ఇక కిక్కే కిక్
షాపింగ్ మాల్స్ బార్లా
మందుబాబులకు మద్యం మరింత చేరువకానుంది. శ్లాబ్ ధరల్లో స్వల్ప మార్పులు చేయడమే కాకుండా.. ఇకపై మద్యం అన్ని ప్రాంతాల్లో.. అన్నిచోట్లా అందుబాటులో ఉండేలా సోమవారం ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటించింది. ముఖ్యంగా షాపింగ్‌మాల్స్‌లో మద్యం విక్రయాలకు అనుమతినిచ్చింది. ధరల్లో చిన్నపాటి మార్పులు, కొత్త శ్లాబ్‌లు చేర్చి నూతన మద్యం పాలసీని సిద్ధం చేసింది. ఈ క్రమంలో జిల్లాలో మంగళవారం వైన్ షాపుల కేటాయింపునకు గజిట్ విడుదల కానుంది.
- శ్లాబ్ ధరల్లో స్వల్ప మార్పులు
- లెసైన్స్ ఫీజుల పెంపు
- ఆదాయం కోసం ప్రభుత్వ నిర్ణయాలు
- నేడు వైన్‌షాపుల గజిట్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, విజయవాడ : జిల్లాలో 335 వైన్‌షాపులు ఉన్నాయి. వీటిలో ఇకపై 35 షాపులు ప్రభుత్వమే నిర్వహిస్తుంది. మిగిలిన 300 షాపులకు గజిట్ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి.. లాటరీ ప్రక్రియ ద్వారా లెసైన్సులు జారీ చేయనున్నారు. దీనివల్ల ఏడాదికి సగటున రూ.20కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఈ ఏడాది పాలసీలో మార్పులు చేయడం వల్ల ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది.
విజయవాడ డివిజన్‌లో ఉన్న 162 వైన్‌షాపుల్లో 16, మచిలీపట్నంలోని 173 వైన్‌షాపుల్లో 19 ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఎక్సైజ్‌శాఖ అధికారులు సోమవారమంతా హైదరాబాద్‌లోనే ఉండి సుదీర్ఘ కసరత్తు చేశారు. మంగళవారం జిల్లాలో గజిట్‌ను విడుదల చేయనున్నారు. మంగళవారం నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించి 29న మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో లాటరీ ప్రక్రియ ద్వారా షాపులు కేటాయించనున్నారు.
మారిన శ్లాబ్‌లు
ఈసారి ప్రభుత్వం ఏడు రకాల శ్లాబ్‌లు ప్రకటించింది. ఐదు లక్షలపైన జనాభా ఉండే ప్రాంతంలో గతంలో రూ.64 లక్షల లెసైన్స్ ఫీజు ఉండేది. దీనిని రూ.65 లక్షలకు మార్చారు. ఇది విజయవాడ నగరానికే వర్తిస్తుంది. ఐదువేల జనాభాలోపు ఉన్న ప్రాంతంలో రూ.30లక్షలు, 5 నుంచి 10వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.34 లక్షలు, 10 నుంచి 25వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.37లక్షలు, 25వేల నుంచి 50వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.40లక్షలు, 50వేల నుంచి మూడు లక్షల జనాభా ఉన్న ప్రాంతంలో రూ.50 లక్షల శ్లాబ్‌లు నిర్ణయించారు. అయితే, జిల్లాలో రూ.65లక్షల శ్లాబ్, మున్సిపాలిటీల్లో రూ.45 లక్షల శ్లాబ్ ఎక్కువగా వర్తిస్తుంది. గతంలో దరఖాస్తు ధర కామన్‌గా రూ.30వేలు ఉండేది. ఈ ధరను గ్రామీణ ప్రాంతాలకే పరిమితం చేసి.. పట్టణ ప్రాంతాలకు రూ.40వేలు, నగరాలకు రూ.50వేలుగా నిర్ణయించారు.
ఇదంతా తిరిగి చెల్లించని రుసుము కావటంతో వీటిద్వారా సుమారు రూ.10 కోట్లపైనే ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. గత ఏడాది జిల్లాలో లెసైన్స్ ఫీజుల ద్వారా ఏడాదికి రూ.116 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది అది మరింత పెరుగుతుందని అధికారుల అంచనా. సగటున రూ.125 కోట్ల నుంచి రూ.130 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది 335 వైన్‌షాపులకు గానూ 307 షాపులు మాత్రమే లాటరీ ద్వారా వ్యాపారులు దక్కించుకున్నారు. మిగిలిన షాపులు రెండేళ్లుగా ఖాళీగానే ఉన్నాయి. ఈ ఏడాది ప్రభుత్వమే 35 షాపులు నిర్వహించనున్న క్రమంలో ఖాళీగా మిగిలే షాపుల్లో ఎక్కువ ప్రభుత్వమే నిర్వహించే అవకాశం ఉంది.