Wine Shops license
-
పెరగనున్న కిక్కు!
సాక్షి, రంగారెడ్డి: కొత్త మద్యం పాలసీ ద్వారా ఆబ్కారీ శాఖకు కాసుల కిక్కు రానుంది. గతంతో పోలిస్తే ఈసారి దరఖాస్తు ఫీజు, కిందిస్థాయి స్లాబ్‌కు సంబంధించి రిటైల్ షాప్ ఎక్సైజ్ ఫీజు ( లైసెన్స్) పెరగడంతో అదే స్థాయిలో ఆదాయం అదనంగా చేకూరనుంది. 2019–21 మద్యం పాలసీని ఖరారు చేసిన సర్కారు.. దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలోని 422 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలైంది. గతంతో పోలిస్తే దరఖాస్తు ఫీజు, రిటైల్ షాప్ ఎక్సైజ్ ఫీజును ప్రభుత్వం పెంచడంతో ఆశావహుల నుంచి ఒకింత అసంతృప్తి వ్యక్తమవుతోంది. మొన్నటి వరకు ఉన్న దరఖాస్తు ఫీజు ధర అమాంతం రెట్టింపు అయింది. రూ.లక్ష నుంచి రూ.2లక్షలకు ఎగబాకింది. అలాగే, రిటైల్ షాప్ ఎక్సైజ్ ఫీజు పెంచడంతోపాటు నాలుగు స్లాబులుగా ఉన్న లైసెన్స్ ఫీజును.. ఆరు స్లాబులుగా మార్చారు. పాత పాలసీ ప్రకారం కనిష్టంగా లైసెన్స్ ఫీజు రూ.45 లక్షలు ఉండగా నూతన పాలసీలో దీనిని రూ.50 లక్షలుగా చేశారు. రూ.1.10 కోట్ల గరిష్ట ఫీజులో ఎలాంటి మార్పు లేదు. మిగిలిన స్లాబులు రూ.55 లక్షలు, రూ.60 లక్షలు, రూ.65 లక్షలు, రూ.85 లక్షలుగా నిర్ణయించారు. పెరిగిన షాపుల సంఖ్య జిల్లా వైన్స్ రంగారెడ్డి 195 మేడ్చల్ 182 వికారాబాద్ 45 పాత పాలసీ ప్రకారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 412 మద్యం దుకాణాలు ఉన్నాయి. కొత్త పాలసీ ప్రకారం ఈ సంఖ్య 422కు చేరుకుంది. జిల్లాకు కొత్తగా దుకాణాలు మంజూరు కాకపోయినా.. హైదరాబాద్ నుంచి పది షాపులను మన జిల్లాలో కలిపారు. ఆ షాపుల్లో మద్యం అమ్మకాలు చాలా తక్కువగా ఉండటంతో.. రంగారెడ్డి జిల్లాలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. ఫలితంగా గతంతో పోలిస్తే ఈసారి అదనంగా మరో 10 షాపులు పెరిగాయి. శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో ఏడు, సరూర్‌నగర్ ఈఎస్ పరిధిలో ఒక షాపు అదనంగా ఏర్పాటు కానున్నాయి. ఇక మేడ్చల్ జిల్లా పరిధిలోకి రెండు దుకాణాలు వెళ్లనున్నాయి. దరఖాస్తు ఫీజు రూ. 2 లక్షలు దరఖాస్తుల విక్రయం ద్వారానే ఉమ్మడి జిల్లా నుంచి రూ.130 కోట్లను రాబట్టాలని ఆబ్కారీ శాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా షాపుల కోసం పోటీని పెంచేందుకు ఈఎండీని ప్రభుత్వం ఎత్తివేసిందని ఎౖక్సైజ్‌శాఖ అధికారి ఒకరు తెలిపారు. అలాగే, దరఖాస్తు ఫీజును రూ.2 లక్షలకు పెంచేశారు. చివరిసారి కొత్త రంగారెడ్డి జిల్లా పరిధిలో 187 దుకాణాలకు 3,889 దరఖాస్తులు అందాయి. ఆ సమయంలో ఒక్కో దరఖాస్తు ధర రూ.లక్షగా ఉంది. ఈ లెక్కన దరఖాస్తుల ఫీజు రూపంలోనే ఆబ్కారీ శాఖకు రూ.38.89 కోట్ల ఆదాయం సమకూరింది. మేడ్చల్, వికారాబాద్ జిల్లాలు కలుపుకుంటే దాదాపు రూ.90 కోట్లు వచ్చిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 16 వరకు దరఖాస్తుల స్వీకరణ కొత్త దుకాణాలు దక్కించుకునేందుకు ఈనెల 9 నుంచి 16వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 18వ తేదీన డ్రా తీసి షాపులను కేటాయించనున్నట్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ మహ్మద్ యాసిన్ ఖురేషీ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలను ఇంకా ఖరారు చేయలేదన్నారు. ఒకటిరెండు రోజుల్లో ఆ వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తులు అన్ని ఎక్సైజ్ పోలీస్స్టేషన్లు, ఈఎస్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి. అలాగే వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాత పాలసీ ప్రకారమే మద్యం దుకాణాల పనివేళల్లో ఎలాంటి మార్పులేదు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు తెరిచే ఉంటాయి. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. అదే రోజు కొత్త మద్యం దుకాణాలు విక్రయాలు ప్రారంభిస్తాయి. -
మాకొద్దు బాబోయ్!
నెల రోజులపాటు ప్రభుత్వం పొడిగించిన మేర వైన్ షాపులు నిర్వహించేందుకు దుకాణాల యజమానులు వెనుకంజవేస్తున్నారు. వైన్ షాపులను రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగా నెల రోజులపాటు షాపు నడిపితే తమకు లాభం రాకపోగా, నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు. మద్యం అమ్మినందుకుగానూ ప్రభుత్వం ఇచ్చే కమీషన్ లైసెన్స్ ఫీజుకు కూడా సరిపోదని, షాపు నిర్వహణకు అయ్యే ఇతర ఖర్చులు తాము భరించలేమని అంటున్నారు. దీంతో రాష్ట్రంలోని దాదాపు 80 శాతం మంది లైసెన్సులు మళ్లీ రెన్యువల్ చేసుకోలేమని తెగేసి చెబుతున్నారు. అయితే ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు మాత్రం ముందు లైసెన్స్ ఫీజు కట్టి రెన్యువల్ చేసుకోవాలని ఆ తర్వాతే ఏదైనా మాట్లాడదామని అంటుండటం గమనార్హం. – సాక్షి, హైదరాబాద్ వైన్ షాపుల లెక్కలివీ.. ప్రస్తుతం రాష్ట్రంలో 2,216 వైన్ షాప్‌లు నడుస్తున్నాయి. వీటికిగాను గ్రామీణ ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు కింద యజమానులు ఏటా రూ.45 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే నెలకు రూ.3.75 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మున్సిపాల్టీల్లో రూ.55 లక్షల లైసెన్స్ ఫీజు.. అంటే నెలకు రూ.4.58 లక్షలు, కార్పొరేషన్లలో రూ.1.10 కోట్లు ఫీజు ఉండగా, నెలకు రూ.9.16 లక్షలు లైసెన్స్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం సెప్టెంబర్ 30తో లైసెన్స్ గడువు ముగుస్తుండటంతో అక్టోబర్ ఒకటి నుంచి నెల రోజులపాటు లైసెన్స్ పొడగించుకోవాలని ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వుల మేరకు లైసెన్స్ ఫీజులు కడితే గ్రామీణ ప్రాంతాల్లో అక్టోబర్ నెలకి రూ.3.75 లక్షలు లైసెన్స్ ఫీజు కింద కట్టాల్సి ఉంటుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో రోజుకి రూ. 2.50 లక్షల కౌంటర్ అవుతుందనుకున్నా, నెలకు రూ. 77.50 లక్షల కౌంటర్ ఉంటుంది. ఇందులో యజమానికి 4.4 శాతం కమీషన్ ద్వారా వచ్చేది రూ. 3.41 లక్షలు మాత్రమే. అంటే లైసెన్స్ ఫీజుకన్నా ఈ మొత్తం 34 వేలు తక్కువ. దీనికి తోడు షాపుల అద్దె, జీతాలు, పవర్ బిల్లు, రవాణా ఖర్చులు కలిపి మరో రూ.2.30 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ లెక్కన గ్రామీణ ప్రాంతాల్లోనే కనిష్టంగా 2.64 లక్షల మేర యజమానులకు నష్టం ఉంటోంది. ఈ నేపథ్యంలో టర్నోవర్ ట్యాక్స్‌ను 8 నుంచి 4శాతం తగ్గించాలని షాపుల యజమానులు కోరుతున్నారు. అలా అయితే తమకు కొంత లాభం వస్తుందంటున్నారు. లేదంటే లైసెన్స్ ఫీజు కట్టినప్పుడల్లా ఆ మొత్తానికి ఏడింతలు విలువచేసే మద్యం 18 శాతం కమీషన్ చొప్పున ఇచ్చే ఆనవాయితీ ఉందని, ప్రభుత్వం దానిని కొనసాగిస్తే ఎలాగోలా నెట్టుకొస్తామని దుకాణదారులు అంటున్నారు. ఇక 5.6 శాతంగా ఉన్న వ్యాట్‌ను యథాతధంగా చెల్లిస్తామని చెబుతున్నారు. ఇదే విషయమై కొందరు యజమానులు ప్రభుత్వ స్పెషల్ సీఎస్ సోమేశ్‌కుమార్‌ను కలవగా, ముందు షాపుల రెన్యువల్‌కు లైసెన్సు ఫీజు కట్టాలని, తర్వాతే ఏదైనా చర్చిద్దామని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుత విధానంతో రెన్యువల్ లైసెన్స్ ఫీజును కట్టడానికి 80% యజమానులు సుముఖంగా లేరు. -
