంట నష్టపోయిన రైతులకు కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం దురన్యాయం చేసినట్టే. ఆ తుపానుకు జిల్లాలోని 1.43 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని అధికారులే నిర్ధారించగా హెక్టారుకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించింది. జిల్లాలోని 3 లక్షల మంది బాధిత రైతులకు రూ.143 కోట్ల పరిహారం 2013లో మంజూరైంది. తమకు జరిగిన నష్టంతో పోల్చితే ప్రభుత్వం ఇచ్చే సాయం అతి తక్కువే అయినా.. ‘గుడ్డి కన్నా మెల్ల మేలు’ చందంగా ఎంతో కొంత ఊరట కలుగుతుంది కదా అని అన్నదాతలు భావిం చారు. అయితే ప్రకటించిన పరిహారం కూడా రైతులకు అదనుకు, అవసరానికి కాక, మీనమేషాలు లెక్కిస్తూ ఎన్నటికో విడుదలైంది. అందులోనూ ఇప్పటివరకూ 2.65 లక్షల మంది రైతులకు రూ.129 కోట్ల పరిహారం పంపిణీ అయింది. మిగిలిన 35 వేల మంది రైతులూ నేటికీ పరిహారం కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. వారు నష్టం చవిచూసిన అనంతరం రెండు క్యాలెండర్లు మారిపోయినా.. ఒక్క రూపాయి పరిహారం కూడా చెల్లించలేదు. అటు రెవెన్యూ, వ్యవసాయ శాఖలు, ఇటు బ్యాంకుల సమన్వయ లోపం కారణంగా రూ.14 కోట్ల పరిహారం ఇప్పటికీ బాధితులకు అందలేదు. రైతుల బ్యాంకు ఖాతా నంబర్లు తప్పుగా నమోదు కావడమో లేక రైతుకు, ఖాతాకు సంబంధం లేకపోవడమో ఇందుకు కారణమని అంటున్నారు. అంతేకాక.. వ్యవసాయ, రెవెన్యూ శాఖల దగ్గర ఉన్న పేర్లకు, బ్యాంకుల్లో ఉన్న రికార్డుకు పొంతన కుదరకపోవడం కూడా పరిహారం చెల్లింపులో క్షమార్హం కాని ఈ జాప్యానికి కారణమని చెబుతున్నారు. నిజానికి పారదర్శకత పేరుతో డెరైక్టు బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పథకం కింద ఆన్లైన్ ద్వారా మొదటిసారిగా నీలం పరిహారాన్ని రైతుకు నేరుగా ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అయితే అమలులో పారదర్శకత మాట అటుంచి అసలు పరిహారం రైతు కళ్లబడడమే గగనమైంది. పారదర్శకత పేరుతో.. అసలుకే ఎసరు పెట్టే దాని కన్నా గ్రామసభలు పెట్టి పరిహారం బాధితులకు పంపిణీ చేసినా న్యాయం చేసినట్టయ్యేది. కారణమేదైతేనేం.. ఇప్పటివరకూ పరిహారం మాత్రం అందలేదు. జారిపోతున్న ఆశను కూడగట్టుకుంటూ ఆ 35 వేల మంది రైతుల్లో పలువురు గ్రీవెన్స్ సెల్లోనో, డయల్ యువర్ కలెక్టర్లోనో.. ఇలా ఏ వేదికనూ వదలకుండా నీలం పరిహారం కోసం మొర పెట్టుకుంటూనే ఉన్నారు. రాష్ట్రపతి పాలనకు ముందు వరకూ అధికార పార్టీకి చెందిన రాష్ట్రస్థాయి నాయకులు ఎవరు జిల్లాకు వచ్చినా పరిహారం దక్కేలా చూడమని అభ్యర్థిస్తూనే వచ్చారు. చివరికి ప్రాణం విసిగి ‘ఏట్లో జారిపడ్డ నాణెం’పై ఆశలు వదులుకున్నట్టే.. తమకు నీలం పరిహారం అందుతుందన్న నమ్మకాన్ని వదులుకోక తప్పదని నిట్టూరుస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా సమన్వయంతో వ్యవహరించి.. ఎన్నడో మంజూరైన నీలం నష్ట పరిహారాన్ని అందజేస్తారో లేక అన్నదాతలకు నిరాశనే మిగులుస్తారో చూడాలి. -
ఎట్టకేలకు ‘నీలం’ పరిహారం
4023 మందికి రూ.2.34 కోట్లు విడుదల మరో 10,190 మందికి మొండిచేయి ఆహార పంటలకే ఇన్పుట్ సబ్సిడీ విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ప్రభుత్వ నిర్ణయాలు రైతులను నిలువునా ముం చుతున్నాయి. అతివృష్టి, అనావృష్టిల కు పంటలు కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అన్నదాతలను మరిం త క్షోభకు గురిచేస్తున్నాయి. పెట్టుబడులు కూడా రాక అప్పుల్లో కూరుకుపోయిన రైతులను ఆదుకోవాల్సిన సర్కారు.. ఇన్పుట్ సబ్సిడీ అందించే విషయంలో సవాలక్ష నిబంధనలతో ఇబ్బందులకు గురిచేస్తోంది. తాజాగా రెండేళ్ల క్రితం నీలం తుపాను నష్టానికి ఇన్పుట్ సబ్సిడీని ఇప్పుడు విడుదల చేసింది. ఇందులో కూడా కేవలం బ్యాంకు ఖాతాలు ఉన్నవారికే ఇస్తూ.. మిగిలిన 10 వేల మందికి రిక్తహస్తాన్ని చూపిం చింది. 2011 నవంబర్‌లో నీలం తుపాను కారణంగా జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. ఆహారపంటలు నీట మునిగి సుమారు రూ.90 కోట్లు నష్టం వాటిల్లింది. అయితే ప్రభు త్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కేవలం 1848.78 హెక్టార్లలో మాత్రమే నష్టం జరిగినట్లు నిర్ధారించి 13,235 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.4.13 కోట్లు కు ప్రతిపాదించారు. గతేడాది తొలి విడతగా 671.58 హెక్టార్లలో జరిగిన నష్టానికి 6167 మంది రైతులకు రూ.67.16 లక్షలు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. మిగిలిన రైతులను విస్మరించిన సర్కారు తాజాగా రెండో విడతలో రూ.2.34 కోట్లు మాత్రమే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 535.92 హెక్టార్లలో జరిగిన నష్టానికి బ్యాంకు ఖాతాలు ఉన్న 4023 మంది రైతులకు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేసింది. ఇంకా 10,190 మంది రైతులకు పరి హారం అందించాల్సి ఉంది. ఏజెన్సీలో బ్యాంకు సేవలు అందుబాటులో లేకపోవడంతో వారం తా ఖాతాలు తీసుకొనే వెసులుబాటులేదు. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారులు అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించారు. ఇటీవల వ్యవసాయ పంటలకు సంబంధించి ఏజెన్సీ రైతులకు చెక్కుల ద్వారా పంపిణీకి అంగీకరించిన ప్రభుత్వం, ఆహారపంటల రైతుల విషయంలో మాత్రం మళ్లీ పాత పద్ధతిలోనే కొనసాగడం సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనం. -
నీలం పరిహారం పంపిణీకి సిద్ధం
కూచిపూడి, న్యూస్‌లైన్ : రెండేళ్ల క్రితం సంభవించిన నీలం తుపాను నష్టపరిహారం బకాయి రూ.3 కోట్లు పంపిణికీ సిద్ధంగా ఉందని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఆయన మొవ్వ మండలంలోని కారకంపాడులోని స్వగృహంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో రూ.13కోట్లు పంటనష్టపరిహారంగా గుర్తించామని అందులో తొలి విడత రూ.10 కోట్లు అప్పట్లోనే విడుదల కాగా మిగిలిన రూ.3కోట్లు వారం రోజుల క్రితం విడుదలయ్యాయని, రెండు మూడు రోజుల్లో వ్యవసాయ శాఖాధికారులు రైతుల ఖాతాలకు నేరుగా పంపుతారని చెప్పారు. ఈ మేరకు జేడీకి ఆదేశాలు జారీచేశామని వెల్లడించారు. కాగా కారకంపాడు నుంచి నిడుమోలు వరకు డబుల్‌రోడ్డుకు రూ.10.10కోట్లతో అంచనాలు వేయించామన్నారు. దీనికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదం తెలిపారని చెప్పారు. కాంట్రాక్టు లెక్చరర్లను రిటైర్ అయ్యే వరకు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే రిటైరయ్యే పోస్టుల్లో మాత్రం ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వం ఏక పక్ష నిర్ణయం తీసుకున్నా... అది అమలు జరిగే అవకాశాలు లేవన్నారు. ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలు, విడివిడిగా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తేనే రాష్ట్ర విభజనకు అవకాశం ఏర్పడుతుందన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే రాష్ట్రం విడిపోతేనే తీవ్ర పరిణామాలు ఏర్పడుతాయని పేర్కొంటుండటంతో విభజన ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని సార థి తేల్చి చెప్పారు.ఆయన అంతకుముందుగా మొవ్వ ఎంపీడీవో వై.పిచ్చిరెడ్డి, తహశీల్దార్ జీ భద్రుతో చర్చించారు. ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈ అమరేశ్వరరావు, డీఈ ఏ శ్రీనివాసరావుతో శాఖాపరమైన చర్చలు జరిపారు. -
ఖాతాల కష్టాలు
=తప్పుల కారణంగా రైతుల తిప్పలు =నీలం పరిహారం అందక అవస్థలు =బ్యాంకుల్లో మురుగుతున్న కోట్లు సాక్షి, విశాఖపట్నం : చిన్న పొర పాటే కావచ్చు కానీ, అది రైతులకు పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. బ్యాంకు ఖాతాలో పొరపాట్ల వల్ల ప్రభుత్వం విడుదల చేసిన పరిహారం వారికి దక్కకుండా పోతోంది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని చందంగా నీలం తుఫాన్ బాధిత రైతుల పరిస్థితి తయారైంది. నిధుల మంజూరు నాటి నుంచి రైతుల బ్యాంకు ఖాతాల తెరిపించే వరకు తొలుత సర్కార్ నిర్లక్ష్యం వహించింది. ఇప్పుడు రైతుల బ్యాంకు ఖాతాల్లో లోపాలు సమస్యగా పరిణమించాయి. 2012లో వచ్చిన నీలం తుఫాన్ వల్ల జిల్లాలో 1,47,812 మంది రైతులు నష్టపోయారు. వీరికి ప్రభుత్వం రూ. 30.41 కోట్లు ఇన్‌ఫుట్ సబ్సిడీగా చెల్లించాల్సి ఉంది. కానీ సర్కార్ వెంటనే స్పందించలేదు. రైతులు గగ్గోలు పెట్టడంతో 2013లో రెండు ధపాలుగా రూ. 23.41 కోట్లు మంజూరు చేసింది. బ్యాంకు ఖాతాలు ఉన్న 57,082 మందికి తొలి విడతగా రూ. 13.34 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని సంబంధిత బ్యాంకు ఖాతాలకు ఒకేసారి వేశారు. కానీ 51,269 మందికి చెందిన ఖాతాల్లోకి మాత్రమే రూ.8.81 కోట్లు జమ అయింది. మిగతా 5,813 మంది ఖాతాల్లోకి డబ్బు జమ కాలేదు. రూ. 1.1 కోట్లు బ్యాంకుల్లో చిక్కుకున్నాయి. రెండో విడతగా సెప్టెంబర్‌లో 49,101రైతులకు సంబంధించి మరో రూ.10.06 కోట్లు మంజూరయ్యాయి. ఈ మొత్తాన్ని కూడా వ్యవసాయ అధికారులు బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశారు. కానీ 7,586 బ్యాంకు ఖాతాల్లోకి రూ. 1.25 కోట్లు జమ కాలేదు. 13 వేల మందికి పైగా రైతులు డబ్బు తమకు అందలేదని గగ్గోలు పెట్టడంతో పొరపాటు జరిగిందని తేలింది. రైతులిచ్చిన బ్యాంకు ఖాతాల వివరాల్లో పొరపాట్లే ఇందుకు కారణమని అవగతమైంది. ఇవీ లోపాలు.. చాలామంది రైతులు బ్యాంకు ఖాతా నెంబర్లు సరిగా ఇవ్వలేదు. మరికొందరు ఒకటి రెండు అంకెలను వదిలేసి నెంబర్లు ఇచ్చారు తమ ఖాతాలు కాకుండా కుటుంబంలో వేరొకరి బ్యాంకు ఖాతా నెంబర్లను కొందరు ఇచ్చారు. ఎప్పుడో రద్దయిన బ్యాంకు ఖాతా నెంబర్లు కొంతమంది ఇచ్చేశారు. నీలం తుఫాన్ విషయంలోనే కాక, కరువు పరిహారం విషయంలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. అప్పట్లో సుమారు ఐదు వేల మందికి సంబంధించిన బ్యాంకు ఖాతాలు సక్రమంగా లేకపోవడంతో రూ. 85 లక్షలు మిగిలిపోయాయి. లోపాలు గుర్తించకపోవడంతో లబ్ధిదారులు అంతవరకే ఉన్నారనుకుని మిగిలిన సొమ్మును ప్రభుత్వానికి తిప్పి పంపేశారు. దిద్దుబాటు చర్యలు ఆలస్యంగా అప్రమత్తమైన వ్యవసాయ అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. తప్పుగా ఉన్న ఖాతాలను గుర్తించే పనిలో పడ్డారు. 2692 మంది రైతులకు సంబంధించిన ఖాతా నెంబర్లను మండల వ్యవసాయ అధికారులకు పంపించారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి సంబంధిత రైతుల కచ్చితమైన బ్యాంకు ఖాతా నెంబర్ తీసుకోవాలని ఆదేశించారు. వీరే కాకుండా పరిహారం అందని మిగతా రైతులు కూడా అధికారుల్ని కలవాలని కోరారు. నిధులు అందుబాటులో ఉన్నాయని, రైతులు అధికారులను కలవాలని కోరారు. -
బ్యాంక్ అకౌంట్ల గందరగోళం
=అందని నీలం నష్టపరిహారం =ఆందోళనలో రైతాంగం అనకాపల్లి, న్యూస్‌లైన్ : సాంకేతిక కారణాలతో రైతులు 14 నెలలుగా పంట నష్టపరిహారం అందుకోలేక పోతున్నారు. 2012 నవంబర్‌లో నీలం తుపానుకు అనకాపల్లి మండలం లో వెయ్యి హెక్టార్లలో వరి, చెరకు, అపరాలకు నష్టం వాటిల్లింది. సుమారు 10 వేల మంది వరకు రైతులు తుపాను కారణంగా నష్టపోయారని యంత్రాంగం అంచనా వేసిం ది. నష్టపరిహారం పంపిణీలో ఇదిగో, అదిగో అంటూ కా లం వెళ్లదీసిన అధికారులు ఇప్పుడు బ్యాంకు ఖాతాల గం దరగోళంతో తలపట్టుకున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రం నీలం నష్టపరిహారాన్ని పంపిణీ చేశామని చెబుతున్నా ఇంకా అనకాపల్లి మండలంలో 2022 మందికి అందలేదు. నష్టాన్ని అంచనా వేసిన రెవెన్యూ, వ్యవసాయశాఖలు బ్యాంకులకు అనుసంధానం చేసే విషయంలో సాంకేతిక అవరోధాలు తలెత్తాయి. నష్టపరిహారం పొందవలసిన రైతు పేర్లకు, బ్యాంక్ నుంచి జమ కావాల్సిన ఖా తాకు పొంతన లేకపోవడంతో అనకాపల్లి మండలంలో ఇంకా రూ. పాతిక లక్షల వరకు పంపిణీ కాలేదు. నీలం తు పాను నష్టానికి వెయ్యి హెక్టార్ల పరిధిలో రూ.కోటి వరకు నష్టపరిహారం విడుదలయింది. అయితే 20 బ్యాంకుల ఖా తాలు పొంతనలేక సొమ్ము బ్యాంకులలో మూలుగుతోంది. బరోడా బ్యాంకులో 5 అకౌంట్లు, మహారాష్ట్ర 92, ఐడీబీఐ 132, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 18, ఫెడరల్ బ్యాంక్ 4, ఇండియన్ బ్యాంక్ 39, కెనరా 8, ఐసీఐసీఐ 14, ఐఓసీ 254, ఎస్బీహెచ్ 18, కనకమహాలక్ష్మి 7, కరూర్ వైశ్యా బ్యాంకు 29, ఓరియంటల్ 2, ఆంధ్రా బ్యాంక్ 615, గ్రామీణ వికాస్ బ్యాంక్ 403, ఇండియన్ బ్యాంక్ 6, ఐఎన్జీ వైశ్యా 6, సిండికేట్ 1, బ్యాంక్ ఆఫ్ ఇండియా 217 వెరసి 2022 ఖాతాలకు నష్టపరిహారం అందలేదు. తక్షణమే సంబంధిత అధికారులు సత్వరమే స్పందించి సంక్రాంతికి ముందైనా పంట నష్టపరిహారం అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు. -
మళ్లీ కంటి తుడుపేనా?
=2011 కరువు సాయం ఎట్టకేలకు విడుదల =తాజాగా రూ.2.78కోట్లు =పెండింగ్‌లో మరో రూ.1.26కోట్లు =గిరిజన రైతులకు అందని నీలం పరిహారం =28 వేల మంది ఎదురుచూపు సాక్షి, విశాఖపట్నం: రైతన్నలను సర్కార్ ఊరిస్తోంది. నష్టపోయిన పంటకు పరిహారాన్ని కంటి తుడుపుగా విడుదల చేసింది. అది కూడా ఏళ్లు గడిచాక విదిల్చింది. ఈలోపు చేసిన అప్పులు, వడ్డీ లు పేరుకుపోయి నిలువునా అన్నదాతలు మునిగిపోయారు. 2011లో జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. లక్షలాది మంది రైతులు పంటలను కోల్పోయారు. ఈ క్రమంలో ఇన్‌ఫుట్ సబ్సిడీగా రూ.17.5కోట్లు విడుదల చేయాలంటూ వ్యవసాయాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అప్పట్లో సర్కార్ వెంటనే స్పందించలేదు. గతేడాది చివరిలో 96,219మంది రైతులకు రూ.13.46కోట్లు విడుదల చేసింది. తాజాగా మళ్లీ 20,364మంది రైతులకు సంబంధించి రూ.2.78 కోట్లు విడుదలయ్యాయి. ఇంకా రూ.1.26కోట్లు మేర పెండిం గ్లో ఉంచింది. ఇక గతేడాది నీలం తుఫాన్ కారణంగానూ జిల్లా రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. రూ.30.24కోట్లు మేర ఇన్‌ఫుట్ సబ్సిడీ మంజూరు చేయాలంటూ వ్యవసాయాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇందులో ఈ ఏడాది ఆరంభం, ఖరీఫ్ సీజన్‌కు ముందు రెండు విడతలుగా రూ.23కోట్లు విడుదలయ్యాయి. కానీ ఏజెన్సీలో పంట నష్టపోయిన 28వేల మంది రైతులకు సంబంధించి పైసా కూడా విదల్చలేదు. వాస్తవానికి వీరికి రూ.4.61కోట్లు చెల్లించాల్సి ఉంది. వీరందరికీ చెక్కుల రూపంలోనే పంపిణీ చేయాల్సి ఉంది. పరిహారం కోసం గిరిజనులంతా ఎదురు చూస్తున్నారు. -
అన్నదాతతోపరిహాసం!
