దేవరకొండ : దేవరకొండలోని మాయాబజార్‌లో గల 35 నగర పంచాయతీ దుకాణాలకు తాళం పడింది. ఈ వ్యవహారంపై ఆదివారం ‘సాక్షి ’లో మాయాబజార్ పేరిట ప్రత్యేక కథనాన్ని స్పందించింది. దీనికి స్పందించిన నగర పంచాయతీ అధికారులు దుకాణాలను మూసివేశారు. దీనిపై దుకాణాదారుల నుంచి నిరసన వ్యక్తమవుతుండగా ఈ వ్యవహారం జెడ్పీ చైర్మన్ వరకు వెళ్లింది. దేవరకొండ నగర పంచాయతీలోని 35 దుకాణాలను క్రమబద్ధీకరణ పేరుతో కొందరు వ్యాపారులు సొంతం చేసేందుకు కార్యచరణ రూపొందించారు. ఈ వైనాన్ని ‘సాక్షి’ సవివరంగా ప్రచురించింది. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పాలకవర్గం సోమవారం దుకాణాలకు తాళాలు వేసింది. నగర పంచాయతీ చైర్మన్ మంజ్యానాయక్, వైస్ చైర్మన్ జాన్‌యాదవ్, మేనేజర్ రవిందర్‌రావు తదితర సిబ్బందితో దుకాణాలను మూసివేయించి తాళాలు వేశారు.
ఈ క్రమంలో తీవ్ర ఆందోళన కొనసాగింది. దుకాణాదారులు మాకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఖాళీ చేయించడం ఏంటంటూ మొండికేశారు. అధికారులు ఇవేం లెక్కచేయకపోవడంతో కొంత రసాభాస చోటు చేసుకుంది. మేనేజర్‌కు, దుకాణాదారులకు మధ్య జరిగిన స్వల్ప వివాదం పోలీస్‌స్టేషన్ వరకు వెళ్ళింది. దీంతో పోలీసులు కూడా సంఘటన స్థలానికి వచ్చారు. శాంతిభద్రతల దృష్ట్యా నిబంధనల ప్రకారం వ్యవహరించాలని ఎస్‌ఐ మోహన్‌రెడ్డి చెప్పారు. ఇదిలా ఉండగా సుమారు 20 షాపులకు పంచాయతీ సిబ్బంది తాళాలు వేశారు. కాగా పంచాయతీలోని కామాటీలు, ఇతర సిబ్బంది పూర్తి స్థాయిలో సంఘటన స్థలం వద్ద ఉండటంతో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది.
దుకాణాదారులు ఏమంటున్నారంటే....
లీజు గడువు ముగిసినప్పటికీ తాము 2015 వరకు మార్చి వరకు అద్దె చెల్లించామని, కనీసం మార్చి వరకు కూడా గడువు ఇవ్వలేదని దుకాణాదారులు ఆరోపిస్తున్నారు.
పంచాయతీ అధికారులు ఏమంటున్నారంటే...
ఇప్పటికే చాలాసార్లు నోటీసులు ఇచ్చామని, ఫైనల్ నోటీసులు ఇచ్చినా దుకాణాదారులు స్పందించలేదని కాబట్టి నిబంధనల ప్రకారమే దుకాణాదారులను ఖాళీ చేయించడానికి తాళాలు వేశామని అంటున్నారు. ఇదే సమయంలో మార్చి వరకు గడువు ఉండగా ముందుగానే ఖాళీ చేయించారన్న ఆరోపణలున్నాయని ప్రశ్నించగా నెలకు అద్దె రూ. 1200 అని పేర్కొనగా, అది సంవత్సరానికి ఒకసారి కడుతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ప్రవర్తించొద్దు : జెడ్పీ చైర్మన్ బాలునాయక్
దుకాణాలకు తాళాలు వేయడంతో దుకాణాదారులంతా మూకుమ్మడిగా జెడ్పీ చైర్మన్ బాలునాయక్‌ను ఆశ్రయించారు. దౌర్జన్యంగా షాపులకు తాళాలు వేశారని ఏకరువు పెట్టడంతో అధికారులకు ఫోన్ చేసి ఏం చేసినా నిబంధనల ప్రకారమే చేయాలి తప్ప ఇష్టానుసారంగా ప్రవర్తించొద్దని హితువు పలికారు. దుకాణాదారులందరినీ కూర్చోబెట్టి లీజు, అద్దె వంటి అంశాలను మాట్లాడిన తర్వాత చర్యలు తీసుకోవాలన్నారు.
‘మాయాబజార్’ దుకాణాలకు తాళం
Published Tue, Feb 3 2015 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 8:41 PM
Advertisement