మద్యం... పొడిగింపు తథ్యం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని మద్యం దుకాణాల లైసెన్సులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 30తో గడువు ముగియనుండగా అక్టోబర్ 31 వరకు పాత లైసెన్సులతో షాపులు నడుపుకునేందుకు అనుమతి ఇవ్వనుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారని విశ్వసనీయ సమాచారం. దీంతో మరో నెల రోజుల పాటు పాతషాపులే కొనసాగేలా నేడో, రేపో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. అయితే, 3 నెలలు రెన్యువల్ చేయాలనే ప్రతిపాదనపై కూడా చర్చ జరిగినా, మున్సిపల్ ఎన్నికలు వస్తాయనే ఆలోచనతో ప్రస్తుతానికి నెల రోజుల రెన్యువల్ ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి, ఎక్సైజ్ శాఖ ప్రతి రెండేళ్లకోసారి ఒక పాలసీని రూపొందిస్తుంది. రాష్ట్రంలో ఎన్ని వైన్‌షాపుల(ఏ4 షాపులు)కు అనుమతినివ్వాలి? లైసెన్స్ ఫీజు ఎంత నిర్ధారించాలి? టెండర్లు ఎలా స్వీకరించాలి? అనే అంశాలతో 2017–19 సంవత్సరాలకు గాను 2017లో వచ్చిన ప్రస్తుత పాలసీ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. అక్టోబర్ 1 నుంచి కొత్త పాలసీ ప్రకారం షాపులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. కానీ, ఎక్సైజ్ ఉన్నతాధికారులు రూపొందించిన కొత్త పాలసీని ఆమోదించడంలో కొంత జాప్యం జరిగింది. పాలసీని ఆమోదించి ప్రకటించాలల్సిన సమయంలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి రావడంతో కేసీఆర్ ఈ పాలసీ కోసం సమయం కేటాయించలేకపోయారు. ఈ నేపథ్యంలో కొత్త పాలసీ కాకపోయినా ప్రస్తుత పాలసీలో కొన్ని మార్పులు మాత్రమే చేసి ఆ మార్పుల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి అక్టోబర్ 1 నుంచి కొత్త షాపులు ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. అయితే, అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 వరకు కొనసాగడం, ఆ తర్వాత బ్యాంకులకు వరుసగా సెలవులు రావడంతో టెండర్ల స్వీకరణలో ఇబ్బందులు కలుగుతాయనే అభిప్రాయంతో షాపులు రెన్యువల్ చేయాలని నిర్ణయించినట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలు చేస్తోన్న ఎక్సైజ్ పాలసీని అధ్యయనం చేసి దానికి అనుగుణంగా చేయాల్సిన మార్పులు, చేర్పులపై కూడా స్పష్టత రాలేదని తెలుస్తోంది. దీంతో మరో నెల రోజుల పాటు రాష్ట్రంలోని 2,216 వైన్‌షాపులు పాత లైసెన్సులతోనే కొనసాగనున్నాయి. -
ఇక కిక్కే కిక్
