పెద్దలా.. గద్దలా | Crop insurance money sending to blue storm victims | Sakshi
Sakshi News home page

పెద్దలా.. గద్దలా

Published Fri, Oct 25 2013 3:16 AM | Last Updated on Fri, Sep 1 2017 11:56 PM

Crop insurance money sending to blue storm victims

పాలకొల్లు, న్యూస్‌లైన్ : పంటల బీమా పంపిణీలో వసూళ్ల పర్వానికి తెరలేచింది. పెద్దల ముసుగులో కొందరు వ్యక్తులు సహకార సంఘాల వద్ద తిష్టవేసి మరీ రైతుల నుంచి సొమ్ములు గుంజు తున్నారు. ‘బీమా పరిహారం కోసం అధికారులకు ముందే ముడుపులు ముట్టజెప్పాం. ఆ మొత్తాన్ని చెల్లిస్తేగానీ బీమా పరిహారం ఇచ్చేది లేదంటూ బీమా పరిహారం మొత్తంలో 10 శాతం సొమ్మును వసూలు చేస్తున్నారు. 2012 ఆగస్టులో సంభవించిన నీలం తుపాను కారణంగా జిల్లాలో సార్వా పంట దెబ్బతిని అనేక మంది రైతులు నష్టపోయూరు.

వారికి పంటల బీమా పథకం కింద రూ.209 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఇటీవల విడుదల చేయడంతో వారం రోజులుగా రైతులకు పంపిణీ చేస్తున్నారు. సుమారు రూ.103 కోట్లను సహకార సంఘాల ద్వారా, రూ.44 కోట్లను  ఆంధ్రాబ్యాంకు, మిగిలిన మొత్తాన్ని వివిధ జాతీయ బ్యాంకుల ద్వారా దసరా కానుకగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు ప్రకటించారు.
 
 రికార్డుల తయారీకి ముడుపులు ఇచ్చారట!
 డెల్టాలోని రైతులకు బీమా సొమ్ము సహకార సంఘా ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు పంటల బీమా పెద్ద మొత్తంలో ఇప్పించడానికి అప్పట్లో భారీ నష్టం జరిగినట్టు రికార్డులు రూపొందించేలా వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖలకు గ్రామాల వారీగా ముడుపులు ముట్టజెప్పామని చెబుతున్నారు. బీమా సొమ్ము రైతుల చేతికి వస్తున్నందున వారినుంచి ఆ మొత్తాన్ని వసూలు చేస్తున్నట్టు చెబుతున్నారు.

గతంలో పంటల బీమా పథకం మండలం యూని ట్‌గా ఉంటే మండలంలోని అన్ని గ్రామాల్లోని కొలగార సంఘాలు, సహకార సంఘాలు, పెద్ద రైతులు చర్చించుకుని అధికారులకు కొంతమొత్తం ముడుపులు ముట్టచెప్పేవారని, పంటల బీమా గ్రామం యూనిట్‌గా మారినందున గ్రామ పెద్దలే కొంత సొమ్ము అధికారులకు అందించారని చెబుతున్నారు. ఆ మొత్తాన్ని ఇప్పుడు రైతుల నుంచి వసూలు చేస్తున్నట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. పంట నష్టం నమోదు సమయంలో అధికారులకు పెద్దమొత్తంలో ముడుపులు ముట్టచెప్పిన గ్రామాలకే బీమా పరిహారం పెద్దమొత్తంలో మంజూరైనట్టు చెబుతున్నారు.
 
 8 నుంచి 10 శాతం వసూలు
 పాలకొల్లు నియోజకవర్గంలోని పాలకొల్లు, పోడూరు, యలమంచిలి మండలాల్లో సుమారు 14 వేల మంది  రైతులకు దాదాపు రూ.8 కోట్ల బీమా పరిహారం మంజూరైంది. డెల్టా ప్రాంతంలో ప్రస్తుతం రైతుల నుంచి వసూలు చేస్తున్న మొత్తం అప్పట్లో అధికారులకు ఇచ్చిన మొత్తాన్ని బట్టి... మంజూరైన సొమ్ములో 8 నుంచి 10 శాతం వరకు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఒక గ్రామంలో బీమా మంజూరు కోసం అధికారులకు ముడుపులు ముట్టచెప్పడానికి ఒక దేవాలయం సొమ్ము వినియోగించారని, ఆ మొత్తాన్ని ప్రస్తుతం వడ్డీతో సహా చెల్లిస్తున్నట్టు చెబుతున్నారు.

నీలం తుపాను కారణంగా పక్కపక్క గ్రామాల్లో వరి పంట ఒకేవిధంగా నష్టపోయినా అధికారులకు ముడుపులు ముట్టచెప్పిన సొమ్మును బట్టి పరిహారం మంజూరైందని, దీనివల్ల తమకు అన్యాయం జరిగిందని పరిహారం మొత్తం తగ్గిన రైతులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement