సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని మద్యం దుకాణాల లైసెన్సులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 30తో గడువు ముగియనుండగా అక్టోబర్ 31 వరకు పాత లైసెన్సులతో షాపులు నడుపుకునేందుకు అనుమతి ఇవ్వనుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారని విశ్వసనీయ సమాచారం. దీంతో మరో నెల రోజుల పాటు పాతషాపులే కొనసాగేలా నేడో, రేపో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. అయితే, 3 నెలలు రెన్యువల్ చేయాలనే ప్రతిపాదనపై కూడా చర్చ జరిగినా, మున్సిపల్ ఎన్నికలు వస్తాయనే ఆలోచనతో ప్రస్తుతానికి నెల రోజుల రెన్యువల్ ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి, ఎక్సైజ్ శాఖ ప్రతి రెండేళ్లకోసారి ఒక పాలసీని రూపొందిస్తుంది. రాష్ట్రంలో ఎన్ని వైన్‌షాపుల(ఏ4 షాపులు)కు అనుమతినివ్వాలి? లైసెన్స్ ఫీజు ఎంత నిర్ధారించాలి? టెండర్లు ఎలా స్వీకరించాలి? అనే అంశాలతో 2017–19 సంవత్సరాలకు గాను 2017లో వచ్చిన ప్రస్తుత పాలసీ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. అక్టోబర్ 1 నుంచి కొత్త పాలసీ ప్రకారం షాపులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది.
కానీ, ఎక్సైజ్ ఉన్నతాధికారులు రూపొందించిన కొత్త పాలసీని ఆమోదించడంలో కొంత జాప్యం జరిగింది. పాలసీని ఆమోదించి ప్రకటించాలల్సిన సమయంలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి రావడంతో కేసీఆర్ ఈ పాలసీ కోసం సమయం కేటాయించలేకపోయారు. ఈ నేపథ్యంలో కొత్త పాలసీ కాకపోయినా ప్రస్తుత పాలసీలో కొన్ని మార్పులు మాత్రమే చేసి ఆ మార్పుల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి అక్టోబర్ 1 నుంచి కొత్త షాపులు ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. అయితే, అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 వరకు కొనసాగడం, ఆ తర్వాత బ్యాంకులకు వరుసగా సెలవులు రావడంతో టెండర్ల స్వీకరణలో ఇబ్బందులు కలుగుతాయనే అభిప్రాయంతో షాపులు రెన్యువల్ చేయాలని నిర్ణయించినట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలు చేస్తోన్న ఎక్సైజ్ పాలసీని అధ్యయనం చేసి దానికి అనుగుణంగా చేయాల్సిన మార్పులు, చేర్పులపై కూడా స్పష్టత రాలేదని తెలుస్తోంది. దీంతో మరో నెల రోజుల పాటు రాష్ట్రంలోని 2,216 వైన్‌షాపులు పాత లైసెన్సులతోనే కొనసాగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment