దేవరకొండ : ఊగిసలాటకు తెరపడింది... ఊహాగానాలకు చెక్ పడింది. నక్కలగండి ప్రాజెక్టుపై నెలకొన్న సంశయాలు దాదాపు తీరిపోయాయి. అన్ని అనుమానాలకు తెరతీస్తూ తెలంగాణ ప్రభుత్వం నక్కలగండి ఎత్తిపోతల (డిండి ఎత్తిపోతల) పథకానికి పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టుపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. జూరాల- పాకాల, నక్కలగండి రెండవ డిజైన్ వంటి ఆలోచనలు చేసిన ప్రభుత్వం ఎట్టకేలకు ప్రజాభీష్టం మేరకు పాత డిజైన్‌కే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వచ్చే నెల 5న డిండి మండలం గోనబోయినపల్లి వద్ద ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసే అవకాశాలున్నాయి.
ఇటీవల నక్కలగండికి రూ. 6500 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. నక్కలగండి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి త్వరితగతిన పనులు చేయడానికి నిర్ణయించింది. తొలుత నక్కలగండి ప్రాజెక్టు స్థానంలో జూరాల - పాకాల ప్రాజెక్టును చేపడతామని ప్రకటించడంతో స్థానికంగా కొంత నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత మంత్రి చేసిన ఓ ప్రకటనతో ఈ ప్రాజెక్టుపై కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా ఎట్టిపరిస్థితుల్లో నక్కలగండి ప్రాజెక్టును చేపడతామని హామీ ఇవ్వడంతో పాటు రూ. 6500 కోట్లు ఇస్తామని ముఖ్యమంత్రి కొన్ని రోజుల క్రితమే ప్రకటించడంతో అన్ని అనుమానాలకు తెరపడింది. అయితే జూరాల - పాకాల ప్రాజెక్టుతో పాటు ఏకకాలంలో నక్కలగండి ప్రాజెక్టును కూడా చేపడతామని ప్రకటించిన ప్రభుత్వం ప్రస్తుతానికి నక్కలగండిని చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు శుక్రవారం ఉన్నత స్థాయి ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో చర్యలు కూడా తీసుకున్నట్లు సమాచారం. అయితే వచ్చే నెల 5వ తేదీన పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు నక్కలగండి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. నక్కలగండి వద్ద గానీ లేదా మిడ్ డిండి సమీపంలోని గోనబోయినపల్లి వద్ద గానీ శంకుస్థాపన చేస్తారని సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి గతంలోనే డీపీఆర్ పూర్తయినందున ఈ బడ్జెట్ సమావేశాల్లోపు పరిపాలన అనుమతులకు సంబంధించిన ప్రక్రియనంతా పూర్తి చేసి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ ప్రాజెక్టుకు నిధులు ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
వైఎస్ హయాంలోనే సర్వేకు గ్రీన్‌సిగ్నల్
నక్కలగండి ప్రాజెక్టు ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాలకు సాగునీటితో పాటు నల్లగొండ జిల్లాలోని మునుగోడు, సంస్థాన్ నారాయణపురం, భువనగిరి నియోజకవర్గాలలోని ఫ్లోరైడ్‌పీడిత ప్రాం తాలకు తాగునీరు లక్ష్యంగా నిర్దేశించిన ఈ ప్రా జెక్టును దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్ణయించారు. అప్పట్లోనే సర్వేకు వైఎస్‌ఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీని ద్వారా మహబూబ్‌నగర్ , నల్లగొండ జిల్లాల్లో సుమారు లక్ష ఎకరాల మేర సాగు, తాగునీరు అందుతుంది. (ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు నిర్ణయించిన ఆయకట్టు 3 లక్షల ఎకరాల్లోనే) .
డిజైన్ ఇలా..
ప్రస్తుతం నక్కలగండి ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలమైన నక్కలగండి (లోయర్ డిండి) నుంచి డిండి ప్రాజెక్టు (అప్పర్ డిండి)కు 18 కిలోమీటర్ల మేర నీటిని లిఫ్ట్ చేయడం ద్వారా మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు సాగు, తాగునీటిని అందించాలని ప్రాజెక్టు డిజైన్‌ను రూపొందించారు. ఈ మేరకు గతంలో డీపీఆర్ కూడా పూర్తయ్యింది. ప్రస్తుత ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులో భాగంగా సిద్ధాఫూర్ (మిడ్ డిండి) వద్ద 11 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం గల రిజర్వాయర్‌ను ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి ప్రస్తుత డిండి ప్రాజెక్టును మరో మూడు అడుగులు పెంచి ఈప్రాజెక్టులోకి నీటిని లిఫ్ట్ చేస్తారు. తద్వారా మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో నిర్ణయించిన ప్రాంతాలకు తాగు, సాగునీటిని అందిస్తారు. అయితే డిండి ప్రాజెక్టు రిజర్వాయర్‌ను మరో 3 అడుగుల ఎత్తు పెంచ డం ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో కొంత ప్రాంతం ముంపునకు గురవుతుందని అక్కడి ప్రజాప్రతినిధులు, ప్రజలు వ్యతిరేకిస్తున్నందున డిండి ప్రాజెక్ట్ ఎత్తు పెంచకుండా నిర్దేశించిన అదనపు ఆయకట్టును స్థిరీకరించేందుకు డిజైన్‌లో స్వల్ప మార్పులు చేసినట్లు ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు.
మాటిచ్చారు.. నిలబెట్టుకున్నారు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసినప్పుడు నీ నియోజకవర్గ అభివృద్ధి, నీ రాజకీయ భవిష్యత్ కేసీఆర్‌కు వదిలిపెట్టు అన్నారు. ఆ ఒక్క మాటతో టీఆర్‌ఎస్‌లో చేరా. మాటిచ్చిన ఆయన అక్షరాలా దానిని నిలబెట్టుకుంటున్నారు. ఇప్పటికే నక్కలగండి ఎత్తిపోతల ప్రాజెక్ట్ కోసం రూ. 6500 కోట్లు కేటాయిం చారు. ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేస్తారన్న ప్రగాఢ విశ్వాసం ఉంది. కేసీఆర్ హయాంలోనే ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడం ఖాయం. జిల్లా ప్రజలంతా ఆయనకు రుణపడి ఉండాలి.
- బాలునాయక్, జెడ్పీ చైర్మన్ , టీఆర్‌ఎస్ దేవరకొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్
గిది.. ఖాయం..!
Published Sun, Mar 22 2015 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM
Advertisement
Advertisement