విజయనగరం వ్యవసాయం, న్యూస్‌లైన్: రైతన్న సంక్షేమమే మా ధ్యేయం, రైతు కష్ట కాలంలో ఆదుకోవడానికి కృషి చేస్తున్నామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు... క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులకు పొంతనలేకుండా పోతుండడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. యథారాజా....తథా ప్రజా అన్నట్టు ప్రభుత్వానికి తామేమీ తీసిపోమన్న విధంగా వ్యవసాయధికారులు కూడా వ్యవహరిస్తున్నారు. రైతుకు ఎల్లవేళలా అండగా ఉండి సహాయ సహకారాలు అందించాల్సిన వారు ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. సీట్లలో కూర్చొని నష్టాన్ని అంచనా వేస్తూ నివేదికలు పంపిస్తున్నారు. దీనికి తోడు రాజకీయ ఒత్తిళ్లు కూడా నివేదికల రూపుమారుస్తున్నాయి. దీంతో నష్టపోయిన రైతుల కంటే అనర్హులే ఎక్కువగా పరిహారాన్ని పొందుతున్నారు. పంట నష్టం జరిగిన ఏడాదికి కాని పరిహారం అందని పరిస్థితి జిల్లాలో నెలకొంది. గత ఏడాది నవంబర్ నెలలో జిల్లాను అతలాకుతలం చేసిన ‘నీలం’ తుఫాన్ నష్టపరిహారం కోసం రైతులు ఇంకా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారంటే పరిస్థితిని అర్ధంచేసుకోవచ్చు. రైతన్న ఏటా అప్పులు తెచ్చి పెట్టుబడులు పెడుతున్నాడు. అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటకు నష్టం వాటిల్లడంతో ఏటా అప్పులు పెరుగుతున్నాయే తప్ప తీరడం లేదు. దీంతో అందరికి అన్నం పెట్టే రైతన్న చేయిచాచే పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఖర్చు కొండంత...పరిహారం గోరంత సాగు ఖర్చు పెరగడంతో రైతన్న అవస్థలు పడుతున్నాడు. 2004లో ఎకరం విస్తీర్ణంలో వరి సాగుకు రూ.12వేలు ఖర్చుకాగా, 2006లో రూ. 15 వేలు, 2009లో రూ. 20 వేలు, 2012లో రూ. 24 వేలు, 2013లో రూ. 26 వేలకు ఖర్చుపెరిగింది. ఏటా సాగు ఖర్చు పెరిగినప్పటికీ అందుకు తగ్గట్టుగా పరిహారం మాత్రం పెరగడం లేదు. 2004లో హెక్టారుకు రూ.2500, 2004లో రూ. 4 వేలు, 2009లో రూ. 12 వేలు, 2012లో రూ. 10 వేలు చొప్పన పరిహారం ఇస్తున్నారు. దీంతో ఆ కంటితుడుపు పరిహారం ఏమాత్రం చాలక, పెట్టుబడి లేక అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏమూలకూ చాలదు.. ప్రభుత్వం ఇస్తున్న నష్ట పరిహారం రైతులకు ఏమూలన సరిపోవడం లేదు. పత్తి పంట సాగుకు రైతులకు ఎకరాకు రూ. 30 వేలు వరకు ఖర్చువుతుంది. సాగు చేసిన మూడు నెలల తర్వాత దిగుబడులు ప్రారంభమవుతాయి. పంట నష్టపోతే హెక్టారుకు కేవలం రూ.10 వేలు మాత్రమే పరిహారంగా చెల్లిస్తున్నారు. ఏమూలన సరిపోవడం లేదు. అలాగే వరి, చెరకు, అరటి రైతులకు కూడా తగిన పరిహారం అందడంలేదు. 