షాపింగ్ మాల్స్ బార్లా మందుబాబులకు మద్యం మరింత చేరువకానుంది. శ్లాబ్ ధరల్లో స్వల్ప మార్పులు చేయడమే కాకుండా.. ఇకపై మద్యం అన్ని ప్రాంతాల్లో.. అన్నిచోట్లా అందుబాటులో ఉండేలా సోమవారం ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటించింది. ముఖ్యంగా షాపింగ్‌మాల్స్‌లో మద్యం విక్రయాలకు అనుమతినిచ్చింది. ధరల్లో చిన్నపాటి మార్పులు, కొత్త శ్లాబ్‌లు చేర్చి నూతన మద్యం పాలసీని సిద్ధం చేసింది. ఈ క్రమంలో జిల్లాలో మంగళవారం వైన్ షాపుల కేటాయింపునకు గజిట్ విడుదల కానుంది. - శ్లాబ్ ధరల్లో స్వల్ప మార్పులు - లెసైన్స్ ఫీజుల పెంపు - ఆదాయం కోసం ప్రభుత్వ నిర్ణయాలు - నేడు వైన్‌షాపుల గజిట్ నోటిఫికేషన్ విడుదల సాక్షి, విజయవాడ : జిల్లాలో 335 వైన్‌షాపులు ఉన్నాయి. వీటిలో ఇకపై 35 షాపులు ప్రభుత్వమే నిర్వహిస్తుంది. మిగిలిన 300 షాపులకు గజిట్ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి.. లాటరీ ప్రక్రియ ద్వారా లెసైన్సులు జారీ చేయనున్నారు. దీనివల్ల ఏడాదికి సగటున రూ.20కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఈ ఏడాది పాలసీలో మార్పులు చేయడం వల్ల ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. విజయవాడ డివిజన్లో ఉన్న 162 వైన్‌షాపుల్లో 16, మచిలీపట్నంలోని 173 వైన్‌షాపుల్లో 19 ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఎక్సైజ్‌శాఖ అధికారులు సోమవారమంతా హైదరాబాద్‌లోనే ఉండి సుదీర్ఘ కసరత్తు చేశారు. మంగళవారం జిల్లాలో గజిట్‌ను విడుదల చేయనున్నారు. మంగళవారం నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించి 29న మచిలీపట్నంలోని కలెక్టరేట్లో లాటరీ ప్రక్రియ ద్వారా షాపులు కేటాయించనున్నారు. మారిన శ్లాబ్‌లు ఈసారి ప్రభుత్వం ఏడు రకాల శ్లాబ్‌లు ప్రకటించింది. ఐదు లక్షలపైన జనాభా ఉండే ప్రాంతంలో గతంలో రూ.64 లక్షల లెసైన్స్ ఫీజు ఉండేది. దీనిని రూ.65 లక్షలకు మార్చారు. ఇది విజయవాడ నగరానికే వర్తిస్తుంది. ఐదువేల జనాభాలోపు ఉన్న ప్రాంతంలో రూ.30లక్షలు, 5 నుంచి 10వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.34 లక్షలు, 10 నుంచి 25వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.37లక్షలు, 25వేల నుంచి 50వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.40లక్షలు, 50వేల నుంచి మూడు లక్షల జనాభా ఉన్న ప్రాంతంలో రూ.50 లక్షల శ్లాబ్‌లు నిర్ణయించారు. అయితే, జిల్లాలో రూ.65లక్షల శ్లాబ్, మున్సిపాలిటీల్లో రూ.45 లక్షల శ్లాబ్ ఎక్కువగా వర్తిస్తుంది. గతంలో దరఖాస్తు ధర కామన్‌గా రూ.30వేలు ఉండేది. ఈ ధరను గ్రామీణ ప్రాంతాలకే పరిమితం చేసి.. పట్టణ ప్రాంతాలకు రూ.40వేలు, నగరాలకు రూ.50వేలుగా నిర్ణయించారు. ఇదంతా తిరిగి చెల్లించని రుసుము కావటంతో వీటిద్వారా సుమారు రూ.10 కోట్లపైనే ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. గత ఏడాది జిల్లాలో లెసైన్స్ ఫీజుల ద్వారా ఏడాదికి రూ.116 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది అది మరింత పెరుగుతుందని అధికారుల అంచనా. సగటున రూ.125 కోట్ల నుంచి రూ.130 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది 335 వైన్‌షాపులకు గానూ 307 షాపులు మాత్రమే లాటరీ ద్వారా వ్యాపారులు దక్కించుకున్నారు. మిగిలిన షాపులు రెండేళ్లుగా ఖాళీగానే ఉన్నాయి. ఈ ఏడాది ప్రభుత్వమే 35 షాపులు నిర్వహించనున్న క్రమంలో ఖాళీగా మిగిలే షాపుల్లో ఎక్కువ ప్రభుత్వమే నిర్వహించే అవకాశం ఉంది.