ఖాతాల కష్టాలు
=తప్పుల కారణంగా రైతుల తిప్పలు
=నీలం పరిహారం అందక అవస్థలు
=బ్యాంకుల్లో మురుగుతున్న కోట్లు
సాక్షి, విశాఖపట్నం : చిన్న పొర పాటే కావచ్చు కానీ, అది రైతులకు పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. బ్యాంకు ఖాతాలో పొరపాట్ల వల్ల ప్రభుత్వం విడుదల చేసిన పరిహారం వారికి దక్కకుండా పోతోంది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని చందంగా నీలం తుఫాన్ బాధిత రైతుల పరిస్థితి తయారైంది. నిధుల మంజూరు నాటి నుంచి రైతుల బ్యాంకు ఖాతాల తెరిపించే వరకు తొలుత సర్కార్ నిర్లక్ష్యం వహించింది. ఇప్పుడు రైతుల బ్యాంకు ఖాతాల్లో లోపాలు సమస్యగా పరిణమించాయి.
2012లో వచ్చిన నీలం తుఫాన్ వల్ల జిల్లాలో 1,47,812 మంది రైతులు నష్టపోయారు. వీరికి ప్రభుత్వం రూ. 30.41 కోట్లు ఇన్‌ఫుట్ సబ్సిడీగా చెల్లించాల్సి ఉంది. కానీ సర్కార్ వెంటనే స్పందించలేదు. రైతులు గగ్గోలు పెట్టడంతో 2013లో రెండు ధపాలుగా రూ. 23.41 కోట్లు మంజూరు చేసింది. బ్యాంకు ఖాతాలు ఉన్న 57,082 మందికి తొలి విడతగా రూ. 13.34 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని సంబంధిత బ్యాంకు ఖాతాలకు ఒకేసారి వేశారు. కానీ 51,269 మందికి చెందిన ఖాతాల్లోకి మాత్రమే రూ.8.81 కోట్లు జమ అయింది. మిగతా 5,813 మంది ఖాతాల్లోకి డబ్బు జమ కాలేదు. రూ. 1.1 కోట్లు బ్యాంకుల్లో చిక్కుకున్నాయి.
రెండో విడతగా సెప్టెంబర్‌లో 49,101రైతులకు సంబంధించి మరో రూ.10.06 కోట్లు మంజూరయ్యాయి. ఈ మొత్తాన్ని కూడా వ్యవసాయ అధికారులు బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశారు. కానీ 7,586 బ్యాంకు ఖాతాల్లోకి రూ. 1.25 కోట్లు జమ కాలేదు. 13 వేల మందికి పైగా రైతులు డబ్బు తమకు అందలేదని గగ్గోలు పెట్టడంతో పొరపాటు జరిగిందని తేలింది. రైతులిచ్చిన బ్యాంకు ఖాతాల వివరాల్లో పొరపాట్లే ఇందుకు కారణమని అవగతమైంది.
ఇవీ లోపాలు..
చాలామంది రైతులు బ్యాంకు ఖాతా నెంబర్లు సరిగా ఇవ్వలేదు.
మరికొందరు ఒకటి రెండు అంకెలను వదిలేసి నెంబర్లు ఇచ్చారు
తమ ఖాతాలు కాకుండా కుటుంబంలో వేరొకరి బ్యాంకు ఖాతా నెంబర్లను కొందరు ఇచ్చారు.
ఎప్పుడో రద్దయిన బ్యాంకు ఖాతా నెంబర్లు కొంతమంది ఇచ్చేశారు.
నీలం తుఫాన్ విషయంలోనే కాక, కరువు పరిహారం విషయంలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. అప్పట్లో సుమారు ఐదు వేల మందికి సంబంధించిన బ్యాంకు ఖాతాలు సక్రమంగా లేకపోవడంతో రూ. 85 లక్షలు మిగిలిపోయాయి. లోపాలు గుర్తించకపోవడంతో లబ్ధిదారులు అంతవరకే ఉన్నారనుకుని మిగిలిన సొమ్మును ప్రభుత్వానికి తిప్పి పంపేశారు.
దిద్దుబాటు చర్యలు
ఆలస్యంగా అప్రమత్తమైన వ్యవసాయ అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. తప్పుగా ఉన్న ఖాతాలను గుర్తించే పనిలో పడ్డారు. 2692 మంది రైతులకు సంబంధించిన ఖాతా నెంబర్లను మండల వ్యవసాయ అధికారులకు పంపించారు.
అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి సంబంధిత రైతుల కచ్చితమైన బ్యాంకు ఖాతా నెంబర్ తీసుకోవాలని ఆదేశించారు.
వీరే కాకుండా పరిహారం అందని మిగతా రైతులు కూడా అధికారుల్ని కలవాలని కోరారు.
నిధులు అందుబాటులో ఉన్నాయని, రైతులు అధికారులను కలవాలని కోరారు.