కాకినాడ : ‘న్యాయం జరగడం ఆలస్యమైతే.. అన్యాయం జరిగినట్టే’ అన్నది నానుడి. ఈ లెక్కన.. న్యాయం జరగాల్సినవారికి అసలు న్యాయమే జరగకపోతే.. దురన్యాయమే జరిగినట్టు. దీని ప్రకారం 2012 సంవత్సరాంతంలో విరుచుకుపడ్డ నీలం తుపానుతో పంట నష్టపోయిన రైతులకు కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం దురన్యాయం చేసినట్టే.
ఆ తుపానుకు జిల్లాలోని 1.43 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని అధికారులే నిర్ధారించగా హెక్టారుకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించింది. జిల్లాలోని 3 లక్షల మంది బాధిత రైతులకు రూ.143 కోట్ల పరిహారం 2013లో మంజూరైంది. తమకు జరిగిన నష్టంతో పోల్చితే ప్రభుత్వం ఇచ్చే సాయం అతి తక్కువే అయినా.. ‘గుడ్డి కన్నా మెల్ల మేలు’ చందంగా ఎంతో కొంత ఊరట కలుగుతుంది కదా అని అన్నదాతలు భావిం చారు. అయితే ప్రకటించిన పరిహారం కూడా రైతులకు అదనుకు, అవసరానికి కాక, మీనమేషాలు లెక్కిస్తూ ఎన్నటికో విడుదలైంది. అందులోనూ ఇప్పటివరకూ 2.65 లక్షల మంది రైతులకు రూ.129 కోట్ల పరిహారం పంపిణీ అయింది. మిగిలిన 35 వేల మంది రైతులూ నేటికీ పరిహారం కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు.
వారు నష్టం చవిచూసిన అనంతరం రెండు క్యాలెండర్లు మారిపోయినా.. ఒక్క రూపాయి పరిహారం కూడా చెల్లించలేదు. అటు రెవెన్యూ, వ్యవసాయ శాఖలు, ఇటు బ్యాంకుల సమన్వయ లోపం కారణంగా రూ.14 కోట్ల పరిహారం ఇప్పటికీ బాధితులకు అందలేదు. రైతుల బ్యాంకు ఖాతా నంబర్లు తప్పుగా నమోదు కావడమో లేక రైతుకు, ఖాతాకు సంబంధం లేకపోవడమో ఇందుకు కారణమని అంటున్నారు. అంతేకాక.. వ్యవసాయ, రెవెన్యూ శాఖల దగ్గర ఉన్న పేర్లకు, బ్యాంకుల్లో ఉన్న రికార్డుకు పొంతన కుదరకపోవడం కూడా పరిహారం చెల్లింపులో క్షమార్హం కాని ఈ జాప్యానికి కారణమని చెబుతున్నారు. నిజానికి పారదర్శకత పేరుతో డెరైక్టు బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) పథకం కింద ఆన్‌లైన్ ద్వారా మొదటిసారిగా నీలం పరిహారాన్ని రైతుకు నేరుగా ఇవ్వాలని ప్రభుత్వం భావించింది.
అయితే అమలులో పారదర్శకత మాట అటుంచి అసలు పరిహారం రైతు కళ్లబడడమే గగనమైంది. పారదర్శకత పేరుతో.. అసలుకే ఎసరు పెట్టే దాని కన్నా గ్రామసభలు పెట్టి పరిహారం బాధితులకు పంపిణీ చేసినా న్యాయం చేసినట్టయ్యేది. కారణమేదైతేనేం.. ఇప్పటివరకూ పరిహారం మాత్రం అందలేదు. జారిపోతున్న ఆశను కూడగట్టుకుంటూ ఆ 35 వేల మంది రైతుల్లో పలువురు గ్రీవెన్స్ సెల్‌లోనో, డయల్ యువర్ కలెక్టర్‌లోనో.. ఇలా ఏ వేదికనూ వదలకుండా నీలం పరిహారం కోసం మొర పెట్టుకుంటూనే ఉన్నారు.
రాష్ట్రపతి పాలనకు ముందు వరకూ అధికార పార్టీకి చెందిన రాష్ట్రస్థాయి నాయకులు ఎవరు జిల్లాకు వచ్చినా పరిహారం దక్కేలా చూడమని అభ్యర్థిస్తూనే వచ్చారు. చివరికి ప్రాణం విసిగి ‘ఏట్లో జారిపడ్డ నాణెం’పై ఆశలు వదులుకున్నట్టే.. తమకు నీలం పరిహారం అందుతుందన్న నమ్మకాన్ని వదులుకోక తప్పదని నిట్టూరుస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా సమన్వయంతో వ్యవహరించి.. ఎన్నడో మంజూరైన నీలం నష్ట పరిహారాన్ని అందజేస్తారో లేక అన్నదాతలకు నిరాశనే మిగులుస్తారో చూడాలి.