government decisions
-
పేదల బతుకులతో చెలగాటం
– ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యానికి ప్రభుత్వం కుట్ర – నిత్యావసర వస్తువులు ఒక్కొక్కటిగా తొలగింపు – ఆహార భద్రత చట్టానికి తూట్లు పొడుస్తున్న వైనం – త్వరలో బియ్యం పంపిణీకీ మంగళం – ఉపాధి కోల్పోనున్న 2,962 మంది డీలర్లు ఆహార భద్రత చట్టానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా చర్యలు చేపడుతూ బాధ్యతల నుంచి తప్పుకోజూస్తోంది. తెల్లకార్డుదారులకు ఇస్తున్న నిత్యావసర వస్తువులను ఒక్కొక్కటిగా తొలగిస్తూ పేదల బతుకులతో చెలగాటం ఆడుతోంది. జూన్ నుంచి చక్కెర, కిరోసిన్ పంపిణీ నిలిపివేసేందుకు సిద్ధపడినట్లు తెలిసింది. త్వరలో బియ్యం పంపిణీకీ మంగళం పాడనున్నట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం. - అనంతపురం అర్బన్ పేదలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ఆసరాగా ఉంటోంది. అయితే దీనిపై వేటు వేసేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. పేదలు ఆహారం కోసం ఇబ్బంది పడకూదని 2013, సెప్టెంబరు 12న అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చింది. దీన్ని పకడ్బందీగా అమలు చేసి పేదలకు అండగా నిలవాల్సిన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు భిన్నంగా ముందుకు పోతోంది. చౌక దుకాణాల ద్వారా ప్రస్తుతం బియ్యంతో పాటు చక్కెర, కిరోసిన్‌ని కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 11.92 లక్షలు తెల్లకార్డుదారులకు అరకేజీ చక్కెర పంపిణీ చేస్తున్నారు. గ్యాస్ లేని వారికి రెండు లీటర్లు, గ్యాస్ కనెక్షన్ ఉంటే ఒక లీటరు పంపిణీ చేస్తున్నారు. జూన్ నుంచి చక్కెర, కిరోసిన్ పంపిణీ బంద్ చేస్తున్నట్లు జిల్లా యంత్రానికి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. దీంతో జూన్‌కు సంబంధించి బియ్యం కోటాకు మాత్రమే డీడీలు తీయాలని డీలర్లకు మౌఖికంగా అధికారులు ఆదేశాలిస్తున్నారు. తాజాగా బియ్యం పంపిణీ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకునేందుకు సిద్ధపడుతోంది. బియ్యం బదులుగా నగదుని కార్డుదారుల ఖాతాలో జమ చేÄయాలనేది ప్రభుత్వం ఆలోచన. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 11.92 లక్షల కార్డులకు 1.81 లక్షల క్వింటాళ్ల బియ్యం అందజేస్తున్నారు. బియ్యం పంపిణీ నిలిపివేసి.. కార్డుదారులకు కిలోకు రూ.25 చొప్పున డబ్బుల్ని బ్యాంక్ ఖాతాలో జమ చేయాలనే దిశగా ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు అధికారవర్గాల సమాచారం. ఉపాధి కోల్పోనున్న డీలర్లు జిల్లావ్యాప్తంగా 2,962 చౌక ధరల దుకాణాలు (స్టోర్లు) ఉన్నాయి. బియ్యం పంపిణీ నిలిపివేస్తే డీలర్లు పూర్తిగా ఉపాధి కోల్పోతారు. వీరు ఇప్పటి వరకు కమీషన్ తీసుకుని దుకాణాలు నడుపుతున్నారు. ఇప్పటికే కొన్ని సరుకులు పంపిణీ నుంచి తొలగించారు. జూన్ నుంచి చక్కెర, కిరోసిన్ బంద్ చేయనున్నారు. దీంతో వీటిపై వచ్చే కమీషన్ని డీలర్లు కోల్పోనున్నారు. బియ్యం కూడా బంద్ చేస్తే ఇక డీలర్లకు కమీషన్ పూర్తిగా పోతుంది. ఒక రకంగా చౌక దుకాణం మూతపడుతుంది. దీంతో డీలర్లందరూ వీధి పడాల్సి దుస్థితి నెలకొంటుంది. బియ్యం కొనుగోలు పేదలకు భారమే పేదలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం రకం బహిరంగ మార్కెట్లో లభ్యం కావు. కేవలం సన్న బియ్యం లభిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో బియ్యం రూ.35 వరకు ఉంది. మునుముందు కిలో రూ.40 నుంచి రూ.45 వరకు పెరుగుతాయి. ప్రభుత్వం కిలోకు రూ.25 చొప్పున డబ్బులు ఇస్తే కిలో మీద రూ.10 నుంచి రూ.15 అదనంగా వెచ్చించి లబ్ధిదారుడు బియ్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. జిల్లాలో 11.92 లక్షల కార్డులు ఉండగా యూనిట్లు (సభ్యులు) 35.64 లక్షల మంది ఉన్నాయి. సభ్యునికి నాలుగు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తారు. ఈ లెక్కన కిలో మీద నెలసరి రూ.10 అదనం వేసుకున్నా నాలుగు కిలోల మీద రూ.40 అదనంగా వెచ్చించాల్సి వస్తుంది. ఈ ప్రకారం కార్డుదారులపై నెలసరి 14.25 కోట్లు భారం పడుతుందనేది స్పష్టమవుతోంది. -
ఇక కిక్కే కిక్
షాపింగ్ మాల్స్ బార్లా మందుబాబులకు మద్యం మరింత చేరువకానుంది. శ్లాబ్ ధరల్లో స్వల్ప మార్పులు చేయడమే కాకుండా.. ఇకపై మద్యం అన్ని ప్రాంతాల్లో.. అన్నిచోట్లా అందుబాటులో ఉండేలా సోమవారం ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటించింది. ముఖ్యంగా షాపింగ్‌మాల్స్‌లో మద్యం విక్రయాలకు అనుమతినిచ్చింది. ధరల్లో చిన్నపాటి మార్పులు, కొత్త శ్లాబ్‌లు చేర్చి నూతన మద్యం పాలసీని సిద్ధం చేసింది. ఈ క్రమంలో జిల్లాలో మంగళవారం వైన్ షాపుల కేటాయింపునకు గజిట్ విడుదల కానుంది. - శ్లాబ్ ధరల్లో స్వల్ప మార్పులు - లెసైన్స్ ఫీజుల పెంపు - ఆదాయం కోసం ప్రభుత్వ నిర్ణయాలు - నేడు వైన్‌షాపుల గజిట్ నోటిఫికేషన్ విడుదల సాక్షి, విజయవాడ : జిల్లాలో 335 వైన్‌షాపులు ఉన్నాయి. వీటిలో ఇకపై 35 షాపులు ప్రభుత్వమే నిర్వహిస్తుంది. మిగిలిన 300 షాపులకు గజిట్ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి.. లాటరీ ప్రక్రియ ద్వారా లెసైన్సులు జారీ చేయనున్నారు. దీనివల్ల ఏడాదికి సగటున రూ.20కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఈ ఏడాది పాలసీలో మార్పులు చేయడం వల్ల ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. విజయవాడ డివిజన్లో ఉన్న 162 వైన్‌షాపుల్లో 16, మచిలీపట్నంలోని 173 వైన్‌షాపుల్లో 19 ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఎక్సైజ్‌శాఖ అధికారులు సోమవారమంతా హైదరాబాద్‌లోనే ఉండి సుదీర్ఘ కసరత్తు చేశారు. మంగళవారం జిల్లాలో గజిట్‌ను విడుదల చేయనున్నారు. మంగళవారం నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించి 29న మచిలీపట్నంలోని కలెక్టరేట్లో లాటరీ ప్రక్రియ ద్వారా షాపులు కేటాయించనున్నారు. మారిన శ్లాబ్‌లు ఈసారి ప్రభుత్వం ఏడు రకాల శ్లాబ్‌లు ప్రకటించింది. ఐదు లక్షలపైన జనాభా ఉండే ప్రాంతంలో గతంలో రూ.64 లక్షల లెసైన్స్ ఫీజు ఉండేది. దీనిని రూ.65 లక్షలకు మార్చారు. ఇది విజయవాడ నగరానికే వర్తిస్తుంది. ఐదువేల జనాభాలోపు ఉన్న ప్రాంతంలో రూ.30లక్షలు, 5 నుంచి 10వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.34 లక్షలు, 10 నుంచి 25వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.37లక్షలు, 25వేల నుంచి 50వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.40లక్షలు, 50వేల నుంచి మూడు లక్షల జనాభా ఉన్న ప్రాంతంలో రూ.50 లక్షల శ్లాబ్‌లు నిర్ణయించారు. అయితే, జిల్లాలో రూ.65లక్షల శ్లాబ్, మున్సిపాలిటీల్లో రూ.45 లక్షల శ్లాబ్ ఎక్కువగా వర్తిస్తుంది. గతంలో దరఖాస్తు ధర కామన్‌గా రూ.30వేలు ఉండేది. ఈ ధరను గ్రామీణ ప్రాంతాలకే పరిమితం చేసి.. పట్టణ ప్రాంతాలకు రూ.40వేలు, నగరాలకు రూ.50వేలుగా నిర్ణయించారు. ఇదంతా తిరిగి చెల్లించని రుసుము కావటంతో వీటిద్వారా సుమారు రూ.10 కోట్లపైనే ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. గత ఏడాది జిల్లాలో లెసైన్స్ ఫీజుల ద్వారా ఏడాదికి రూ.116 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది అది మరింత పెరుగుతుందని అధికారుల అంచనా. సగటున రూ.125 కోట్ల నుంచి రూ.130 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది 335 వైన్‌షాపులకు గానూ 307 షాపులు మాత్రమే లాటరీ ద్వారా వ్యాపారులు దక్కించుకున్నారు. మిగిలిన షాపులు రెండేళ్లుగా ఖాళీగానే ఉన్నాయి. ఈ ఏడాది ప్రభుత్వమే 35 షాపులు నిర్వహించనున్న క్రమంలో ఖాళీగా మిగిలే షాపుల్లో ఎక్కువ ప్రభుత్వమే నిర్వహించే అవకాశం ఉంది. -
పండగ పూటా పస్తులే!
తిరుపతి రూరల్: ప్రభుత్వ నిర్ణయాలు పండుటాకులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పింఛన్ పెరిగిందని ఆనందించిన అసహాయులకు అదీ అందని ద్రాక్షలా మారుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూన్న జన్మభూమి-మాఊరు కార్యక్రమానికి జనం ఉండరని జిల్లాలో పింఛన్ల పంపిణీని శనివారం అర్ధంతరంగా నిలిపివేశారు. దీంతో జిల్లావ్యాప్తంగా వేలాదిమంది వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, చేనేత, గీత కార్మికులు, అభయహస్తం పింఛన్‌దారులు పండుగ పూట పస్తులుండాల్సిన పరిస్థితి. వీరందరికీ జన్మభూమి ప్రారంభం తర్వాతే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఇస్తూ.. ఇస్తూ.. జిల్లాలో సెప్టెంబర్ వరకు దాదాపు నాలుగు లక్షలకు పైగా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. అనర్హుల ఏరివేత పేరుతో టీడీపీ నేతల కనుసన్నల్లో చే పట్టిన సర్వేలో పింఛన్ల జాబితా నుంచి 84,617 మందిని ఇప్పటికే తొలగించారు. వీరికి అక్టోబర్ నుంచి పింఛన్లు నిలిపివేశారు. మిగిలిన వారికి ఐదు రెట్లు పింఛన్ పెంచాం అంటూ జన్మభూమి కార్యక్రమంలో అందించారు. కొన్ని పంచాయతీల్లో జన్మభూమి ఆలస్యం కావడంతో పింఛన్ కోసం లబ్ధిదారులు ఆధికార పార్టీ నేతలను నిలదీయడం మొదలుపెట్టారు. దీంతో జన్మభూమితో పనిలేకుండా మూడు రోజులుగా పింఛన్లు అందిస్తున్నారు. కాని ఈ నెల 25 నుంచి మళ్లీ జన్మభూమి కార్యక్రమం పునఃప్రారంభం కానుంది. అందరికీ పింఛన్లు అందిస్తే సభలకు జనంరారనే అనుమానం అధికార పార్టీ నేతలకు వచ్చింది. అనుకున్నదే తడవుగా పింఛన్ల పంపిణీ నిలిపివేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో శనివారం జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీని పోస్టుమాస్టర్లు నిలిపివేశారు. అభాగ్యుల ఆవేదన పెరిగిన పింఛన్ చేతికి వస్తుందని వేయి కళ్లతో ఎదురు చూస్తున్న అభాగ్యులకు ప్రభుత్వ నిర్ణయం పిడుగుపాటుగా మారింది. పింఛన్‌కు, జన్మభూమికీ లింకు పెడుతూ దానిని అందకుండా చేస్తుండడంతో మండిపడుతున్నారు. దీపావళికి ఇంట్లో పింఛన్ వెలుగులు వస్తాయని కొందరు, అనారోగ్యానికి అక్కరకు వస్తుందని మరికొందరు ఆశించినా వారికి నిరాశే మిగిలింది. ప్రభుత్వ ఆదేశాల మేరకే.. జన్మభూమి ఉన్న రోజునే పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందువలన పింఛన్ల పంపిణీ ఆపేశాం. తిరిగి జన్మభూమి జరిగే రోజు ఆయా గ్రామాల్లోని లబ్ధిదారులకు పింఛన్లు ఇస్తాం. - ఏపీడీ.శర్మ, పోస్టల్ సూపరింటెండెంట్, తిరుపతి -
ఎట్టకేలకు ‘నీలం’ పరిహారం
4023 మందికి రూ.2.34 కోట్లు విడుదల మరో 10,190 మందికి మొండిచేయి ఆహార పంటలకే ఇన్పుట్ సబ్సిడీ విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ప్రభుత్వ నిర్ణయాలు రైతులను నిలువునా ముం చుతున్నాయి. అతివృష్టి, అనావృష్టిల కు పంటలు కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అన్నదాతలను మరిం త క్షోభకు గురిచేస్తున్నాయి. పెట్టుబడులు కూడా రాక అప్పుల్లో కూరుకుపోయిన రైతులను ఆదుకోవాల్సిన సర్కారు.. ఇన్పుట్ సబ్సిడీ అందించే విషయంలో సవాలక్ష నిబంధనలతో ఇబ్బందులకు గురిచేస్తోంది. తాజాగా రెండేళ్ల క్రితం నీలం తుపాను నష్టానికి ఇన్పుట్ సబ్సిడీని ఇప్పుడు విడుదల చేసింది. ఇందులో కూడా కేవలం బ్యాంకు ఖాతాలు ఉన్నవారికే ఇస్తూ.. మిగిలిన 10 వేల మందికి రిక్తహస్తాన్ని చూపిం చింది. 2011 నవంబర్‌లో నీలం తుపాను కారణంగా జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. ఆహారపంటలు నీట మునిగి సుమారు రూ.90 కోట్లు నష్టం వాటిల్లింది. అయితే ప్రభు త్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కేవలం 1848.78 హెక్టార్లలో మాత్రమే నష్టం జరిగినట్లు నిర్ధారించి 13,235 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.4.13 కోట్లు కు ప్రతిపాదించారు. గతేడాది తొలి విడతగా 671.58 హెక్టార్లలో జరిగిన నష్టానికి 6167 మంది రైతులకు రూ.67.16 లక్షలు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. మిగిలిన రైతులను విస్మరించిన సర్కారు తాజాగా రెండో విడతలో రూ.2.34 కోట్లు మాత్రమే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 535.92 హెక్టార్లలో జరిగిన నష్టానికి బ్యాంకు ఖాతాలు ఉన్న 4023 మంది రైతులకు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేసింది. ఇంకా 10,190 మంది రైతులకు పరి హారం అందించాల్సి ఉంది. ఏజెన్సీలో బ్యాంకు సేవలు అందుబాటులో లేకపోవడంతో వారం తా ఖాతాలు తీసుకొనే వెసులుబాటులేదు. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారులు అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించారు. ఇటీవల వ్యవసాయ పంటలకు సంబంధించి ఏజెన్సీ రైతులకు చెక్కుల ద్వారా పంపిణీకి అంగీకరించిన ప్రభుత్వం, ఆహారపంటల రైతుల విషయంలో మాత్రం మళ్లీ పాత పద్ధతిలోనే కొనసాగడం సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనం.