- 4023 మందికి రూ.2.34 కోట్లు విడుదల
- మరో 10,190 మందికి మొండిచేయి
- ఆహార పంటలకే ఇన్‌పుట్ సబ్సిడీ
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ప్రభుత్వ నిర్ణయాలు రైతులను నిలువునా ముం చుతున్నాయి. అతివృష్టి, అనావృష్టిల కు పంటలు కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అన్నదాతలను మరిం త క్షోభకు గురిచేస్తున్నాయి. పెట్టుబడులు కూడా రాక అప్పుల్లో కూరుకుపోయిన రైతులను ఆదుకోవాల్సిన సర్కారు.. ఇన్‌పుట్ సబ్సిడీ అందించే విషయంలో సవాలక్ష నిబంధనలతో ఇబ్బందులకు గురిచేస్తోంది. తాజాగా రెండేళ్ల క్రితం నీలం తుపాను నష్టానికి ఇన్‌పుట్ సబ్సిడీని ఇప్పుడు విడుదల చేసింది.
ఇందులో కూడా కేవలం బ్యాంకు ఖాతాలు ఉన్నవారికే ఇస్తూ.. మిగిలిన 10 వేల మందికి రిక్తహస్తాన్ని చూపిం చింది. 2011 నవంబర్‌లో నీలం తుపాను కారణంగా జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. ఆహారపంటలు నీట మునిగి సుమారు రూ.90 కోట్లు నష్టం వాటిల్లింది. అయితే ప్రభు త్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కేవలం 1848.78 హెక్టార్లలో మాత్రమే నష్టం జరిగినట్లు నిర్ధారించి 13,235 మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.4.13 కోట్లు కు ప్రతిపాదించారు. గతేడాది తొలి విడతగా 671.58 హెక్టార్లలో జరిగిన నష్టానికి 6167 మంది రైతులకు రూ.67.16 లక్షలు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది.
మిగిలిన రైతులను విస్మరించిన సర్కారు తాజాగా రెండో విడతలో రూ.2.34 కోట్లు మాత్రమే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 535.92 హెక్టార్లలో జరిగిన నష్టానికి బ్యాంకు ఖాతాలు ఉన్న 4023 మంది రైతులకు మాత్రమే ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేసింది. ఇంకా 10,190 మంది రైతులకు పరి హారం అందించాల్సి ఉంది. ఏజెన్సీలో బ్యాంకు సేవలు అందుబాటులో లేకపోవడంతో వారం తా ఖాతాలు తీసుకొనే వెసులుబాటులేదు.
ఈ విషయాన్ని ఇప్పటికే అధికారులు అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించారు. ఇటీవల వ్యవసాయ పంటలకు సంబంధించి ఏజెన్సీ రైతులకు చెక్కుల ద్వారా పంపిణీకి అంగీకరించిన ప్రభుత్వం, ఆహారపంటల రైతుల విషయంలో మాత్రం మళ్లీ పాత పద్ధతిలోనే కొనసాగడం సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనం.