సాక్షి, రంగారెడ్డి: కొత్త మద్యం పాలసీ ద్వారా ఆబ్కారీ శాఖకు కాసుల కిక్కు రానుంది. గతంతో పోలిస్తే ఈసారి దరఖాస్తు ఫీజు, కిందిస్థాయి స్లాబ్‌కు సంబంధించి రిటైల్ షాప్ ఎక్సైజ్ ఫీజు ( లైసెన్స్) పెరగడంతో అదే స్థాయిలో ఆదాయం అదనంగా చేకూరనుంది. 2019–21 మద్యం పాలసీని ఖరారు చేసిన సర్కారు.. దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలోని 422 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలైంది. గతంతో పోలిస్తే దరఖాస్తు ఫీజు, రిటైల్ షాప్ ఎక్సైజ్ ఫీజును ప్రభుత్వం పెంచడంతో ఆశావహుల నుంచి ఒకింత అసంతృప్తి వ్యక్తమవుతోంది. మొన్నటి వరకు ఉన్న దరఖాస్తు ఫీజు ధర అమాంతం రెట్టింపు అయింది. రూ.లక్ష నుంచి రూ.2లక్షలకు ఎగబాకింది. అలాగే, రిటైల్ షాప్ ఎక్సైజ్ ఫీజు పెంచడంతోపాటు నాలుగు స్లాబులుగా ఉన్న లైసెన్స్ ఫీజును.. ఆరు స్లాబులుగా మార్చారు. పాత పాలసీ ప్రకారం కనిష్టంగా లైసెన్స్ ఫీజు రూ.45 లక్షలు ఉండగా నూతన పాలసీలో దీనిని రూ.50 లక్షలుగా చేశారు. రూ.1.10 కోట్ల గరిష్ట ఫీజులో ఎలాంటి మార్పు లేదు. మిగిలిన స్లాబులు రూ.55 లక్షలు, రూ.60 లక్షలు, రూ.65 లక్షలు, రూ.85 లక్షలుగా నిర్ణయించారు.
పెరిగిన షాపుల సంఖ్య
జిల్లా | వైన్స్ |
రంగారెడ్డి | 195 |
మేడ్చల్ | 182 |
వికారాబాద్ | 45 |
పాత పాలసీ ప్రకారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 412 మద్యం దుకాణాలు ఉన్నాయి. కొత్త పాలసీ ప్రకారం ఈ సంఖ్య 422కు చేరుకుంది. జిల్లాకు కొత్తగా దుకాణాలు మంజూరు కాకపోయినా.. హైదరాబాద్ నుంచి పది షాపులను మన జిల్లాలో కలిపారు. ఆ షాపుల్లో మద్యం అమ్మకాలు చాలా తక్కువగా ఉండటంతో.. రంగారెడ్డి జిల్లాలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. ఫలితంగా గతంతో పోలిస్తే ఈసారి అదనంగా మరో 10 షాపులు పెరిగాయి. శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో ఏడు, సరూర్‌నగర్ ఈఎస్ పరిధిలో ఒక షాపు అదనంగా ఏర్పాటు కానున్నాయి. ఇక మేడ్చల్ జిల్లా పరిధిలోకి రెండు దుకాణాలు వెళ్లనున్నాయి.
దరఖాస్తు ఫీజు రూ. 2 లక్షలు
దరఖాస్తుల విక్రయం ద్వారానే ఉమ్మడి జిల్లా నుంచి రూ.130 కోట్లను రాబట్టాలని ఆబ్కారీ శాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా షాపుల కోసం పోటీని పెంచేందుకు ఈఎండీని ప్రభుత్వం ఎత్తివేసిందని ఎౖక్సైజ్‌శాఖ అధికారి ఒకరు తెలిపారు. అలాగే, దరఖాస్తు ఫీజును రూ.2 లక్షలకు పెంచేశారు. చివరిసారి కొత్త రంగారెడ్డి జిల్లా పరిధిలో 187 దుకాణాలకు 3,889 దరఖాస్తులు అందాయి. ఆ సమయంలో ఒక్కో దరఖాస్తు ధర రూ.లక్షగా ఉంది. ఈ లెక్కన దరఖాస్తుల ఫీజు రూపంలోనే ఆబ్కారీ శాఖకు రూ.38.89 కోట్ల ఆదాయం సమకూరింది. మేడ్చల్, వికారాబాద్ జిల్లాలు కలుపుకుంటే దాదాపు రూ.90 కోట్లు వచ్చిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
16 వరకు దరఖాస్తుల స్వీకరణ
కొత్త దుకాణాలు దక్కించుకునేందుకు ఈనెల 9 నుంచి 16వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 18వ తేదీన డ్రా తీసి షాపులను కేటాయించనున్నట్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ మహ్మద్ యాసిన్ ఖురేషీ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలను ఇంకా ఖరారు చేయలేదన్నారు. ఒకటిరెండు రోజుల్లో ఆ వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తులు అన్ని ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్లు, ఈఎస్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి. అలాగే వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పాత పాలసీ ప్రకారమే మద్యం దుకాణాల పనివేళల్లో ఎలాంటి మార్పులేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు తెరిచే ఉంటాయి. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. అదే రోజు కొత్త మద్యం దుకాణాలు విక్రయాలు ప్రారంభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment