గడ్డి.. కరవాల్సిందే!
నల్లగొండ : అసలే కరువు.. ఆపై వానల్లేవు.. జనవరి ఇప్పుడే అయిపోయి ఫిబ్రవరి ప్రారంభమైందో.. లేదో.. ఎండలు మండిపోతున్నాయి.. ఇప్పట్లో గడ్డి మొలిచే పరిస్థితులుండవు.. ఈ నేపథ్యంలో జిల్లాలో బర్రెలు, గొర్రెలు, మేకలు, ఇతర పశువులు ఎలా బతుకుతాయో అనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. పెద్ద ఎత్తున గడ్డి కొరత ఉండడం, వానలు కురిసే పరిస్థితులు లేకపోవడంతో ఐదు నెలలపాటు పశుపక్షాదులు బతకడం కష్టమేనని అధికార యంత్రాంగమే అంచనా వేస్తోంది. జిల్లాలో మొదటి పేజీ తరువాయి అవసరమైన దానికన్నా 82వేల మెట్రిక్ టన్నుల గడ్డి కొరత నెలకొన్నట్లు అధికార వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో పాలు, పెరుగు కూడా ప్రియమయ్యే సూచనలుస్పష్టంగా కనిపిస్తున్నాయి.
మూడు డివిజన్లలో కొరతే..జిల్లాలోని 59 మండలాల్లో 43 మండలాలు గడ్డి కొరతతో అల్లాడుతున్నాయి. 16 మండలాల్లో మాత్రమే అవసరమైన దాని కన్నా ఎక్కువగా గడ్డి లభించే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా దేవరకొండ ప్రాంతం గడ్డి కొరతతో అల్లాడుతోంది. ఆ ప్రాంతంలోని దేవరకొండ, డిండి, చందంపేట, మర్రిగూడ మండలాల్లో పెద్ద ఎత్తున గడ్డి కొరత ఉంది. దేవరకొండ, డిండి మండలాల్లో అయితే దాదాపు సగం గడ్డి తక్కువ పడుతోంది. డివిజన్ల వారీగా పరిశీలిస్తే మిర్యాలగూడ మినహా భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట డివిజన్లలో గడ్డి కొరత బాగా కనిపిస్తోంది. నల్లగొండ డివిజన్‌లో ఉన్న 16 మండలాల్లో కేతేపల్లి, శాలిగౌరారం మినహా అన్ని మండలాల్లో గడ్డి తక్కువగా ఉంది. భువనగిరి డివిజ న్‌లో మొత్తం 14 మండలాలుం డగా, 11 మండలాల్లో గడ్డి కొరత ఉందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. భూదాన్‌పోచంపల్లి, వలి గొండ, రామన్నపేటల్లో మాత్రం అవసరమైనంత గడ్డి అందుబాటులో ఉంది. సూర్యాపేట డివి జన్‌లో చిలుకూరు, కోదాడ మినహా అన్ని మండలాల్లో గడ్డి తక్కువగానే అందుబాటులో ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.
సాగర్ ఆయక ట్టులో పర్వాలేదు జిల్లాలో నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో మాత్రం గడ్డి కొరత లేదని అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం ఈ ఆయకట్టు ప్రాంతమంతా మిర్యాలగూడ డివిజన్‌లో వస్తుండగా, అనుములు, దామరచర్ల, గరిడేపల్లి, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, మఠంపల్లి, నేరేడుచర్ల, త్రిపురారం, వేములపల్లిల్లో గడ్డి లభ్యత బాగానే ఉంది. ఈ డివిజన్‌లోని దేవరకొండ ప్రాంతంలోనే గడ్డి కొరత అధికంగా కనిపిస్తోంది. జిల్లాలో పెద్ద ఎత్తున గడ్డి కొరత ఉండడంతో పశువులను మేపలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పటికే చాలా మంది తమతమ పశువులను కబేళాలకు తరలించడం, లేదంటే సంతల్లో అమ్మడం చేస్తున్నారు. ప్రస్తుతం గడ్డి మూట 150 రూపాయల వరకు ధర పలుకుతోంది. కొన్ని చోట్ల ట్రాక్టర్ గడ్డిని రూ.పదివేల వరకు విక్రయిస్తున్నారు. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే... మరో రెండు నెలల తర్వాత గడ్డి కోసం గడ్డికరవాల్సిందేనని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తగిన విధంగా స్పందించి గడ్డి విత్తనాల పంపిణీ, ఇతర జిల్లాల నుంచి గడ్డి సరఫరా చేయాలని కోరుతున్నారు.