50 శాతం నష్టం వాటిల్లితేనే.... నష్టం అంచనా వేయడంలో ప్రభుత్వం మెలిక పెట్టడంతో కొంత మంది రైతులకు మాత్రమే పరిహారం అందుతోంది. 50 శాతం నష్టం వాటిల్లితేనే పరిహారం చెల్లిస్తున్నారు. 50 శాతం కంటే తక్కువ నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడం లేదు. దీని వల్ల అధికశాతం రైతులకు పరిహారం ముట్టడంలేదు. దీనికి తోడు పంటనష్టం అంచనాలలో పారద్శకత లోపిస్తోంది. రాజకీయ పైరవీలకు తలొగ్గుతున్న అధికారులు...పలుకుబడి ఉన్న వారి పంట నష్టాన్ని పెంచి, సాధారణ రైతులకు తక్కువగా నమోదు చేస్తున్నారు. నష్టం నమోదుకు వెళ్లినప్పుడు అధికారులు రైతులకు సమాచారం తెలియజేయడం లేదు. కొంతమంది అధికారులు తూతూమంత్రంగా లెక్కకడుతుండడంతో అర్హులైన, నిజమైన బాధిత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చాలా సందర్భాలలో అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లకుండా కొంతమంది అధికారులు రాజకీయ నాయకులు ఇచ్చిన జాబితాను నివేదికలో చేర్చుతున్నారన్న ఆరోపణలు అధికంగా ఉన్నాయి. అమలుకాని భూపేంద్రసింగ్ హుడా కమిటీ సిఫార్సులు మూడేళ్ల క్రితం భూపేంద్ర సింగ్ హుడా కమిటీ హెక్టారుకు రూ. 25 వేలు పరిహారాన్ని రైతులకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయితే ఇది ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. రెండు రోజుల క్రితం జిల్లా రైతులకు భరోసా ఇచ్చేందుకు జిల్లాకు వచ్చిన వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా ఈ సిఫారసు అమలుచేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే రైతులకు కొంతన్యాయం జరుగుతుందని చెప్పారు. నష్టం జరిగిన ఏడాదికి ... పంట నష్టం జరిగిన ఏడాదికి గాని పరిహారం అందని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో నష్టం వాటిల్లితే వచ్చే ఏడాది ఖరీఫ్ ముగిసిన తరువాత కూడా పరిహారం అందడం లేదు. నష్టం జరగిన వెంటనే పరిహారం అందిస్తే బాగుంటుందని రైతులు కోరుతున్నారు. -
పెద్దలా.. గద్దలా
పాలకొల్లు, న్యూస్‌లైన్ : పంటల బీమా పంపిణీలో వసూళ్ల పర్వానికి తెరలేచింది. పెద్దల ముసుగులో కొందరు వ్యక్తులు సహకార సంఘాల వద్ద తిష్టవేసి మరీ రైతుల నుంచి సొమ్ములు గుంజు తున్నారు. ‘బీమా పరిహారం కోసం అధికారులకు ముందే ముడుపులు ముట్టజెప్పాం. ఆ మొత్తాన్ని చెల్లిస్తేగానీ బీమా పరిహారం ఇచ్చేది లేదంటూ బీమా పరిహారం మొత్తంలో 10 శాతం సొమ్మును వసూలు చేస్తున్నారు. 2012 ఆగస్టులో సంభవించిన నీలం తుపాను కారణంగా జిల్లాలో సార్వా పంట దెబ్బతిని అనేక మంది రైతులు నష్టపోయూరు. వారికి పంటల బీమా పథకం కింద రూ.209 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఇటీవల విడుదల చేయడంతో వారం రోజులుగా రైతులకు పంపిణీ చేస్తున్నారు. సుమారు రూ.103 కోట్లను సహకార సంఘాల ద్వారా, రూ.44 కోట్లను ఆంధ్రాబ్యాంకు, మిగిలిన మొత్తాన్ని వివిధ జాతీయ బ్యాంకుల ద్వారా దసరా కానుకగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు ప్రకటించారు. రికార్డుల తయారీకి ముడుపులు ఇచ్చారట! డెల్టాలోని రైతులకు బీమా సొమ్ము సహకార సంఘా ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు పంటల బీమా పెద్ద మొత్తంలో ఇప్పించడానికి అప్పట్లో భారీ నష్టం జరిగినట్టు రికార్డులు రూపొందించేలా వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖలకు గ్రామాల వారీగా ముడుపులు ముట్టజెప్పామని చెబుతున్నారు. బీమా సొమ్ము రైతుల చేతికి వస్తున్నందున వారినుంచి ఆ మొత్తాన్ని వసూలు చేస్తున్నట్టు చెబుతున్నారు. గతంలో పంటల బీమా పథకం మండలం యూని ట్‌గా ఉంటే మండలంలోని అన్ని గ్రామాల్లోని కొలగార సంఘాలు, సహకార సంఘాలు, పెద్ద రైతులు చర్చించుకుని అధికారులకు కొంతమొత్తం ముడుపులు ముట్టచెప్పేవారని, పంటల బీమా గ్రామం యూనిట్‌గా మారినందున గ్రామ పెద్దలే కొంత సొమ్ము అధికారులకు అందించారని చెబుతున్నారు. ఆ మొత్తాన్ని ఇప్పుడు రైతుల నుంచి వసూలు చేస్తున్నట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. పంట నష్టం నమోదు సమయంలో అధికారులకు పెద్దమొత్తంలో ముడుపులు ముట్టచెప్పిన గ్రామాలకే బీమా పరిహారం పెద్దమొత్తంలో మంజూరైనట్టు చెబుతున్నారు. 8 నుంచి 10 శాతం వసూలు పాలకొల్లు నియోజకవర్గంలోని పాలకొల్లు, పోడూరు, యలమంచిలి మండలాల్లో సుమారు 14 వేల మంది రైతులకు దాదాపు రూ.8 కోట్ల బీమా పరిహారం మంజూరైంది. డెల్టా ప్రాంతంలో ప్రస్తుతం రైతుల నుంచి వసూలు చేస్తున్న మొత్తం అప్పట్లో అధికారులకు ఇచ్చిన మొత్తాన్ని బట్టి... మంజూరైన సొమ్ములో 8 నుంచి 10 శాతం వరకు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఒక గ్రామంలో బీమా మంజూరు కోసం అధికారులకు ముడుపులు ముట్టచెప్పడానికి ఒక దేవాలయం సొమ్ము వినియోగించారని, ఆ మొత్తాన్ని ప్రస్తుతం వడ్డీతో సహా చెల్లిస్తున్నట్టు చెబుతున్నారు. నీలం తుపాను కారణంగా పక్కపక్క గ్రామాల్లో వరి పంట ఒకేవిధంగా నష్టపోయినా అధికారులకు ముడుపులు ముట్టచెప్పిన సొమ్మును బట్టి పరిహారం మంజూరైందని, దీనివల్ల తమకు అన్యాయం జరిగిందని పరిహారం మొత్తం తగ్గిన రైతులు వాపోతున్నారు.