అమలాపురం : ప్రకృతికి తొలి అలుసు.. మట్టిని నమ్ముకునే రైతే. ప్రభుత్వాల అలసత్వానికి తొలి బాధితుడు కూడా రైతే. ప్రకృతి కబళించిన పంటకు కంటితుడుపుగా ఇచ్చే పరిహారం రైతు కన్నీరింకిన ఎన్నాళ్లకు, ఎన్నేళ్లకు ఇస్తారో తెలియని దుస్థితే అందుకు నిదర్శనం. నీలం తుపాను వచ్చి రెండేళ్లు దాటినా ఇప్పటికీ రైతులకు పూర్తిస్థాయిలో పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్ సబ్సిడీ) అందకపోవడమే అందుకు ప్రబల సాక్ష్యం.
నీలం తుపాను వచ్చి ఈ నవంబరు మూడుకు రెండేళ్లు పూర్తయింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం రూపంలో పెట్టుబడి రాయితీని అందిస్తుంది. 2012 అక్టోబరు చివరిలో కురిసిన ఈశాన్య రుతుపవనాలకు తోడు నీలం తుపాను రావడంతో రైతులు భారీగా పంటనష్టపోయారు. జిల్లాలో 3.50 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బ తిందని అంచనా. 2.76 లక్షల మంది రైతులను బాధితులుగా గుర్తించిన ప్రభుత్వం పెట్టుబడి రాయితీ రూపంలో రూ.145.57 కోట్లు మంజూరు చేసింది. గత ఏడాది అక్టోబరు, నవంబరు నెలల్లో వీటిని రైతుల ఖాతాకు జమ చేయాల్సి ఉంది. అయితే 2.50 లక్షల మంది రైతులకు రూ.138 కోట్లను మాత్రమే జమ చేశారు.
నిధులను ప్రభుత్వం విడతల వారీగా మంజూరు చేసింది. చివరిగా రాష్ట్ర విభజన ముందు అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న రూ.ఏడు కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను ట్రెజరీ ద్వారా ఆయా జిల్లాలకు, అక్కడ నుంచి రైతుల ఖాతాకు జమ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి లేదని ట్రెజరీ నిధుల విడుదలకు అంగీకరించలేదు. ఇంతలో రాష్ట్ర విభజనతో నిధులు వెనక్కు మళ్లిపోయాయి.
దీనితో రైతులకు పెట్టుబడి రాయితీ అందకుండా పోయింది. అలాగే గతంలో పంపిణీ చేసిన రూ.138 కోట్లలో ఆన్‌లైన్ బ్యాంకు ఖాతాలు ఇవ్వని రైతులకు, సాంకేతిక ఇబ్బందుల కారణంగా మరో రూ.3. 57 కోట్లు మరికొందరు రైతులకు అందలేదు. మొత్తం మీద సుమారు 26 వేల మంది రైతులకు రూ.10.57 కోట్లు అందకుండా పోయాయి. త్వరలోనే అందజేస్తామని అధికారులు చెబుతున్నారు.
పూర్తిస్థాయిలో నీలం పరిహారం అందించకపోవడంపై ఏడాదిగా రైతులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా పర్యటనకు వచ్చిన వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, వ్యవసాయ శాఖ కమిషనర్ మధుసూదనరావుల వద్ద రైతులు పరిహారంపై గోడు వెళ్లబోసుకున్నా స్పందన లేదు.
‘హెలెన్’ పరిహారం ఊసే లేదు..
నీలం పరిహారాన్ని ఇప్పటికీ పూర్తిస్థాయిలో అందించని ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో సంభవించిన హెలెన్ తుపాను పరిహారంపై ఇప్పటి వరకు నోరు మెదపలేదు. గత ఏడాది నవంబరులో వచ్చిన భారీ వర్షాలకు సుమారు 1.46 లక్షల ఎకరాల్లో, హెలెన్ వల్ల 1.76 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. మొత్తమ్మీద 3.22 లక్షల ఎకరాల్లో పంటనష్టపోయిన 1.30 లక్షల మంది రైతులకు రూ.130 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీగా ప్రభుత్వం అందించాల్సి ఉంది. అయితే వ్యవసాయ శాఖ అధికారులు పంపిన నివేదికలపై ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడంపై హెలెన్ పరిహారం వస్తుందనే నమ్మకం రైతుల్లో కొరవడింది.
నష్టపోయిన రైతుకు హెక్టారుకు రూ.25 వేలు పరిహారం అందించాలని, పెట్టుబడి రాయితీని తక్షణం అందజేయాలని గతంలో ఆమరణ నిరాహారదీక్ష చేసిన చంద్రబాబు నాయుడే ఎన్నికల్లో విజయం సాధించి ఇప్పుడుముఖ్యమంత్రి అయ్యారు. రుణమాఫీ విషయంలో మాట తప్పినట్టే.. హెక్టారుకు రూ.25 వేల పరిహారం విషయంలోనూ రైతులకు మొండిచేయి చూపారు. ఇందుకు ఉదాహరణ ఇటీవల హుద్‌హుద్ తుపానుకు ఉత్తరాంధ్రలో పంట కోల్పోయిన రైతుకు పెట్టుబడి రాయితీని హెక్టారుకు కేవలం రూ.15 వేలే ప్రకటించారు. ప్రకృతి చేసిన గాయంపై పాలకుల నిర్లక్ష్యం కారంలా బాధిస్తోందని రైతులు వాపోతున్నారు.
రెండేళ్లైనా.. అందని పండే
Published Sat, Nov 15 2014 12:49 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM
Advertisement
Advertisement