విజయనగరం వ్యవసాయం, న్యూస్‌లైన్: రైతన్న సంక్షేమమే మా ధ్యేయం, రైతు కష్ట కాలంలో ఆదుకోవడానికి కృషి చేస్తున్నామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు... క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులకు పొంతనలేకుండా పోతుండడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. యథారాజా....తథా ప్రజా అన్నట్టు ప్రభుత్వానికి తామేమీ తీసిపోమన్న విధంగా వ్యవసాయధికారులు కూడా వ్యవహరిస్తున్నారు. రైతుకు ఎల్లవేళలా అండగా ఉండి సహాయ సహకారాలు అందించాల్సిన వారు ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. సీట్లలో కూర్చొని నష్టాన్ని అంచనా వేస్తూ నివేదికలు పంపిస్తున్నారు.
దీనికి తోడు రాజకీయ ఒత్తిళ్లు కూడా నివేదికల రూపుమారుస్తున్నాయి. దీంతో నష్టపోయిన రైతుల కంటే అనర్హులే ఎక్కువగా పరిహారాన్ని పొందుతున్నారు. పంట నష్టం జరిగిన ఏడాదికి కాని పరిహారం అందని పరిస్థితి జిల్లాలో నెలకొంది. గత ఏడాది నవంబర్ నెలలో జిల్లాను అతలాకుతలం చేసిన ‘నీలం’ తుఫాన్ నష్టపరిహారం కోసం రైతులు ఇంకా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారంటే పరిస్థితిని అర్ధంచేసుకోవచ్చు. రైతన్న ఏటా అప్పులు తెచ్చి పెట్టుబడులు పెడుతున్నాడు. అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటకు నష్టం వాటిల్లడంతో ఏటా అప్పులు పెరుగుతున్నాయే తప్ప తీరడం లేదు. దీంతో అందరికి అన్నం పెట్టే రైతన్న చేయిచాచే పరిస్థితులు దాపురిస్తున్నాయి.
ఖర్చు కొండంత...పరిహారం గోరంత
సాగు ఖర్చు పెరగడంతో రైతన్న అవస్థలు పడుతున్నాడు. 2004లో ఎకరం విస్తీర్ణంలో వరి సాగుకు రూ.12వేలు ఖర్చుకాగా, 2006లో రూ. 15 వేలు, 2009లో రూ. 20 వేలు, 2012లో రూ. 24 వేలు, 2013లో రూ. 26 వేలకు ఖర్చుపెరిగింది. ఏటా సాగు ఖర్చు పెరిగినప్పటికీ అందుకు తగ్గట్టుగా పరిహారం మాత్రం పెరగడం లేదు. 2004లో హెక్టారుకు రూ.2500, 2004లో రూ. 4 వేలు, 2009లో రూ. 12 వేలు, 2012లో రూ. 10 వేలు చొప్పన పరిహారం ఇస్తున్నారు. దీంతో ఆ కంటితుడుపు పరిహారం ఏమాత్రం చాలక, పెట్టుబడి లేక అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ఏమూలకూ చాలదు..
ప్రభుత్వం ఇస్తున్న నష్ట పరిహారం రైతులకు ఏమూలన సరిపోవడం లేదు. పత్తి పంట సాగుకు రైతులకు ఎకరాకు రూ. 30 వేలు వరకు ఖర్చువుతుంది. సాగు చేసిన మూడు నెలల తర్వాత దిగుబడులు ప్రారంభమవుతాయి. పంట నష్టపోతే హెక్టారుకు కేవలం రూ.10 వేలు మాత్రమే పరిహారంగా చెల్లిస్తున్నారు. ఏమూలన సరిపోవడం లేదు. అలాగే వరి, చెరకు, అరటి రైతులకు కూడా తగిన పరిహారం అందడంలేదు.
50 శాతం నష్టం వాటిల్లితేనే....
నష్టం అంచనా వేయడంలో ప్రభుత్వం మెలిక పెట్టడంతో కొంత మంది రైతులకు మాత్రమే పరిహారం అందుతోంది. 50 శాతం నష్టం వాటిల్లితేనే పరిహారం చెల్లిస్తున్నారు. 50 శాతం కంటే తక్కువ నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడం లేదు. దీని వల్ల అధికశాతం రైతులకు పరిహారం ముట్టడంలేదు. దీనికి తోడు పంటనష్టం అంచనాలలో పారద్శకత లోపిస్తోంది. రాజకీయ పైరవీలకు తలొగ్గుతున్న అధికారులు...పలుకుబడి ఉన్న వారి పంట నష్టాన్ని పెంచి, సాధారణ రైతులకు తక్కువగా నమోదు చేస్తున్నారు. నష్టం నమోదుకు వెళ్లినప్పుడు అధికారులు రైతులకు సమాచారం తెలియజేయడం లేదు. కొంతమంది అధికారులు తూతూమంత్రంగా లెక్కకడుతుండడంతో అర్హులైన, నిజమైన బాధిత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చాలా సందర్భాలలో అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లకుండా కొంతమంది అధికారులు రాజకీయ నాయకులు ఇచ్చిన జాబితాను నివేదికలో చేర్చుతున్నారన్న ఆరోపణలు అధికంగా ఉన్నాయి.
అమలుకాని భూపేంద్రసింగ్ హుడా కమిటీ సిఫార్సులు
మూడేళ్ల క్రితం భూపేంద్ర సింగ్ హుడా కమిటీ హెక్టారుకు రూ. 25 వేలు పరిహారాన్ని రైతులకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయితే ఇది ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. రెండు రోజుల క్రితం జిల్లా రైతులకు భరోసా ఇచ్చేందుకు జిల్లాకు వచ్చిన వైఎస్‌ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా ఈ సిఫారసు అమలుచేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే రైతులకు కొంతన్యాయం జరుగుతుందని చెప్పారు.
నష్టం జరిగిన ఏడాదికి ...
పంట నష్టం జరిగిన ఏడాదికి గాని పరిహారం అందని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో నష్టం వాటిల్లితే వచ్చే ఏడాది ఖరీఫ్ ముగిసిన తరువాత కూడా పరిహారం అందడం లేదు. నష్టం జరగిన వెంటనే పరిహారం అందిస్తే బాగుంటుందని రైతులు కోరుతున్నారు.